పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-487-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నీశ్వరగుణ సర్గరూపంబైన మాయచే మోహితాంతఃకరణుల మైన మా వంటి వారలచేత హరిభక్తుల చేష్టితం బెఱుంగఁబడదన్న హరి చేష్టితం బెట్లెఱుంగంబడు? నట్టి జితేంద్రియ యశస్కరు లయిన వారలకు నమస్కరింతు” ననుచు నివ్విధంబునం గోపప్రస్ఫురితాధరుం డైన పృథుని నభినుతించి ధైర్యం బవలంబించి వెండియు నిట్లనియె.

టీకా:

కావునన్ = అందుచేత; ఈశ్వర = భగవంతుని; గుణ = గుణముల; సర్గ = స్వభావముల, సృష్టించెడి; రూపంబునన్ = స్వరూపము; ఐన = అయిన; మాయ = మాయ; చేన్ = చేత; మోహిత = మోహములోపడిన; అంతఃకరణులము = అంతకరణములు కలవారము; ఐన = అయిన; మా = మా; వంటి = వంటి; వారల = వారి; చేతన్ = చేత; హరి = విష్ణుని; భక్తుల = భక్తులు; చేష్టితంబున్ = చేసెడి పని; ఎఱుంగబడదు = తెలిసికొన లేనిది; అన్నన్ = అనినచో; హరి = విష్ణుమూర్తి; చేష్టితంబున్ = చేసెడిపని; ఎట్లు = ఏ విధముగ; ఎఱుంగంబడు = తెలిసికొనబడును; అట్టి = అటువంటి; జిత్ = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు కల వారనెడి; యశస్ = ప్రసిద్ధి; కరులున్ = పొందినవారు; అయిన = అయిన; వారలన్ = వారి; కున్ = కి; నమస్కరింతున్ = నమస్కరించెదను; అనుచున్ = అంటూ; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కోప = రోషముచేత; ప్రస్పురిత = అదురుతున్న; అధరుండు = పెదవి కలవాడు; ఐన = అయిన; పృథునిన్ = పృథుచక్రవర్తిని; అభినుతించి = స్తోత్రముచేసి; ధైర్యంబున్ = ధైర్యమును; అవలంభించి = చేపట్టి; వెండియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

భగవంతుని మహిమోపేతమైన మాయచేత మోహం పొందిన మనస్సు కలిగిన మావంటి వారికి హరిభక్తుల చర్యలు తెలుసుకోవటం శక్యం కాదు. ఇక శ్రీహరి చర్యలను ఎలా తెలుసుకొనగలం? అటువంటి యశోనిధులైన జితేంద్రియులకు, మహాత్ములకు మొక్కుతున్నాను” అని ఈ విధంగా కోపంతో పెదవులు అదురుతున్న పృథుచక్రవర్తిని సంస్తుతించి ధైర్యం తెచ్చుకొని భూమి మళ్ళీ ఇలా అన్నది.