పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-584-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక దారుస్థితంబైన యనలంబు తద్దారు గుణంబు లయిన దైర్ఘ్య వక్రత్వాదికంబుల ననుసరించు చందంబున నవ్యక్తంబు తత్క్షోభకం బయిన కాలంబును వాసనయు నదృష్టంబు నను కారణంబుల చేతం బుట్టిన శరీరంబునందు విషయాకారం బయిన బుద్ధి నొంది తద్విషయాభివ్యంగ్యంబైన యానందస్వరూపుం డగుచుఁ గ్రియా ఫలంబునం బ్రసిద్ధి నొందు” నని చెప్పి వెండియు నిట్లను “మదీయ జనంబు లిమ్మేదినీతలంబున దృఢవ్రతులై యజ్ఞభుగీశ్వరుండును గురుండును నయిన సర్వేశ్వరుని, హరిని నిరంతరంబును స్వధర్మ యోగంబునం బూజించుచున్నవారలు; వారు నన్నాశ్చర్యకరంబుగా ననుగ్రహించువా” రని హరిభక్తిరతులైన మహాత్ముల నుతియించి వెండియు నిట్లనియె.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దారు = కట్టె లందు; స్థితంబున్ = ఉండునది; ఐన = అయిన; అనలంబున్ = అగ్ని; తత్ = ఆ; దారు = కొయ్య యొక్క; గుణంబులు = గుణములు; అయిన = అయినట్టి; దైర్ఘ్య = పొడవు; వక్రత్వ = వంకరా నుండుట; ఆదికంబులన్ = మొదలైనవానిని; అనుసరించు = అనుసరించెడి; చందంబునన్ = విధముగ; అవ్యక్తంబున్ = వ్యక్తము కానిది, కాలము; తత్ = దానిని (అవ్యక్తమును); క్షోభకంబు = కరిగించెడిది, కర్మ; వాసన = సంస్కారము; అదృష్టంబున్ = అదృష్టములు; అను = అనెడి; కారణంబుల్ = కారణముల; చేతన్ = వలన; పుట్టిన = జనించిన; శరీరంబున్ = దేహము; అందున్ = లో; విషయ = ఇంద్రియార్థములు; ఆకారంబున్ = స్వరూపముగా కలది; అయిన = అయిన; బుద్ధిన్ = బుద్ధిని; ఒంది = పొంది; తత్ = ఆ; విషయ = విషయములచే; అభివ్యంగ్యంబు = అనుభవసారము {అభివ్యంగ్యము - వెలువడు గుర్తులచే తెలియబడునది, అనుభవసారము}; ఐన = అయిన; ఆనంద = ఆనందము యొక్క; స్వరూపుండు = స్వరూపము కలవాడు; అగుచున్ = అవుతూ; క్రియా = యజ్ఞక్రియలకు; ఫలంబునన్ = ఫలితము నందు; ప్రసిద్ధిన్ = తెలియబడుటను; ఒందును = పొందును; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను; మదీయజనంబుల్ = నావారు; ఈ = ఈ; మేదినీతలంబునన్ = భూమండలమున; ధృఢ = గట్టి; వ్రతులు = నియమములు కలవారు; ఐ = అయ్యి; యజ్ఞ = యజ్ఞమును; భుగీ = అనుభవించెడి; ఈశ్వరుండును = విభుడును; గురుండును = గొప్పవాడు; అయిన = అయినట్టి; సర్వేశ్వరునిన్ = విష్ణుమూర్తిని; హరిని = విష్ణుమూర్తిని; నిరంతరంబును = ఎల్లప్పుడు; స్వధర్మ = స్వంతధర్మమున; యోగంబునన్ = కూడి యుండి; పూజించుచున్న = సేవిస్తున్న; వారలున్ = వారు; వారున్ = వారు; నన్నున్ = నన్ను; ఆశ్చర్యకరంబుగాన్ = ఆశ్చర్యకరముగా; అనుగ్రహించు = అనుగ్రహించెడి; వారున్ = వారు; అని = అని; హరి = నారాయణుని; భక్తిన్ = భక్తి యందు; రతులున్ = ఆసక్తికలవారు; ఐన = అయిన; మహాత్ములన్ = గొప్పవారిని; నుతియించి = స్తుతించి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అంతేకాక కట్టె తగులబడుతున్నపుడు దాని పొడవు, పొట్టి, వంకర మొదలైన గుణాలు కట్టెలోని నిప్పునకు కూడ సంక్రమిస్తాయి. అలాగే దేహలక్షణాలు దేహంలోని జీవునకూ సంక్రమిస్తాయి. అందుచేత అంతర్యామి దేహ ధర్మాలను అనుసరించియే వ్యక్తమవుతాడు. దేహం పుట్టుకకు కాలం, సంస్కారం, అదృష్టం కారణాలు. ఇటువంటి దేహంలో అంతర్యామిగా ఉండేవాడు ఆనందమయుడు. అతడే యజ్ఞేశ్వరుడు. యోగఫలం కూడ అతడే” అని చెప్పి మహారాజు మళ్ళీ ఇలా అన్నాడు. “ఈ లోకంలోని నా ప్రజలు దృఢ నియమంతో యజ్ఞభోక్తలైన దేవతలకు అధీశ్వరుడు, సర్వ గురుడు, సర్వేశ్వరుడు అయిన శ్రీహరిని సర్వదా స్వధర్మానుసారం పూజిస్తున్నారు. ఈ విధంగా వారు ఎంతగానో నన్ను అనుగ్రహిస్తున్నారు” అని విష్ణుభక్తి పరాయణులైన మహానుభావులను కొనియాడి పృథుచక్రవర్తి మళ్ళీ ఇలా అన్నాడు.