పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-466-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విపాటిత విరోధిమనశ్శల్యుండు, సురాసుర జేగీయమాన నిజవైభవుండు నై ధరాచక్రంబున కీతండు రాజయ్యెడి" నని యివ్విధంబున స్తోత్రంబు చేసిన వంది మాగధ సూత జనంబులం బృథుచక్రవర్తి పూజించి మఱియుం బ్రాహ్మణ భృత్యామాత్య పురోహిత పౌర జానపద తైలిక తాంబూలిక నియోజ్య ప్రము ఖాశేష జనంబులం దత్త దుచిత క్రియలం బూజించె” నని మైత్రేయుండు చెప్పిన విని విదురుం డిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విపాటిత = బాగనాటిన; విరోధి = శత్రువుల; మనస్ = మనసులలోని; శల్యుండు = ముల్లు వంటివాడు; సుర = దేవతలచేత; అసుర = రాక్షసులచేత; జేగీయమాన = కీర్తింపబడెడి; నిజ = తన; వైభవుండు = వైభవము కలవాడు; ఐ = అయ్యి; ధరా = భూ; చక్రంబున్ = మండలమున; కున్ = కు; ఇతండు = ఇతడు; రాజు = రాజు; అయ్యెడిని = అగును; అని = అని; ఈ = ఈ; విధమునన్ = విధముగ; స్తోత్రంబున్ = స్తోత్రము; చేసినన్ = చేసినట్టి; వంది = వందిజనులు; మాగధ = మాగధులు; సూత = సూతులు యైన; జనంబులన్ = వారిని; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; పూజించి = గౌరవించి; మఱియున్ = ఇంకనూ; బ్రాహ్మణ = బ్రహ్మణులు; భృత్య = సేవకులు; అమాత్య = మంత్రులు; పురోహిత = పురోహితులు; పౌర = పౌరులు; జానపద = జానపదులు; తైలిక = తైల మర్దనములు చేయువారు; తాంబూలిక = తాంబులములను చుట్టిచ్చువారు; నియోజ్య = రాచ కార్యములకు నియోగింపబడిన వారు; ప్రముఖ = మొదలైన; అశేష = అనేకమైన; జనంబులన్ = జనులను; తత్తత్ = ఆయా; ఉచిత = తగిన; క్రియలన్ = విధములుగ; పూజించె = గౌరవించెను; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; చెప్పినన్ = చెప్పగా; విని = విని; విదురుండు = విదురుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈయన కంటకప్రాయులైన విరోధులను పెకలించి వేస్తాడు. సురాసురులు కొనియాడుతున్న వైభవం కలవాడై, ధరామండలాని కంతటికీ రాజు అవుతాడు” అని వందిమాగధులు పృథు చక్రవర్తిని పరిపరి విధాల ప్రస్తుతించారు. పృథు చక్రవర్తి వారందరినీ యథోచితంగా సత్కరించాడు. బ్రాహ్మణులు, భృత్యులు, అమాత్యులు, పురోహితులు, పుర ప్రజలు, గ్రామవాసులు, తైల సేవకులు, తాంబూల వాహకులు మొదలైన సమస్త పరివారాన్ని తగినట్లుగా ఆదరించాడు” అని మైత్రేయుడు చెప్పగా విని విదురుడు ఇలా అన్నాడు.