పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-626-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మోక్షంబె పరమపురుషార్థం” బని చెప్పి వెండియు నిట్లనియె “నరేంద్రా! దేహేంద్రియ ప్రాణ బుద్ధ్యహంకార పరివృతంబు లయిన యీ స్థావర జంగమంబుల హృదయంబులందు వ్యాపకుండుఁ బ్రత్యక్షభూతుండుఁ బ్రత్యగ్రూపుండు భగవంతుండు నయిన యీశ్వరుం డంతర్యామి రూపంబునం బ్రకాశించుచుం; డది నారాయణుని సద్రూపంబుగాఁ దెలియు” మని వెండియు నిట్లనియె.

టీకా:

మోక్షంబె = మోక్షము మాత్రమే; పరమ = అత్యుత్తమ; పురుషార్థంబు = ప్రయోజనము {పురుషార్థము - పురుషులు సాధించదగిన ప్రయోజనము, కర్తవ్యము}; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; నరేంద్రా = రాజా {నరేంద్రుడు -నరులలో ఇంద్రుడు, రాజు}; దేహ = శరీరము; ఇంద్రియ = ఇంద్రియములు {ఇంద్రియములు - పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు}; ప్రాణ = ప్రాణము; బుధ్ధి = బుద్ధి; అహంకార = అహంకారము; పరివృతంబున్ = పొరలుగ కలిగినవి; అయిన = అయిన; ఈ = ఈ; స్థావర = కదల లేనివి; జంగమంబులన్ = కదల గలవి వాటి; హృదయంబుల్ = హృదయములు; అందున్ = లో; వ్యాపకుండు = వ్యాపించి యున్నవాడు; ప్రత్యక్షభూతుండు = కనిపించెడివన్నీ తానైనవాడు; ప్రత్యగ్రూపుండు = తన ఎదుట తన రూపము కలవాడు; భగవంతుండు = భగవంతుడు; అయిన = అయిన; ఈశ్వరుండు = ప్రభుత్వము కలవాడు; అంతర్యామి = లోపల ఉండువాని; రూపంబునన్ = రూపములో; ప్రకాశించుచుండు = ప్రకాశించుతుండును; అది = అది; నారాయణుని = విష్ణుమూర్తి యొక్క; సత్ = సత్యమైన; రూపంబున్ = స్వరూపము; కాన్ = అగునట్లు; తెలియుము = తెలిసికొనుము; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

మోక్షమే పరమ పురుషార్థం” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు. “రాజా! దేహం, ఇంద్రియాలు, ప్రాణం, బుద్ధి, అహంకారం అనే వానిచేత ఆవృతాలైన స్థావర జంగమాల హృదయాలలో సర్వవ్యాపి, సాక్షిభూతుడు, ప్రత్యగ్రూపుడు అయిన భగవంతుడు అంతర్యామియై ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి నారాయణుని స్వరూపాన్ని చక్కగా తెలుసుకో” అని ఇంకా ఇలా అన్నాడు.