పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-654-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు భూమి నుదకంబునందును, నుదకంబును దేజమందుఁ, దేజంబును వాయువున, వాయువు నాకాశంబునందు,నాకాశంబును మనంబున, మనంబు నింద్రియంబుల, నింద్రియంబుల తన్మాత్రలఁ, దన్మాత్రల భూతాదియైన యహంకారంబు నందు, నహంకారంబు మహత్తత్త్వంబు నందును గూర్చి, యట్టి సర్వకార్యహేతుభూతం బైన మహత్తత్వంబును జీవోపాధిభూతంబయిన ప్రకృతి యందుఁ గలిపి జీవభూతుం డయిన పృథుండు జ్ఞాన వైరాగ్యంబులచేత బ్రహ్మనిష్ఠుండై మాయోపాధిం బాసి ముక్తుండయ్యె;" నని చెప్పి వెండియు నిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; భూమిన్ = భూమిని; ఉదకంబున్ = నీటి; అందున్ = లోను; ఉదకంబునున్ = నీటిని; తేజము = తేజము; అందున్ = లోను; తేజంబున్ = తేజమును; వాయువునన్ = గాలిలోను; వాయువున్ = గాలిని; ఆకాశంబున్ = ఆకాశము; అందున్ = లోను; ఆకాశంబునున్ = ఆకాశమును; మనంబునన్ = మనసు నందు; మనంబున్ = మనసును; ఇంద్రియంబులన్ = ఇంద్రియము లందు; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; తన్మాత్రలన్ = తన్మాత్రలలోను; తన్మాత్రలన్ = తన్మాత్రలను; భూత = భూతములలో {భూతములు - 1అహంకారము 2మహత్తు మరియు పంచభూతములు(5)}; ఆది = మొదటిది; ఐన = అయిన; అహంకారంబున్ = అహంకారము; అందున్ = అందును; అహంకారంబున్ = అహంకారమును; మహత్తత్త్వంబున్ = మహత్తత్త్వము; అందున్ = లోను; కూర్చి = కలిపి; అట్టి = అటువంటి; సర్వ = సకల; కార్య = కార్యములకు; హేతుభూతంబున్ = కారణమైనది; ఐన = అయిన; మహత్తత్త్వంబున్ = మహత్తత్త్వమును; జీవ = జీవమునకు; ఉపాధిభూతంబున్ = ఆధారమైనది; అయిన = అయిన; ప్రకృతి = ప్రకృతి; అందున్ = లో; కలిపి = కలిపి; జీవభూతుండున్ = జీవుడు ఐపోయినవాడు; అయిన = అయిన; పృథుండు = పృథువు; జ్ఞాన = జ్ఞానము; వైరాగ్యంబుల్ = వైరాగ్యముల; చేతన్ = వలన; బ్రహ్మ = పరబ్రహ్మము యందు; నిష్ఠుండు = స్థితుండు; ఐ = అయ్యి; మాయోపాధిన్ = మాయకు నాధారములను (బంధనములను); పాసి = విడిచిపెట్టి; ముక్తుండు = ముక్తిని పొందినవాడు; అయ్యెన్ = అయ్యెను; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అదే విధంగా ఆకాశాన్ని ఆకాశమందు, తేజస్సును తేజస్సునందు, జలాన్ని జలమందు, పార్థివ శరీరాన్ని పృథివియందు కలిపివేశాడు. పంచభూతాల ఉత్పత్తి క్రమానుసారం భూమిని జలంలోను, జలాన్ని తేజస్సులోను, తేజస్సును వాయువులోను, వాయువును ఆకాశంలోను, ఆకాశాన్ని మనస్సులోను, మనస్సును ఇంద్రియాలలోను, ఇంద్రియాలను తన్మాత్రలలోను, తన్మాత్రలను అహంకారంలోను, అహంకారాన్ని మహత్తత్త్వంలోను ఏకం చేసాడు. ఆ మహత్తత్త్వాన్ని ప్రకృతిలో కలిపివేశాడు. ఈ ప్రకారం పృథుచక్రవర్తి జ్ఞాన వైరాగ్యాల ప్రభావంతో మాయోపాధిని విడిచిపెట్టి బ్రహ్మనిష్ఠుడై ముక్తుడైనాడు” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.