పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రాచీనబర్హి యఙ్ఞములు

  •  
  •  
  •  

4-699-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్వధర్మ నిరతుండైన పురుషుం డనేక జన్మాంతర సుకృతవిశేషంబులం జతుర్ముఖత్వంబు నొంది, తదనంతరంబునం బుణ్యాతిరేకంబున నన్నుం బొంది యధికారాంతంబున నేనును దేవతాగణంబులును నవ్యాకృతంబైన యే హరిపదంబును బొందుదు; మట్టి పదంబు భాగవతుండు దనంతనె పొందుం; గావున మీరు భాగవతత్త్వంబు నొందుటం జేసి నాకుం బ్రియులై యుండుదురు; భాగవత జనంబులకు నాకంటె నధిక ప్రియుండు లేఁడు; గాన వివిక్తంబును జప్యంబును బవిత్రంబును మంగళంబును నిశ్శ్రేయస కరంబును నైన నా వచనంబు నాకర్ణింపుఁడు; సర్గాదిని బ్రహ్మ నిజనందనుల కెఱింగించిన శ్రీహరి స్తోత్రంబు మీకు నెఱింగింతు; విను; డది యెట్టిదనిన.

టీకా:

స్వధర్మ = స్వంత ధర్మముతో; నిరతుండున్ = మిక్కిలి ఆసక్తి కలవాడు; ఐన = అయిన; పురుషుండు = మానవుడు; అనేక = అనేకమైన; జన్మ = జన్మముల; అంతర = లలోని; సుకృత = పుణ్యముల; విశేషంబువలన్ = విశిష్టతచే; చతుర్ముఖత్వంబున్ = బ్రహ్మపదవిని {చతుర్ముఖత్వము - చతుర్ముఖు (నాలుగు ముఖముల వాని, బ్రహ్మదేవుని) తత్వము (పదవి), బ్రహ్మత్వము}; ఒంది = పొంది; తదనంతరంబునన్ = తరువాత; పుణ్య = పుణ్యము యొక్క; అతిరేకంబునన్ = అతిశయమువలన; నన్నున్ = నన్ను (శివత్వమును); పొంది = పొంది; అధికార = అర్హత ఉన్న కాలము; అంతంబునన్ = అంతములో; నేనునున్ = నేను కూడ; దేవతా = దేవతల; గణంబులునున్ = సమూహములును; అవ్యాకృతంబు = విశదపరచుటకు రానిది; ఐన = అయిన; ఏ = ఏ; హరి = విష్ణుని; పదంబునున్ = స్థితిని; పొందుదుమున్ = పొందెదము; అట్టి = అటువంటి; పదంబున్ = పదవిని; భాగవతుండున్ = భాగవతమా ర్గానుయాయి; తనంతనె = తనంతతనే; పొందున్ = పొందును; కావునన్ = కనుక; మీరు = మీరు; భాగవత = భాగవతము యొక్క; తత్త్వమున్ = తత్త్వమును; ఒందుటన్ = పొందుట; చేసి = వలన; నాకున్ = నాకు; ప్రియులు = ప్రీతి కలవారు; ఐ = అయ్యి; ఉండుదురు = ఉంటారు; భాగవత = భాగవతులు యైన; జనంబుల్ = వారి; కున్ = కి; నా = నా; కంటెన్ = కంటె; అధిక = అధికమైన; ప్రియుండు = ప్రీతిపాత్రుడు; లేడు = లేడు; కాన = కావున; వివిక్తంబునున్ = వివేకము కలది; జప్యంబునున్ = జపింప దగినది; పవిత్రంబునున్ = పావనమైనది; మంగళంబును = శుభకరమైనది; నిశ్శ్రేయస = మోక్షమును; కరంబునున్ = కలిగించునది; ఐన = అయిన; నా = నా యొక్క; వచనంబున్ = మాటలను; ఆకర్ణింపుడు = వినుడు; సర్గ = సృష్టి; ఆదిని = మొదటిలో; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; నిజ = తన; నందనుల్ = పుత్రుల; కిన్ = కి; ఎఱింగించిన = తెలిపిన; శ్రీహరి = విష్ణుమూర్తి; స్తోత్రంబున్ = స్తోత్రమును; మీకున్ = మీకు; ఎఱింగింతున్ = తెలిపెదను; వినుడు = వినండి; అది = అది; ఎట్టిది = ఎటువంటిది; అనినన్ = అన్నచో.

భావము:

నిరంతరం స్వధర్మాన్ని ఆచరించిన పురుషుడు పెక్కు జన్మాల పుణ్యం చేత బ్రహ్మత్వాన్ని పొందుతాడు. అంతకంటే ఎక్కువ పుణ్యం చేత నన్ను పొందుతాడు. నేను బ్రహ్మాది దేవతలు అధికారాంతంలో పొందే విష్ణుపదాన్ని హరిభక్తుడు తనంతతానే పొందుతాడు. మీరు భాగవతులు కనుక నాకు ఇష్టులై ఉన్నారు. భాగవత భక్తులకు నాకంటె ఇష్టుడు మరొకడు లేడు. కాబట్టి వివేకవంతమైనది, జపింపదగినది, పవిత్రమైనది, శుభప్రదమైనది, మోక్షప్రదమైనది అయిన నా ఉపదేశాన్ని వినండి. సృష్టి ఆరంభంలో బ్రహ్మ తన పుత్రులకు చెప్పిన శ్రీహరి స్తోత్రాన్ని మీకు తెలుపుతాను. అది ఎటువంటిదంటే….