పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-446-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; మహాత్ముల గుణంబులు దనయందు సంభావితంబులు చేయ సామర్థ్యంబులు గలిగిన నందు మహాత్ముల గుణంబులు ప్రసిద్ధంబులు గావునం దత్సమంబుగా నెట్లు నుతింపవచ్చు? నెవ్వండే నొకండు శాస్త్రాభ్యాసంబునం దనకు విద్యా తపో యోగ గుణంబులు గలుగు నని పలికిన వానిం జూచి సభ్యులు పరిహసింతు; రది కుమతి యగు వాఁ డెఱుంగండు; నదియునుం గాక.

టీకా:

మఱియున్ = ఇంకను; మహాత్ముల = గొప్పవారి; గుణంబులున్ = గుణములు; తన = తన; అందున్ = లో; సంభావితంబులున్ = సంభవించునవిగ; చేయ = చేయగల; సామర్థ్యంబులు = సమర్థతలు; కలిగినన్ = ఉన్నప్పటికని; అందున్ = అప్పుడు; మహాత్ముల = గొప్పవారి; గుణంబులున్ = గుణములు; ప్రసిద్దములు = ప్రసిద్దమైనవి; కావునన్ = కనుక; తత్ = వానికి; సమంబులు = సమానమైనవి; కాన్ = అయినట్లు; ఎట్లు = ఎలా; నుతింపన్ = స్తోత్రముచేయగ; వచ్చును = కుదురును; ఎవ్వండేని = ఎవరైన; ఒకండు = ఒకడు; శాస్త్ర = శాస్త్రములను; అభ్యాసంబునన్ = అభ్యసించుటచే; తన = తన; కున్ = కు; విద్యా = విద్యలు; తపస్ = తపస్సు; యోగ = యోగము; గుణంబులున్ = గుణములు; కలుగును = ఉన్నవి; అని = అని; పలికినన్ = అన్నచో; వానిన్ = వానిని; చూచి = చూసి; సభ్యులు = మర్యాదస్తులు; పరిహసింతురు = నవ్వుదురు; అది = దానిని; కు = చెడ్డ; మతి = బుద్ధి కలవాడు; అగు = అయిన; వాడు = వాడు; ఎఱుంగండు = తెలియలేడు; అదియున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

అంతేకాదు… మహాత్ముల గుణాలు తనయందు లేకపోయినా ఉన్నట్లు స్తుతి పాఠకులు వర్ణిస్తారు. మహాత్ముల గుణాలు సుప్రసిద్ధాలు కాబట్టి వారు పొగడగలరు. పొగిడే శక్తి వారికి ఉన్నప్పటికీ లేని గుణాలు ఆరోపించి మహాత్ములను పొగిడినట్లుగా ఎలా పొగడగలరు? శాస్త్రాలు చదవడం వల్ల తాను విద్యా తపోయోగ గుణాలను పొందాను” అని ఎవడైనా అనవచ్చు. అటువంటి వానిని చూచి సభ్యులైనవారు నవ్వుకుంటారు. ఆ మందమతి ఆ సంగతి గ్రహింపలేడు. అంతేకాక…