పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-738-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘనకర్మాసక్త చిత్తుండై యున్న ప్రాచీనబర్హి కడకు నధ్యాత్మవేదియుం గృపాళువు నైన నారదుండు చనుదెంచి యా రాజునకు జ్ఞానబోధంబు చేయు కొఱకు నతనితో నిట్లనియె “రాజా! యీ కర్మంబునం జేసి యెట్టి శ్రేయస్సు నభిలషించుచున్నవాఁడ వట్టి యనిష్ఠ నిరసనంబు నభీష్ట ప్రాప్తి కరంబు నయిన శ్రేయం బీ కర్మంబు వలన లభింప” దనినం బ్రాచీనబర్హి నారదున కిట్లనియె.

టీకా:

ఘన = అతి మిక్కిలి; కర్మ = కర్మలను చేయుట యందు; ఆసక్త = లగ్నమైన; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; కడ = దగ్గర; కున్ = కు; అధ్యాత్మ = అధ్యాత్మ తత్త్వము; వేదియున్ = తెలిసినవాడు; కృపాళువున్ = దయ కలవాడును; ఐన = అయిన; నారదుండు = నారదుడు; చనుదెంచి = వచ్చి; ఆ = ఆ; రాజున్ = రాజున; కున్ = కు; జ్ఞాన = జ్ఞానమును; బోధంబున్ = బోధించుట; చేయున్ = చేయుట; కొఱకున్ = కోసము; అతని = అతని; తోన్ = తోటి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; రాజా = రాజా; ఈ = ఈ; కర్మంబునన్ = కర్మముల; చేసి = వలన; ఎట్టి = ఎటువంటి; శ్రేయస్సున్ = శుభములను; అభిలషించుచున్నవాడవు = కోరుతున్నావు; అట్టి = అటువంటి; అనిష్ఠ = యిష్టము లేనివి; నిరసంబున్ = తొలగించుట; అభీష్ట = కోరికలు; ప్రాప్తి = లభించునట్లు; కరంబున్ = చేసినవి; అయిన = అయినట్టి; శ్రేయంబు = శుభములు; ఈ = ఈ; కర్మంబున్ = యజ్ఞకర్మల; వలన = వలన; లభింపదు = దొరకదు; అనినన్ = అనగా; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; నారదున్ = నారదున; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

కర్మాసక్తుడైన ప్రాచీనబర్హి వద్దకు ఆధ్యాత్మ తత్త్వవేత్త అయిన నారదమహర్షి దయతో వచ్చి ఈ విధంగా జ్ఞానబోధ చేసాడు. “రాజా! దుఃఖాన్ని తొలగించి, కోరికలను ప్రసాదించే శ్రేయస్సును నీవు కోరుకుంటున్నావు. కాని అట్టి శ్రేయస్సు నీకు ఈ కర్మలవల్ల లభించదు” అని చెప్పగా ప్రాచీనబర్హి నారదునితో ఇలా అన్నాడు.