పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-567-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, నియమనిమిత్తంబునం బరిత్యక్తభూషణుం డగుటం జేసి వ్యక్తాశేషగాత్రశ్రీకుండును, గృష్ణాజినధరుండును, శ్రీమంతుండును, గుశహస్తుండును, గృతోచితుండును, శిశిరస్నిగ్ధతారాక్షుండును నైన పృథుచక్రవర్తి సభామధ్యంబునం దారాగణమధ్య విభాసితుండును, సకలజనాహ్లాదకరుండును నగు సుధాకరుండునుం బోలె వెలుంగుచు లేచి నిలుచుండి సదస్య సంతోషదాయకంబులును, జిత్రపదవిరాజితంబులును, బ్రసన్నంబులును, బరిశుద్ధంబులును, గంభీరార్థంబులును, నవ్యాకులంబులును నైన భాషణంబుల నిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; నియమ = వ్రతనియమము; నిమిత్తంబునన్ = కోసము; పరిత్యక్త = విడిచిన; భూషణుండు = అలంకరములు కలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; వ్యక్త = వెల్లడగుచున్న; అశేష = సమస్తమైన; గాత్ర = శరీరము యొక్క; శ్రీకుండును = శోభ కలవాడును; కృష్ణాజిన = నల్లని లేడి చర్మము; ధరుండును = ధరించినవాడును; శ్రీమంతుండును = ధనవంతుడును; కుశ = దర్భలు; హస్తుండును = చేతిలో కలవాడును; కృత = చేయుచున్న; ఉచితుండును = తగిన పనులు కలవాడును; శిశిర = చల్లని; స్నిగ్ధ = స్నేహపూరిత మైన, మృదువైన; తారా = నక్షత్రములవలె మెరిసెడి; అక్షుండును = కన్నులు కలవాడును; ఐన = అయిన; = పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; సభా = సభకు; మధ్యంబునన్ = మధ్య భాగములో; తారా = తారల; గణ = సమూహము; మధ్య = నడుమ; విభాసితుండును = మిక్కిలి ప్రకాశించెడివాడు; సకల = సమస్త; జనా = జనులకు; ఆహ్లాదకరుండును = ఆనందము కలిగించెడి వాడు; అగు = అయిన; సుధాకరుండు = చంద్రుని {సుధాకరుండు - సుధ (వెన్నెల)ని కరుండు (కలుగ జేయువాడు), చంద్రుడు}; పోలెన్ = వలె; వెలుంగుచున్ = ప్రకాశించుతూ; లేచి = లేచి; నిలుచుండి = నిలబడి; సదస్య = సభ్యులకు; సంతోష = ఆనందమును; దాయకంబును = కలుగ చేయునవి; చిత్ర = చిత్రమైన; పద = పదములుచే; విరాజితంబును = విరాజిల్లెడివి; ప్రసన్నంబులును = ప్రసన్నత కనిపించెడివి; పర = మిక్కిలి; శుద్ధంబులును = స్వచ్ఛమైనవి; గంభీర = గంభీరమైన; అర్థంబులునున్ = అర్థములు కలవి; అవ్యాకులంబులు = వ్యాకులపాటు లేనివియును; ఐన = అయిన; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ మహారాజు యజ్ఞదీక్షలో ఉన్నందున ఆభరణాలను ధరించలేదు. అందుచేత సహజమైన శరీరశోభ వెల్లడవుతున్నది. జింకతోలు ధరించినా శ్రీమంతుడై విలసిల్లుతున్నాడు. చల్లని చూపులు గల పృథుచక్రవర్తి దర్భలు చేత పట్టుకొని సభ మధ్యభాగంలో నక్షత్రగణాల నడుమ విలసిల్లే చంద్రునివలె సకల జనులకు ఆహ్లాదాన్ని ఇస్తూ ప్రకాశిస్తూ లేచి నిలబడ్డాడు. సదస్యులకు సంతోషాన్ని కలిగించేవి, చిత్రపదాలతో ప్రకాశించేవి, ప్రసన్నములయినవి, పవిత్రమైనవి, గంభీరమైన అర్థాలు కలవి, తడబాటు లేనివి అయిన మాటలతో ఇలా పలికాడు.