పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పురంజను కథ

  •  
  •  
  •  

4-745-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు గనుంగొని యనంతరంబ ముందటం బురబాహ్యాంతరంబున దివ్యద్రుమ లతాకుంజ పుంజంబును, సమద నదద్విహంగ మత్త మధుకరకుల కోలాహల సంకుల జలాశయ శోభితంబును, హిమనిర్ఝరబిందు సందోహ పరిస్పంద కందళిత మందమలయ మరుదుచ్ఛలిత ప్రవాళవిటప నళినీతటంబును, పాంథజన మనోరంజ నాహ్వాన బుద్ధిజనక కలహంస రాజకీర కోకిలాలాప విరాజమానంబును; మునివ్రత నానావిధ వనమృగవ్రాత బాధారహితంబును నైన పురబాహ్యోద్యానవనంబు నందు యాదృచ్ఛికంబుగ నేకైక శతనాయకం బైన యనుచర దశకంబును, బంచమస్తకసర్ప ప్రతీహారుండును, దోడరాఁ జనుదెంచుచున్న భర్త్రన్వేషిణియుం గామరూపిణియు నవోఢయు నయినట్టి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కనుంగొని = చూసి; అనంతరంబ = తరువాత; ముందటన్ = ఎదురుగ; పుర = పురము యొక్క; బాహ్య = బయట; అంతరంబునన్ = ఆవరణము నందు; దివ్య = దివ్యమైన; ద్రుమ = చెట్లు; లతా = లతలు; కుంజ = పొదరిళ్ళ; పుంజంబునున్ = గుంపులు; సమతన్ = చక్కటి; నద = నదులు; విహంగ = పక్షులు; మత్త = మత్తెక్కిన; మధుకర = తేనెటీగలచే; కుల = సమూహముల; కోలాహల = కోలాహలములు; సంకుల = వ్యాపించిన; జలాశయ = సరస్సులతో; శోభితంబునున్ = శోభిల్లుతున్నది; హిమ = మంచు; నిర్ఝర = సెలయేళ్ళ; బిందు = నీటిబిందువుల; సందోహ = సమూహములు కలిగి; పరిస్పంద = కదలుతున్న; కందళిత = వికసించిన; మంద = మెల్లని; మలయ = గంధం చెట్లనుండి వస్తున్న; మరుత్ = గాలిచే; ఉచ్ఛలిత = ఊపబడుతున్న; ప్రవాళ = చిగురుటాకులు కలిగిన; విటప = చెట్లుగల; నళినీ = పద్మములు ఉన్న; తటంబును = చెరువులు; పాంథ = బాటసారులు యైన; జన = వారి; మనో = మనసును; రంజన = రంజిల్లజేయుటకు; ఆహ్వాన = పిలుస్తున్న; బుద్ధి = భావము; జనక = కలిగిస్తున్న; కలహంస = కలహంసలు; రాజకీర = రామచిలుకలు; కోకిల = కోకిలల; ఆలాప = పాటలతో; విరాజమానంబునున్ = విరాజిల్లుతున్నది; ముని = మునుల; వ్రత = సమూహములు; నానా =అనే; విధ = రకములైన; వన = అడవి; మృగ = జంతువుల; వ్రాత = సమూహముల; బాధా = బాధలు; రహితంబును = లేనిది; ఐన = అయిన; పుర = పురము యొక్క; బాహ్య = బయటి; ఉద్యానవనంబునన్ = తోటలో; అందున్ = లో; యాదృచ్ఛికంబు = అనుకోకుండగ; ఏకైక = ఒక్కొక్కరికి; శత = నూరుమందికి (100); నాయకంబున్ = నాయకత్వము కలిగినవారు; ఐన = అయిన; అనుచర = అనుచరుల; దశకంబును = పదిమంది కలది; పంచ = ఐదు (5); మస్తక = తలల; సర్ప = పాము యైన; ప్రతీహారుండును = ద్వారపాలకుడు; తోడన్ = కూడా సహాయకరముగ; రాన్ = వస్తుండగా; చనుదెంచుచున్న = వెళుతున్న; భర్తృ = భర్త యొక్క; అన్వేషియున్ = వెతుకుతున్నట్టి; కామరూపిణియున్ = కోరిన రూపము ధరించగలది; నవోఢయున్ = కొత్తగా యౌవనము కలిగినది; అయినట్టి = అయినట్టి.

భావము:

ఈ విధంగా చూచిన పురంజనుడు ఆ పురం వెలుపల దివ్య వృక్షాలతో నిండిన ఒక ఉద్యానవనంలో ప్రవేశించాడు. అక్కడ పక్షులు, తుమ్మెదలు చేసే ధ్వనులతో సరస్సులు కోలాహలంగా ఉన్నాయి. సెలయేళ్ళలోని మంచునీటి మీదుగా వచ్చే పిల్లగాలులకు కొలనుల ఒడ్డున ఉన్న చెట్ల కొమ్మలు, చిగుళ్ళు ఊగుతున్నాయి. బాటసారులను పిలుస్తున్నవేమో అన్నట్లుగా రాజహంసలు, చిలుకలు, కోయిలలు తియ్యగా కూస్తున్నాయి. పెక్కురకాల వన్యమృగాలు ఎవ్వరికీ హానిచేయకుండా తిరుగుతున్నాయి. ఆ తోటలో పురంజనుడు యాదృచ్ఛికంగా ఒక యువతిని చూశాడు. పదిమంది అనుచరులు ఆమెతో వస్తున్నారు. వారిలో ఒక్కొక్కడు నూరుమందికి నాయకుడు. ఆమెకు కావలిగా ఐదు తలల పాము ముందు నడుస్తున్నది. ఆ స్త్రీ కామరూపిణి. వరునికోసం వెదకుతున్నది.