పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-618-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున శ్రద్ధయు, భగవద్ధర్మచర్యయుఁ, దద్విశేష జిజ్ఞాసయు, నాధ్యాత్మిక యోగ నిష్ఠయు, యోగీశ్వరోపాస్తియుఁ, బుణ్యోపాశ్రయుండును బుణ్యశ్రవణుండును నైన నారాయణ కథాలాపంబులు, నర్థేంద్రియారాము లైన వారలతోడి సంగతి యందు విరక్తియు, వారల కభిమతంబు లైన యర్థ కామంబు లందు ననాకాంక్షయు, సర్వేశ్వరుని గుణ కీర్తనామృతపానంబు దక్క నితర పదార్థంబులందు వైరాగ్యంబు నొంది యాత్మారామత గలిగి విజన స్థలంబు లందు రుచిగలుగుటయును, నహింసయు, శమాదిప్రధానవృత్తియు, నాత్మహితానుసంధానంబును, భగవత్కథానుస్మరణంబును, నకామ్యంబు లయిన యమనియమంబులును, నితరభక్తిమార్గాగర్హణంబును, యోగక్షేమార్థ క్రియారాహిత్యంబును, శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుతయు, భాగవత కర్ణాలంకార భూతం బగు భగవద్గుణాభిధానంబులు నను వీనిచేత విజృంభమాణంబైన భక్తియోగంబునం జేసి యనాత్మ యందు నసంగంబును, గార్యకారణ రూపంబగు నిర్గుణ బ్రహ్మంబు నందు రతియును నెప్పుడు గలుగు నప్పుడ సదాచార్యానుగ్రహవంతుం డయిన పురుషుండు బ్రహ్మనిష్ఠులతోడఁ జెలిమి చేయుచు నీషణత్రయంబు వర్జించి ప్రకృతిం జేరక జ్ఞాన వైరాగ్య వేగంబునం జేసి.

టీకా:

కావునన్ = అందుచేత; శ్రద్ధయున్ = శ్రద్ద; భగవత్ = భగవంతుని యెడ; ధర్మ = నిష్ఠగల; చర్యయున్ = వర్తనలు; తత్ = దాని యందు; విశేష = గొప్ప; జిజ్ఞాసయున్ = మిక్కిలి ఆసక్తి; ఆధ్యాత్మికయోగ = ఆధ్యాత్మిక తత్త్వానుష్ఠా నము నందు; నిష్ఠయున్ = లగ్నమై యుండుట; యోగి = యోగులలో; ఈశ్వర = శ్రేష్ఠులను; ఉపాస్తియున్ = ఉపాసించుట; పుణ్య = పుణ్యకర్మములకు; ఉపాశ్రయుండును = ఆధార మైనవాడు; పుణ్య = పుణ్యమును కలిగించెడి; శ్రవణుండును = కథా శ్రవణము కలవాడు; ఐన = అయిన; నారాయణ = విష్ణుని; కథా = కథలను; ఆలాపంబులన్ = సంభాషణములు; అర్థ = సంపదలను; ఇంద్రియా = ఇంద్రియ విషయము లందు; ఆరాములు = ఆసక్తి కలవారు; ఐన = అయిన; వారల = వారి; తోడి = తోటి; సంగతిన్ = సహవాసములు; అందు = ఎడల; విరక్తియున్ = అయిష్టమును; వారలు = వారి; కున్ = కి; అభిమతంబులు = ఇష్టమైనవి; ఐన = అయిన; అర్థ = సంపదలు; కామంబులు = కోరికలు; అందున్ = ఎడల; అనాకాంక్షయున్ = కోరిక లేకపోవుట; సర్వేశ్వరుని = నారాయణుని; గుణ = గుణముల; కీర్తన = స్తోత్రము లనెడి; అమృత = అమృతమును; పానంబున్ = తాగుట; తక్క = తప్పించి; ఇతర = ఇతరమైన; పదార్థంబులు = వస్తువుల; అందున్ = ఎడల; వైరాగ్యంబున్ = నిరాసక్తి; పొంది = పొంది; ఆత్మారామతన్ = ఆత్మానందము కలిగి యుండుట; కలిగి = కలిగి; విజన = నిర్జన; స్థలంబుల్ = ప్రదేశముల; అందున్ = ఎడల; రుచి = ప్రీతి; కలుగుటయునున్ = ఉండుటలు; అహింసయున్ = అహింస; శమ = శమము; ఆది = మొదలగునవి; ప్రధాన = ముఖ్యమైన; వృత్తియున్ = నడవడిక; ఆత్మ = ఆత్మజ్ఞానమునకు; హితవు = మేలైనవానిని; అనుసంధానము = కలుపుకొనుట; భగవత్ = భగవంతుని; కథా = కథలను; అనుస్మరణంబును = ధ్యానించుట; అకామ్యంబులు = కోరికలు కానివి; అయిన = అయిన; యమ = యమము {యమము - నిషిద్ధములను ఆచరించకుండుట}; నియమంబులునున్ = నియమములును {నియమము- నియమించుకొని తప్పక ఆచరించుట}; ఇతర = ఇతరమలైన; భక్తి = భక్తి; మార్గా = విధాలములను; అగర్హణంబునున్ = నిందించకుడుట; యోగ = వస్తు లాభములు; క్షేమ = క్షేమమును; అర్థన్ = సంపదలకొరకైన; క్రియా = ప్రయత్నములు; రాహిత్యంబునున్ = లేకపోవుట; శీత = చలి; ఉష్ణ = వేడి; ఆది = మొదలగునవైన; ద్వంద్వ = ద్వంద్వములను; సహిష్ణుతయున్ = సహించ గలుగట; భాగవత = భాగవతుల యొక్క; కర్ణ = చెవులకు; అలంకారభూతంబున్ = అలంకారము; అగు = అయిన; భగవత్ = భగవంతుని; గుణ = గుణముల; అభిధానంబులున్ = అభివర్ణనములు, చెప్పుట; అను = అనెడి; వీని = వీటి; చేతన్ = వలన; విజృంభమాణంబున్ = విజృంభించినట్టిది; ఐన = అయిన; భక్తియోగంబునన్ = భక్తియోగము; చేసి = వలన; అనాత్మ = ఆత్మజ్ఞానము కానివాని; అందున్ = అందు; అసంగంబునున్ = సహవాసము లేకపోవుట; కార్య = కార్యము; కారణ = కారణముల; రూపంబున్ = సంబంధించినది; అగు = కలుగునో; నిర్గుణబ్రహ్మంబున్ = నిర్గుణబ్రహ్మ; అందున్ = ఎడల; రతియునున్ = ఆసక్తి; ఎప్పుడు = ఎప్పుడైతే; కలుగున్ = కలుగుతుందో; అప్పుడు = అప్పుడు; సత్ = మంచి; ఆచార్య = గురువు యొక్క; అనుగ్రహవంతుండు = అనుగ్రహము కలవాడు; అయిన = అయినట్టి; పురుషుండున్ = మానవుడు; బ్రహ్మనిష్ఠుల = బ్రహ్మజ్ఞాన మందు నిష్ఠ కలవారి; తోడన్ = తోటి; చెలిమి = సహవాసము; చేయుచున్ = చేస్తూ; ఈషణత్రయంబున్ = ఈషణత్రయమును {ఈషణత్రయము - 1దారేషణ 2ధనేషణ 3 పుత్రేషణలు అనెడి ఆత్రములు}; వర్జించి = వదలివేసి; ప్రకృతిన్ = సంసారబంధములను; చేరక = చెందక; జ్ఞాన = జ్ఞానము; వైరాగ్య = వైరాగ్యముల సాధనల; వేగంబునన్ = గట్టిదనము; చేసి = వలన.

భావము:

కనుక శ్రద్ధ, భాగవత ధర్మాలను ఆచరించడం, ఆయా ధర్మ విశేషాలందు జిజ్ఞాస, ఆధ్యాత్మిక యోగనిష్ఠ, యోగీశ్వరులను ఉపాసించడం, నిరంతరం శ్రీహరి పుణ్యకథలను ఆలకించడం, అర్థలుబ్ధులూ ఇంద్రియలోలురూ అయినవారికి దూరంగా ఉండడం, వారికి అభిమతాలైన అర్థకామాల మీద ఆసక్తి లేకుండడం, హరిగుణామృత రసాస్వాదనం తప్ప ఇతర వస్తువులందు విరక్తి, ఆత్మారామస్థితి, ఏకాంత వాసమందు అభిరుచి, అహింస, ఇంద్రియనిగ్రహం, ఆత్మ హితానుసంధానం, సంతత భగవత్కథా చింతనం, యమనియమాలు, ఇతర భక్తి మార్గాలను నిందింపకుండా ఉండడం, తన యోగక్షేమాలకోసం ఎటువంటి కార్యాలను చేయకుండడం, శీతోష్ణాది ద్వంద్వాలను సహించడం, హరిభక్తుల చెవులకు అలంకారాలైన భగవంతుని సుగుణాలను అభివర్ణించడం మొదలైన వాటివల్ల భక్తియోగం పెంపొందుతుంది. అటువంటి భక్తియోగం వల్ల దేహాదుల మీద విరక్తి, నిర్గుణ పరబ్రహ్మం మీద అనురక్తి కలుగుతాయి. అవి కలిగినవాడు వెనువెంటనే ఉత్తములైన ఆచార్యుల అనుగ్రహానికి పాత్రుడౌతాడు. అటువంటి పురుషుడు బ్రహ్మ నిష్ఠులైన మహాత్ములతో స్నేహం చేసి దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే ఈషణత్రయాన్ని పరిత్యజిస్తారు. సంసార బంధాలనుండి విడివడి జ్ఞానవైరాగ్యాల వల్ల….