పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-597-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియు నిట్లనిరి "దేవా! నీకు సకలలోకభర్త యగు నారాయణు నందు నిట్టి భక్తి వొడముటం జేసియు బ్రహ్మణ్యదేవుండు నుత్తమశ్లోకుండు నైన సర్వేశ్వరుని సత్కథాజాలంబు వ్యక్తంబు చేయుచున్న నీవు మాకు నాథుండ వగుటం జేసియు నేము ముకుందదాసుల మైతిమి; భవదీయ ప్రజ్ఞానుశాసనంబు ప్రజానురాగంబు కారుణ్యమూర్తులైన మహాత్ములకు స్వభావంబులు; గావున నాశ్చర్యంబు గాదు; దైవసంజ్ఞితంబు లయిన కర్మంబులచేత వినష్టజ్ఞానులమై పరిభ్రమించు మాదగు తమఃపారంబుఁ గంటి; మే సర్వేశ్వరుండు బ్రాహ్మణ జాతి నధిష్ఠించి క్షత్రియులను క్షత్రియజాతి నధిష్ఠించి బ్రాహ్మణులను నీ యుభయంబు నధిష్ఠించి విశ్వంబును భరించు నట్టి, వివృద్ధసత్వుండు సర్వరూపుండు మహాపురుషుండునైన పృథునకు నీశ్వరబుద్ధింజేసి యేము నమస్కరింతు;"మను సమయంబున.

టీకా:

వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; దేవా = భగవంతుడా; నీకున్ = నీకు; సకల = సమస్తమైన; లోక = లోకములకును; భర్త = ప్రభువు; అగున్ = అయిన; నారాయణున్ = హరి; అందున్ = ఎడల; ఇట్టి = ఇటువంటి; భక్తి = భక్తి; ఒడముటన్ = కలుగుట; చేసియున్ = వలన; బ్రహ్మణ్య = బ్రాహ్మణులు కొలిచెడి; దేవుండున్ = దేవుడు; ఉత్తమ = ఉత్తములచే; శ్లోకుండు = స్తుతింప బడువాడు; ఐన = అయిన; సర్వేశ్వరుని = నారాయణుని; సత్కథల్ = మంచి కథల; జాలంబున్ = సమూహమును; వ్యక్తంబున్ = తెలియునట్లు; చేయుచున్న = చేయుచున్న; నీవున్ = నీవు; మాకున్ = మాకు; నాథుండవు = ప్రభువవు; అగుటన్ = అగుట; చేసియున్ = వలన; నేము = మేము; ముకుంద = విష్ణుని; దాసులము = సేవించువారము; ఐతిమి = అయినాము; భవదీయ = నీ యొక్క; ప్రజ్ఞ = సమర్థమైన; అనుశాసనంబున్ = పరిపాలన; ప్రజా = ప్రజల యెడ; అనురాగము = కూర్మి; కారుణ్య = దయాపూర్వక; మూర్తులు = స్వరూపము కలవారు; ఐన = అయిన; మహాత్ముల్ = గొప్పవారి; కిన్ = కి; స్వభావంబులున్ = స్వభావములు; కావునన్ = కనుక; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యకరము; కాదు = కాదు; దైవ = దేవుని; సంజ్ఞితంబులు = సూచించునవి; అయిన = అయిన; కర్మంబుల్ = కర్మముల; చేతన్ = చేత; వినష్ట = మిక్కిలి; నష్ట = నష్టమైన; జ్ఞానులము = జ్ఞానము కలవారము; ఐ = అయ్యి; పరిభ్రమించు = తిరిగెడి; మాది = మాది; అగు = అయిన; తమః = అజ్ఞానము యొక్క; పారమున్ = అంతమును; కంటిమి = చూడగలిగితిమి; ఏ = ఏ; సర్వేశ్వరుండు = నారాయణుడు; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; జాతిన్ = జాతిని; అధిష్ఠించి = ఆశ్రయించి యుండి; క్షత్రియులనున్ = రాజవంశమును; క్షత్రియ = క్షత్రియ; జాతిన్ = జాతిని; అధిష్ఠించి = ఆశ్రయించి యుండి; బ్రాహ్మణులనున్ = బ్రాహ్మణులను; ఈ = ఈ; ఉభయంబున్ = ఇద్దరిని; అధిష్ఠించి = ఆశ్రయించి యుండి; విశ్వంబునున్ = జగత్తును; భరించున్ = పాలించెడి; వివృద్ధ = మిక్కిలిఅతిశయించిన; సత్వుండు = శక్తిమంతుడు; సర్వ = అన్ని; రూపుండు = రూపములుతానేయైనవాడు; మహా = గొప్ప; పురుషుండున్ = పౌరుషము కలవాడు; ఐన = అయిన; పృథున్ = పృథుచక్రవర్తి; కున్ = కి; ఈశ్వర = భగవంతుడను; బుద్ధిన్ = ఉద్దేశము; చేసి = కలిగి; ఏము = మేము; నమస్కరింతుము = నమస్కరించెదము; అను = అనెడి; సమయంబున = సమయములో.

భావము:

మళ్ళీ ఇలా అన్నారు “ప్రభూ! సర్వేశ్వరుడైన శ్రీహరి యందలి భక్తి చేత నీవు ఉత్తమశ్లోకుడైన భగవంతుని సత్కథలను కొనియాడుతున్నావు. నీవు మాకు అధీశ్వరుడవు కావడం చేత మేము కూడా హరిభక్తుల మైనాము. ప్రజానురాగం కల దయామయులైన మహాత్ములకు ఇటువంటి అనుశాసనం సహజగుణం కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. దైవ సంజ్ఞితాలైన కర్మలచేత జ్ఞానం నశించి చీకటిలో పరిభ్రమిస్తున్న మమ్ములను ఒడ్డుకు చేర్చావు. బ్రాహ్మణజాతిని ఆశ్రయించి క్షత్రియులను, క్షత్రియులను ఆశ్రయించి బ్రాహ్మణులను, వీరిద్దరినీ, విశ్వాన్నీ భరిస్తున్న సత్త్వగుణ సంపన్నుడవు, సత్య స్వరూపుడవు, మహాపురుషుడవు అయిన నిన్ను ఈశ్వరునిగా భావించి నమస్కరిస్తున్నాము” అని చెప్తున్న సమయంలో….