పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : స్వాయంభువు వంశ విస్తారము

  •  
  •  
  •  

4-4-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు వివాహంబైన రుచిప్రజాపతి బ్రహ్మవర్చస్వియుఁ బరిపూర్ణగుణుండును గావునఁ జిత్తైకాగ్రతంజేసి యాకూతియందు శ్రీవిష్ణుండు యజ్ఞరూపధరుం డగు పురుషుండుగను జగదీశ్వరి యగు నాదిలక్ష్మి యమ్మహాత్మునకు నిత్యానపాయిని గావునఁ దదంశంబున దక్షిణ యను కన్యకారత్నంబుగను మిథునంబు సంభవించె; నందు స్వాయంభువుండు సంతుష్టాంతరంగుం డగుచుఁ బుత్రికాపుత్రుండును, వితతతేజోధనుండును, శ్రీవిష్ణుమూర్తి రూపుండును నగు యజ్ఞునిఁ దన గృహంబునకుఁ దెచ్చి యునిచె; రుచియుఁ గామగమన యైన దక్షిణ యను కన్యకాలలామంబును దన యొద్దన నిలిపె; అంత సకలమంత్రాధిదేవత యగు శ్రీయజ్ఞుండు దనుఁ బతిఁగంగోరెడు దక్షిణ యను కన్యకం బరిణయం బయ్యె; వార లాదిమిథునంబు గావున నది నిషిద్ధంబు గాకుండె" నని చెప్పి మైత్రేయుండు వెండియు నిట్లనియె.

టీకా:

అట్లు = ఆవిధముగ; వివాహంబు = కల్యాణము; ఐన = అయినట్టి; రుచి = రుచి అనెడి; ప్రజాపతి = ప్రజాపతి; బ్రహ్మవర్చస్వియున్ = బ్రహ్మదేవుని వంటి వర్చస్సు కలవాడును; పరిపూర్ణుడునున్ = పరిపూర్ణ వ్యక్తిత్వము కలవాడును; కావునన్ = అగుటవలన; చిత్త = చిత్తము యొక్క; ఏగ్రతన్ = ఏకాగ్రత; జేసి = వలన; ఆకూతి = ఆకూతి; అందు = కి; శ్రీవిష్ణుండు = విష్ణుమూర్తి; యజ్ఞరూప = యజ్ఞరూపమును; ధరుండు = ధరించినవాడు; అగు = అయినట్టి; పురుషుండు = మగబిడ్డ; కాను = అయ్యి; జగదీశ్వరి = లోకములపై అధికారి; అగు = అయినట్టి; ఆదిలక్ష్మి = లక్ష్మీదేవి; ఆ = ఆ; మహాత్మున్ = గొప్పవాని; కున్ = కి; నిత్య = ఎల్లప్పుడును; అనపాయిని = విడువకుండునది; కావునన్ = అగుటవలన; తత్ = తన; అంశంబునన్ = అంశముతో; దక్షిణ = దక్షిణ; అను = అనెడి; కన్యకారత్నంబున్ = ఉత్తమమైన స్త్రీ; కాన్ = అయ్యి; మిథునంబు = జంట; సంభవించె = పుట్టిరి; అందు = వారిలో; స్వాయంభువుండు = స్వాయంభువుండు; సంతుష్టాంతరంగుండు = సంతోషించుచున్న మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; పుత్రికాపుత్రుండును = మనుమడును; వితత = విస్తారమైన; తేజస్ = తేజస్సను; ధనుండును = సంపదగా కలవాడును; శ్రీవిష్ణుమూర్తిరూపుండును = విష్ణుమూర్తి స్వరూపము ఐనవాడును; అగు = అయినట్టి; యజ్ఞుని = యజ్ఞుడిని; తన = తన యొక్క; గృహంబున్ = ఇంటి; కున్ = కి; తెచ్చి = తీసుకొని వచ్చి; ఉనిచె = ఉంచెను; రుచియున్ = రుచిప్రజాపతికూడ; కామగమన = కోరిన విధముగ వర్తించెడియామె; ఐన = అయినట్టి; దక్షిణ = దక్షిణ; అను = అనెడి; కన్యకాలలామంబును = కన్యలలో పూజ్యురాలును; తన = తన; ఒద్దన్ = దగ్గర; నిలిపె = ఉంచెను; అంత = అంతట; సకల = సమస్తమైన; మంత్ర = మంత్రములకును; అధిదేవత = అధిదేవత; అగు = అయినట్టి; శ్రీయజ్ఞుండు = శ్రీయజ్ఞుండు; తనున్ = తనను; పతిగన్ = భర్తగా; కోరెడు = కోరుతున్న; దక్షిణ = దక్షిణ; అను = అనెడి; కన్యకం = కన్యను; పరిణయంబయ్యె = పెళ్లిచేసుకొనెను; వారలు = వారు; ఆది = మొదటి; మిథునంబు = జంట; కావునన్ = కనుక; అది = అది; నిషిద్ధంబు = అనంగీకారమైనది; కాకుండెను = కాకుండా ఉన్నది; అని = అని; చెప్పి = చెప్పి; మైత్రేయుండు = మైత్రేయుడు; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ విధంగా పెండ్లాడిన రుచి ప్రజాపతి బ్రహ్మతేజస్సు కలవాడు, సద్గుణ సంపన్నుడు, మనస్సును భగవంతునియందే లగ్నం చేసినవాడు కనుక అతనికి ఆకూతియందు శ్రీమహావిష్ణువు యజ్ఞుడు అనే పుత్రుడుగా, లోకేశ్వరి అయిన ఆదిలక్ష్మి విష్ణువును ఎప్పుడూ విడిచి ఉండదు కనుక తన అంశతో దక్షిణ అనే కన్యకగా జన్మించారు. స్వాయంభువుడు ఎంతో సంతోషించి తన కూతురి కుమారుడు, అత్యంత తేజోవంతుడు, శ్రీవిష్ణుదేవుని అవతారము అయిన యజ్ఞుని తన ఇంటికి తెచ్చుకున్నాడు. రుచి ప్రజాపతి కామగమన అయిన దక్షిణను తన దగ్గరనే ఉంచుకున్నాడు. తరువాత సకల మంత్రాలకు అధిదేవత అయిన యజ్ఞుడు తనను భర్తగా కోరిన దక్షిణను చేపట్టాడు. వారిద్దరూ ఆదిదంపతులు కనుక ఆ అన్నాచెల్లెళ్ళ వివాహం లోకవిరుద్ధం కాలేదు” అని చెప్పి మైత్రేయుడు మళ్ళీ ఇలా అన్నాడు.