పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-732-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుద్రుండు ప్రచేతసుల కెఱిగించి వెండియు నిట్లనియె “ప్రచేతసులారా! యిట్టి యోగాదేశ నామకంబైన యీ స్తోత్రంబు బహువారావృత్తిచేఁ బఠించి మనంబున ధరియించి సమాహిత చిత్తులై మీరందఱు నాదరంబున విశ్వాసయుక్తులును, స్వధర్మాచారవంతులును, భగవదర్పితాశయులును నై జపియించుచు సర్వభూతావస్థితుండు నాత్మారాముండు నైన సర్వేశ్వరుని నుతించుచు ధ్యానంబు చేయుచుఁ బూజించుచుండుఁడు; తొల్లి యీ స్తోత్రంబు భగవంతుండైన పద్మసంభవుండు సిసృక్షు వగుచు నాత్మజులమైన మాకును సృజియింప నిచ్ఛగించు భృగ్వాదులకును నెఱింగించె; మేము నా భృగ్వాదులును బ్రజాసర్గంబు నందు బ్రహ్మచోదితులమై యీ స్తోత్రంబునం జేసి విధ్వస్త సమస్త తమోగుణులమై వివిధ ప్రజాసర్గంబు గావించితిమి; కావున నీ స్తోత్రంబు నెల్లప్పుడు నేకాగ్రచిత్తుండును వాసుదేవ పరాయణుండు నై యెవ్వండు జపియించు, వాఁడు వేగంబె శ్రేయస్సును బొంది తదీయ జ్ఞాన ప్లవంబున వ్యసనార్ణవ రూపంబయిన సంసారంబును సుఖతరంబుగఁ దరియిం; చట్టి మదుపదిష్టం బయిన యీ శ్రీహరి స్తవంబు నెవ్వండు చదువుచు దురారాధ్యుం డైన శ్రీహరిం బూజించు, వాఁడు మదుక్త స్తోత్ర గాన సంతుష్టుండును శ్రేయస్సులకు నేకాశ్రయ భూతుండును నగు; శ్రీమన్నారాయణుని వలన సమస్తాభీష్టంబులం బొందు; నెవ్వండేనిఁ బ్రభాతంబున లేచి ప్రాంజలియు శ్రద్ధాసమన్వితుండు నై యీ మంగళస్తవరాజంబును వినిన వినిపించినం గర్మబంధ విముక్తుం డగు;” నని మఱియు నిట్లనియె.

టీకా:

రుద్రుండు = శివుడు {రుద్రుడు - రౌద్రము కలవాడు, శివుడు}; ప్రచేతసుల్ = ప్రచేతసుల; కున్ = కి; ఎఱిగించి = తెలిపి; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ప్రచేతసులారా = ప్రచేతసులూ; ఇట్టి = ఇటువంటి; యోగాదేశ = యోగాదేశము అనెడి {యోగాదేశము - రుద్రోపదిష్టమైన విష్ణు స్తోత్రము యోగాదేశ స్తోత్రము}; నామకంబున్ = పేరు కలది; ఐన = అయిన; ఈ = ఈ; స్తోత్రంబున్ = స్తోత్రమును; బహు = అనేక; వార = పర్యాయముల చేసెడి; వృత్తిన్ = విధానము; చేన్ = చేత; పఠించి = చదివి; మనంబునన్ = మనసులో; ధరియించి = నిలుపుకొని; సమాహిత = నిశ్చలమైన; చిత్తులు = మనసుకలవారు; ఐ = అయ్యి; మీరు = మీరు; అందఱున్ = అందరు; ఆదరంబునన్ = కూర్మితో; విశ్వాస = నమ్మిక; యుక్తులును = కలవారు; స్వ = స్వంత; ధర్మ = ధర్మమును; ఆచారవంతులు = ఆచరించెడివారు; భగవత్ = భగవంతునికి; అర్పితములున్ = సమర్పింపబడినవి; ఐ = అయ్యి; జపియించుచున్ = జపిస్తూ; సర్వ = నిఖిల; భూత = జీవులందు; అవస్థింతుడున్ = వసించి యున్నవాడు; ఆత్మారాముండు = అంతస్థితుండు; ఐన = అయిన; సర్వేశ్వరుని = నారాయణుని; నుతించుచున్ = స్తుతించుతూ; ధ్యానంబున్ = ధ్యానము; చేయుచున్ = చేస్తూ; పూజించుచున్ = పూజించుతూ; ఉండుడు = ఉండండి; తొల్లి = పూర్వము; ఈ = ఈ; స్తోత్రంబున్ = స్తోత్రమును; భగవంతుండు = మహా మహిమాన్వితుడు; ఐన = అయిన; పద్మసంభవుండు = బ్రహ్మదేవుడు; సిసృక్షువు = సృష్టింప గోరువాడు; అగుచున్ = అగుచూ; ఆత్మజులము = పుత్రులము; ఐన = అయిన; మా = మా; కును = కును; సృజియింపన్ = సృష్టింపను; ఇచ్చగించు = కోరెడి; భృగువు = భృగువు; ఆదుల్ = మొదలగువారల; కునున్ = కిని; ఎఱిగించె = తెలిపెను; మేమున్ = మేము కూడ; ఆ = ఆ; భృగువు = భృగువు; ఆదులును = మొదలగువారు; ప్రజా = సంతానములను; సర్గంబున్ = సృష్టి; అందున్ = అందు; బ్రహ్మ = బ్రహ్మదేవుని చేత; చోదితులము = ప్రేరేపింపబడిన వారము; ఐ = అయ్యి; ఈ = ఈ; స్తోత్రంబున్ = స్తోత్రమును; విధ్వస్త = మిక్కిలి నాశనము చేయబడిన; సమస్త = సమస్తమైన; తమోగుణులము = తమోగుణము కలవారము; ఐ = అయ్యి; వివిధ = అనేక రకములైన; ప్రజా = సంతానములను; సర్గంబున్ = సృష్టించుట; కావించితిమి = చేసితిమి; కావునన్ = అందుచేత; ఈ = ఈ; స్తోత్రంబున్ = స్తోత్రమును; ఎల్లప్పుడున్ = ఎప్పుడు; ఏకాగ్ర = ఏకాగ్రత కల; చిత్తుండును = మనసు కలవాడు; వాసుదేవ = విష్ణుమూర్తి యందు; పరాయణుడు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; ఎవ్వండు = ఎవరైతే; జపియించున్ = జపించునో; వాడు = వాడు; వేగంబె = శ్రీఘ్రమే; శ్రేయస్సును = ముక్తిని; పొంది = పొంది; తదీయ = ఆ; జ్ఞాన = జ్ఞానము యనెడి; ప్లవంబునన్ = తెప్పచే; వ్యసన = బాధ యనెడి; ఆర్ణవంబు = సముద్రము; అయిన = అయిన; సంసారంబునున్ = సంసారమును; సుఖతరంబుగా = మిక్కిలి సుఖముగ {సుఖము - సుఖతరము - సుఖతమము}; తరియించు = తరించెడి; అట్టి = అటువంటి; మత్ = నాచే; ఉపదిష్టంబున్ = ఉపదేశింపబడినది; అయిన = అయిన; ఈ = ఈ; శ్రీహరి = విష్ణుమూర్తి; స్తవంబున్ = స్తవమును; ఎవ్వండు = ఎవరైతే; చదవుచున్ = చదువుతూ; దురారాధ్యుండున్ = ఆరాధించుట కష్టమైనవాడు; ఐన = అయిన; శ్రీహరిన్ = విష్ణుని; పూజించు = పూజించెడి; వాడు = వాడు; మత్ = నాచే; ఉక్త = చెప్పబడిన; స్తోత్ర = స్తోత్రము; గాన = గానములచే; సంతుష్టుండును = సంతృప్తి చెందినవాడు; శ్రేయస్సుల్ = శుభముల; కున = కు; ఏక = ఓకటే యైన; ఆశ్రయభూతుండున్ = ఆశ్రయము యైనవాడు; అగు = అయినట్టి; శ్రీమత్ = మిక్కిలి గౌరవనీయమైన; నారాయణుని = విష్ణుని; వలనన్ = వలన; సమస్త = సమస్తమైన; అభీష్టంబులన్ = కామితంబులను; పొందున్ = పొందును; ఎవ్వండేని = ఎవరైతే; లేచి = లేచి; ప్రాంజలియున్ = అంజలి ఘటించిన వాడు; శ్రద్ధా = శ్రద్ధ; సమన్వితుండున్ = కలవాడు; ఐ = అయ్యి; ఈ = ఈ; మంగళ = శుభకరమైన; స్తవ = స్తోత్రములలో; రాజంబునున్ = శ్రేష్ఠమైనది; వినినన్ = వినినను; వినిపించినన్ = చెప్పినను; కర్మ = కర్మమువలని; బంధ = బంధములనుండి; విముక్తుండు = విడిపించబడిన వాడు; అగునున్ = అగును; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా రుద్రుడు ప్రచేతసులకు తెలియజేసి ఇంకా ఇలా అన్నాడు “ప్రచేతసులారా! యోగాదేశం అనే ఈ స్తోత్రాన్ని మీరు పలుమారు వల్లించి, మనస్సులో నిలిపి విశ్వాసంతో జపిస్తూ హరిని పూజించండి. ఈ స్తోత్రాన్ని ప్రజాసృష్టి చేయగోరి పుత్రులమైన మాకు, భృగువు మొదలైనవారికి బ్రహ్మ ఉపదేశించాడు. ప్రజాసృష్టి చేయడానికి బ్రహ్మ పురికొల్పగా మేము, భృగువు మొదలైనవారు ఈ స్తోత్రాన్ని జపించాము. అందువల్ల తమోగుణం నశించింది. వివిధ ప్రజలను సృష్టించాము. కాబట్టి ఏకాగ్రతతో శ్రీహరిపై మనస్సు నిల్పి ఈ స్తోత్రాన్ని జపించేవాడు కొద్ది కాలంలోనే శ్రేయస్సును పొందుతాడు. ఆ జ్ఞానం అనే నావ చేత దుఃఖమయమైన సంసార సముద్రాన్ని మిక్కిలి తేలికగా దాటగలడు. నేను మీకు ఉపదేశించిన శ్రీహరి స్తవాన్ని పఠిస్తూ శ్రీహరిని పూజించేవాడు శ్రేయస్సులకు ఏకాశ్రయమైన నారాయణుని వలన కోరిన కోరికలను పొందుతాడు. వేకువ యందు శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని విన్నా లేక ఇతరులకు వినిపించినా కర్మబంధాలనుండి విముక్తు డౌతాడు.