పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-570-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు ప్రజలను ధర్మంబుల యందు ననుశాసింపక యర్థకాముండై వారివలన నప్పనంబులు గొనెనేని వారల పాపంబు దనకుఁ బ్రాపింపం దేజోహీనుండై భూవిభుండు చెడుం; గావునం బ్రజలు భూపతి హితార్థంబునకు, స్వార్థంబునకు, నసూయారహితులై వాసుదేవార్పణ బుద్ధింజేసి ధర్మంబు నెప్పుడు నాచరింపవలయు; నిదియ నన్ను ననుగ్రహించు; టదియునుం గాక పితృదేవర్షి తుల్యులగు మీర లనుమోదించి కర్తయు ననుశాసకుండు ననుజ్ఞాతయు నయిన నాకుఁ బరలోకంబున నే ఫలంబు గలుగు నట్టి ఫలంబునకు సదృశంబైన కర్మం బాచరింపవలయు; నట్లయిన సంతోషంబు నొందుదు” ననిన వార లా రాజేంద్రున కిట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ప్రజలను = ప్రజలను; ధర్మంబుల = ధర్మమార్గవర్తన; అందున్ = అందు; అనుశాసింపక = శిక్షింపకుండగ; అర్థ = ధనమును; కాముండు = కోరెడివాడు; ఐ = అయ్యి; వారి = వారి; వలనన్ = నుండి; అప్పనంబులున్ = కానుకలు; కొనెనేని = తీసుకొన్నచో; వారల = వారి యొక్క; పాపంబున్ = పాపము; తన = తన; కున్ = కు; ప్రాపింపన్ = చెందగా; తేజస్ = తేజస్సు; హీనుండు = తగ్గిపోయినవాడు; ఐ = అయ్యి; భూవిభుండు = రాజు; చెడున్ = చెడిపోవును; కావునన్ = అందుచేత; ప్రజలు = ప్రజలు; భూపతి = రాజు; హిత = మేలు; అర్థంబున్ = జరుగుట; కున్ = కోసము; స్వార్థంబున్ = తమ ప్రయోజనము; కున్ = కోసము; అసూయ = అసూయ; రహితులు = లేనివారు; ఐ = అయ్యి; వాసుదేవ = విష్ణుమూర్తికి; అర్పణ = సమర్పించు; బుద్ధిన్ = భావము; చేసి = కలిగి; ధర్మంబున్ = ధర్మమార్గవర్తన; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; ఆచరింపన్ = చేయ; వలయును = వలెను; ఇదియ = ఇదే; నన్నున్ = నన్ను; అనుగ్రహించుట = అనుగ్రహించుట; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; పితృ = పితృదేవతలు; దేవర్షి = దేవఋషులకు; తుల్యులు = సరితూగువారు; అగు = అయిన; మీరలన్ = మిమ్ములను; అనుమోదించి = అంగీకరించి; కర్తయున్ = కర్త; శాసకుండున్ = పరిపాలకుడు; అనుజ్ఞాతయున్ = అనుజ్ఞ యిచ్చువాడు; అయిన = అయిన; నాకున్ = నాకు; పరలోకంబునన్ = పై లోకమున; ఏ = ఎట్టి; ఫలంబున్ = ఫలితము; కలుగన్ = కలుగుతుందో; అట్టి = అటువంటి; ఫలంబున్ = ఫలితమున; కున్ = కు; సదృశంబున్ = సరిపడునది; ఐన = అయిన; కర్మంబున్ = కర్మములను; ఆచరింపన్ = చేయ; వలయున్ = వలెను; అట్లు = ఆ విధముగ; అయిన = అయినచో; సంతోషంబున్ = సంతోషమును; ఒందుదును = పొందెదను; అనినన్ = అనగా; వారలు = వారు; ఆ = ఆ; రాజ = రాజులలో; ఇంద్రున్ = ఇంద్రుని వంటివాని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ప్రజలను ధర్మమార్గాన పరిపాలించకుండా ధనాపేక్షతో ప్రజలనుండి పన్నులు గుంజుకొన్న రాజుకు ప్రజల పాపం సంక్రమిస్తుంది. అందుచేత ఆ రాజు తేజోహీనుడై నశిస్తాడు. కాబట్టి ప్రజలు రాజు మేలు కొరకు, తమ మేలు కొరకు అసూయారహితులై పరమేశ్వరార్పణ బుద్ధితో ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించాలి. మీరు ఇలా చేయడమే నన్ను అనుగ్రహించడమని భావిస్తాను. మీరు నాకు తండ్రుల వంటివారు. దేవతల వంటివారు. ఋషుల వంటివారు. అటివంటి మీరు దీనికి సమ్మతించి మీ నాయకుడనైన నాకు పరలోకంలో ఏ ఫలం కలుగుతుందో అటువంటి ఫలానికి తగిన మంచి కార్యాలను ఆచరించాలి. మీరు అలా చేసినట్లయితే నేను సంతోషిస్తాను” అని పృథుచక్రవర్తి పలుకగా సభ్యులు ఇలా అన్నారు.