పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-670-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఈ లోకంబునం బురుషులకు స్వస్త్యయనంబును నమంగళ నివారణంబును ధనప్రదంబును యశస్కరంబును నాయుష్కరంబును స్వర్గదాయకంబును గలిమలాపహంబును నైన యీ పుణ్యచరిత్రంబు చతుర్విధపురుషార్థ కాములైన వారికిఁ జతుర్విధపురుషార్థకారణం బగుం గావున వినందగు; సంగ్రామాభిముఖుం డైన రాజీచరిత్రంబు ననుసంధించి విరోధి నెదిర్చిన నవ్విరోధి పృథునకుం బోలెఁ గప్పంబు లిచ్చు; ముక్తాన్యసంగుండును భగవద్భక్తుండును నైన వాఁడు పుణ్యంబును వైన్యమహాత్మ్య సూచకంబును నైన యీ చరిత్రంబు వినుచుం బఠియించుచుం గృతమతియై దినదినంబును నాదరంబునం బ్రకటంబు చేయువాఁడు భవసింధుపోతపాదుండైన సర్వేశ్వరుని యందు నచలం బయిన భక్తిగలిగి పృథుచక్రవర్తి బొందిన విష్ణుపదంబుం బొందు" నని యిప్పుణ్యచరిత్రంబు మైత్రేయుండు విదురున కెఱింగించి వెండియు నిట్లనియె.

టీకా:

ఈ = ఈ; లోకంబునన్ = లోకమునందు; పురుషుల్ = పురుషుల; కున్ = కు; స్వస్తి = శుభము; ఆయనంబునున్ = కలుగుట; అమంగళ = అశుభములు; నివారణంబునున్ = తొలగుట; ధన = ధనము; ప్రదంబునున్ = కలిగించెడిది; యశః = కీర్తి; కరంబునున్ = కలిగించెడిది; ఆయుష్ = ఆయుష్షును, జీవితకాలమును; కరంబునున్ = కలిగించెడిది; స్వర్గ = స్వర్గమును; దాయకంబునున్ = ప్రాప్తింపజేయునది; కలి = కలివలన కలిగెడి; మలా = దోషములు; అపహంబున్ = పోగొట్టునది; ఈ = ఈ; పుణ్య = పుణ్యవంతమైన; చరిత్రంబున్ = చరిత్రని; చతుర్విధపురుషార్థ = చతుర్విధపురుషార్థములు {చతుర్విధ పురుషార్థములు - ధర్మార్థ కామ మోక్షములు అనెడి నాలుగు (4)}; కాములు = కోరెడివారు; ఐన = అయిన; వారికిన్ = వారికి; చతుర్విధపురుషార్థ = చతుర్విధ పురుషార్థములుకి; కారణంబున్ = కలిగించెడిది; అగున్ = అగును; కావునన్ = అందుచేత; వినన్ = వినుటకు; తగున్ = తగును; సంగ్రామ = యుద్ధమునకు; అబిముఖుండు = సిద్దపడినవాడు; ఐన = అయిన; రాజు = రాజు; ఈ = ఈ; చరితంబున్ = కథను; అనుసంధించి = ఎక్కుపెట్టి; విరోధిన్ = శత్రువును; ఎదిర్చినన్ = ఎదిరించినచో; ఆ = ఆ; విరోధిన్ = శత్రువు; పృథున్ = పృథుచక్రవర్తి; కున్ = కి; పోలెన్ = వలె; కప్పంబులున్ = కప్పములు, పన్నులు; ఇచ్చును = ఇచ్చును; ముక్త = వదిలేసిన; అన్య = ఇతర; సంగుండును = సాంగత్యములుకలవాడు; భగవత్ = భగవంతునికి; భక్తుండునున్ = భక్తుడు; ఐన = అయిన; వాడు = వాడు; పుణ్యంబును = పుణ్యమును; వైన్య = పృథుచక్రవర్తి; మహాత్మ్య = గొప్పదనము; సూచకంబున్ = సూచించునది; ఐన = అయిన; ఈ = ఆ; చరిత్రంబున్ = కథను; వినుచున్ = వినుచూ; పఠియించుచున్ = చదువుతూ; కృత = నిశ్చయించుకొన్న; మతి = బుద్ధి కలవాడు; ఐ = అయ్యి; దినదినంబునున్ = ప్రతిదినము; ఆదరంబునన్ = అనురక్తితో; ప్రకటంబున్ = ప్రసిద్దముగ; చేయు = చేసెడి; వాడు = వాడు; భవ = సంసారము అనెడి; సింధు = సముద్రమును తరింపజేసెడి; పోత = ఓడ వంటి; పాదుండు = పాదములు కలవాడు; ఐన = అయిన; సర్వేశ్వరునిన్ = విష్ణుమూర్తిని {సర్వేశ్వరుడు - సమస్తమైనవారికి ఈశ్వరుడు, విష్ణువు}; అందున్ = ఎడల; అచలంబున్ = చలనము లేనిది; అయిన = అయిన; భక్తిన్ = భక్తి; కలిగి = పొంది; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; పొందిన = పొందినట్టి; విష్ణుపదంబున్ = వైకుంఠమును; పొందున్ = పొందును; = అని = అని; ఈ = ఈ; పుణ్య = పుణ్యవంతమైన; చరిత్రంబున్ = కథను; మైత్రేయుండు = మైత్రేయుడు; విదురున్ = విదురున; కున్ = కు; ఎఱింగించి = తెలిపి; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ పుణ్యచరిత్ర శుభాలను కలిగిస్తుంది. అశుభాలను తొలగిస్తుంది. ధనాన్ని ఇస్తుంది. కీర్తిని చేకూరుస్తుంది. ఆయుస్సును పెంచుతుంది. స్వర్గాన్ని అందిస్తుంది. కలిదోషాన్ని హరిస్తుంది. చతుర్విధ పురుషార్థాలను కోరేవారికి ధర్మార్థ కామ మోక్షాలను సిద్ధింపజేస్తుంది. అందువల్ల ఈ చరిత్ర వినదగినది. యుద్ధమునకు పోయేముందు రాజు ఈ చరిత్రను విని శత్రువులను ఎదుర్కొంటే పృథుచక్రవర్తికి శత్రువులు చెల్లించినట్లు శత్రువులు ఆ రాజుకు కప్పాలు సమర్పిస్తారు. ఇతర సంగం మాని భగవంతునిపై మనస్సు నిలిపినవాడై ఈ పుణ్యచరిత్రను విని, చదివి, ప్రతిదినం పలువురికి చెప్పే ధన్యాత్మునికి సంసార సముద్రాన్ని దాటించే నావ వంటి శ్రీహరి పాదాల మీద నిశ్చలమైన భక్తి కలుగుతుంది. అతడు పృథుచక్రవర్తి పొందిన విష్ణుపదాన్ని పొందుతాడు” ఈ విధంగా ఆ పుణ్యచరిత్రను మైత్రేయ మహర్షి విదురునికి చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.