పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-477-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ధరిత్రీ! మదీయాజ్ఞోల్లంఘనంబు చేయుచున్న దాన; వదియునుం గాక, నీవు యజ్ఞంబు లందు హవిర్భాగంబుల ననుభవించుచు ధాన్యాదికంబుల విస్తరింపం జేయక గోరూపంబు ధరియించి యనయంబుఁ దృణభక్షణంబు చేయుచుఁ బాలం బిదుకక నీ యంద యడంచికొంటివి; నీ యందున్న యోషధీ బీజంబులు బ్రహ్మచేతం బూర్వంబునందె కల్పింపంబడిన యవి; వానిని నీ దేహంబునంద యడంచికొని యిప్పు డీయక మూఢహృదయవు, మందమతివియు నై యపరాధంబు చేసిన దురాత్మురాల వగు; నిను నా బాణంబులచే జర్జరీ భూతశరీరం జేసి వధియించి నీ మేని మాంసంబునం జేసి క్షుద్బాధితులు దీనులు నగు నీ ప్రజల యార్తి నివారించెద; నీవు కామిని నంటివి; స్త్రీ పురుష నపుంసకులలో నెవ్వరేని భూతదయ లేక స్వమాత్ర పోషకు లగుచు నిరనుక్రోశంబుగ భూతద్రోహులై వర్తింతురు; వారిని రాజులు వధించినన్ వధంబు గాదు; గాన దానఁ బాపంబు వొరయదు; నీవు కామిని వైనను దుర్మదవు స్తబ్దవు నగుచు మాయాగోరూపంబునం బాఱిపోవుచున్న నిన్నుఁ దిలలంతల ఖండంబులు చేసి నా యోగమహిమం బ్రాణికోటి నుద్ధరించెద;"నని పలికి రోషభీషణాకారంబు ధరియించి దండధరుని వడువున వర్తించు పృథునిం జూచి వడంకుచు మేదిని ప్రాంజలియై యిట్లని నుతియింపం దొడంగె.

టీకా:

ధరిత్రీ = భూదేవీ; మదీయ = నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; ఉల్లంఘనంబున్ = దాటుట; చేయుచున్ = చేస్తూ; ఉన్నదానవు = ఉన్నావు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; నీవున్ = నీవు; యజ్ఞముల్ = యజ్ఞముల; అందున్ = లో; హవిర్భాగంబులన్ = హవిస్సు నందలి భాగమును; అనుభవించుచున్ = అనుభవిస్తూ; ధాన్య = ధాన్యములు; ఆదికంబులున్ = మొదలైనవానిని; విస్తరింపన్ = పెరుగునట్లు; చేయక = చేయకుండా; గో = గోవు యొక్క; రూపంబున్ = రూపమును; ధరియించి = తాల్చి; అనయంబున్ = ఎల్లప్పుడును; తృణ = గడ్డిని; భక్షణంబున్ = తినుటలు; చేయుచున్ = చేస్తూ; పాలన్ = పాలను; పితుకక = ఇయ్యకుండగ; నీ = నీ; అందన్ = లోనే; అణచికొంటివి = అణచేసుకొన్నావు; నీ = నీ; అందున్ = అందు; ఉన్న = ఉన్నట్టి; ఓషధీ = ధాన్యముల; బీజంబులున్ = విత్తనములు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేతన్ = వలన; పూర్వంబున్ = పూర్వకాలము; అందె = లోనే; కల్పింపబడినయవి = సృష్టింపబడినవి; వానిని = వాటిని; నీ = నీ; దేహంబున్ = దేహము; అందన్ = లోనే; అడంచికొని = అణచేసుకొని; ఇప్పుడు = ఇప్పుడు; ఈయక = ఇవ్వకుండగ; మూఢ = మూర్ఖపు; హృదయవున్ = హృదయము కలదానవు; మందమతియున్ = తెలివితక్కువదానివి; ఐ = అయ్యి; అపరాధంబున్ = అపరాధము; చేసిన = చేసినట్టి; దురాత్మురాలవు = దుష్ట స్వభావము కలదానవు; అగు = అయిన; నినున్ = నిన్ను; నా = నా యొక్క; బాణంబుల్ = బాణముల; చేన్ = తో; జర్జరీభూత = ముక్కలు ముక్క లయిన; శరీరన్ = దేహము కల దానిని; చేసి = చేసి; వధియించి = సంహరించి; నీ = నీ; మేని = శరీర మందలి; మాసంబునన్ = మాంసము; చేసి = వలన; క్షుత్ = ఆకలిచే; బాధితులున్ = బాధపడుతున్నవారు; దీనులున్ = దీనులును; అగున్ = అయిన; ఈ = ఈ; ప్రజల = జనుల యొక్క; ఆర్తిన్ = బాధను; నివారించెదన్ = పోగొట్టెదను; నీవున్ = నీవు; కామినిన్ = స్త్రీని; అంటివి = అన్నావు; స్త్రీ = స్త్రీలు; పురుష = పురుషులు; నపుంసకుల = నపుంసకులు; లోనన్ = లోను; ఎవ్వరేని = ఎవరైనాసరే; భూత = జీవుల యెడ; దయ = కృప; లేక = లేకుండగ; స్వమాత్ర = తనకు మాత్రమే; పోషకులు = పోషించుకొనెడివారు; అగుచున్ = అవుతూ; నిరనుక్రోశంబుగన్ = జాలి లేకుండగ; భూత = జీవుల యెడ; ద్రోహులు = అన్యాయము చేయువారు; ఐ = అయ్యి; వర్తింతురు = తిరిగెదరో; వారినిన్ = వారిని; రాజులు = రాజులు; వధించినన్ = సంహరించినను; వధంబున్ = సంహారము; కాదు = కాదు; కాన = కావున; దానన్ = దానివలన; పాపంబున్ = పాపము; ఒరయదు = పొరయదు, కలుగదు; నీవున్ = నీవు; కామినివి = స్త్రీవి; ఐననున్ = అయినప్పటికిని; దుర్ = చెడ్డ; మదవు = గర్వము కలదానవు; స్తబ్దవు = చేష్టా రహితవు; అగుచున్ = అవుతూ; మాయా = మాయ; గో = గోవు యొక్క; రూపంబునన్ = రూపములో; పాఱిపోవుచున్న = పారిపోతున్న; నిన్నున్ = నిన్ను; తిలలు = నువ్వుగింజలు; అంతల = అంతేసి; ఖండంబులున్ = ముక్కలుగ; చేసి = చేసి; నా = నా యొక్క; యోగ = యోగము యొక్క; మహిమన్ = గొప్పదనముతో; ప్రాణి = జీవ; కోటిన్ = జాలమును; ఉద్దరించెదను = కాపాడెదను; అని = అని; పలికి = పలికి; రోష = రోషముతో; భీషణ = భయంకరమైన; ఆకారంబున్ = ఆకారము; ధరియించి = తాల్చి; దండధరునిన్ = యముని; వడువునన్ = వలె; వర్తించు = ప్రవర్తించెడి; పృథునిన్ = పృథుచక్రవర్తిని; చూచి = చూసి; వడంకుచున్ = వణికిపోతూ; మేదిని = భూదేవి; ప్రాంజలి = అంజలి ఘటించినది; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; నుతియింపన్ = స్తుతింప; తొడంగెన్ = మొదలిడెను.

భావము:

“ఓ భూదేవీ! నీవు నా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అంతేకాదు, యజ్ఞాలలో హవిర్భాగాలను అందుకొంటూ ధాన్యం మొదలైన వానిని పెంపొందింపకుండా ఉన్నావు. గోరూపం ధరించి తృణభక్షణం చేస్తూ పాలు ఇవ్వకుండా నీలోనే దాచి ఉంచుకున్నావు. పూర్వం బ్రహ్మదేవుడు నీలో సృజించిన ఓషధీ బీజాలను నీ దేహమందే అణచి పెట్టుకొని వెలుపలకు వెలుపలకు రానీయకుండా ఉన్నావు. నీవు మూర్ఖురాలవు. మందబుద్ధివి. ఈ విధంగా తప్పు చేసిన నీ శరీరాన్ని నా బాణాలతో తూట్లు పొడిచి నిన్ను వధిస్తాను. నీ మాంసంతో ఆకలితో మలమల మాడుతున్న ఈ ప్రజల ఆర్తిని తొలగిస్తాను. స్త్రీ వధ దోషం కదా అని అన్నావు. స్త్రీ పురుష నపుంసకులలో భూతదయ లేకుండా తమ పొట్టలు మాత్రమే నింపుకొనే ఎవ్వరినైనా సరే రాజులు చంపవచ్చు. అది వధ కాదు. కాబట్టి దానివల్ల పాపం రాదు. నీవు స్త్రీవైనా గర్వాంధురాలవై కొయ్యబారి ఉన్నావు. మాయా గోరూపం ధరించి పారిపోతున్న నిన్ను నువ్వుగింజలంత ముక్కలుగా నరికి నా యోగప్రభావంతో జీవులను రక్షిస్తాను’’ అంటూ యమునివలె రోష భీషణాకారుడైన పృథుచక్రవర్తిని చూసి భూమి వణికిపోతూ దోసిలి ఒగ్గి ఈ విధంగా ప్రార్థింపసాగింది.