పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-444-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియుం; బ్రతిదివసంబు నాకాశంబు పుష్పంబులు గురియింప మహర్షులు సత్యంబులైన యాశీర్వచనంబులు సలుప సముద్రుండు శంఖంబును, నదంబులు పర్వతంబులు నదులును రథమార్గంబు నొసంగెఁ; దదనంతరంబ సూత మాగధ వంది జనంబులు దన్ను నుతియించినం బ్రతాపశాలి యగు నవ్వైన్యుండు మందస్మిత సుందర వదనారవిందుండై చతుర వచనుం డగుచు మేఘగంభీర భాషణంబుల వారల కిట్లనియె.

టీకా:

వెండియున్ = ఇంకను; ప్రతి = ప్రతీ ఒక్క; దివసంబున్ = దినమును; ఆకాశంబు = ఆకాశము; పుష్పంబులు = పూలను; కురియింప = కురిపిస్తుండగ; మహ = గొప్ప; ఋషులు = ఋషులు; సత్యంబులు = చక్కటివి; ఐన = అయిన; ఆశీర్వచనంబులు = ఆశీర్వాదములు; సలుప = చేస్తుండగ; సముద్రుండు = సముద్రుడు; శంఖంబును = శంఖము; నదంబులు = పడమటికి ప్రవహించడి నదులు; పర్వతంబులు = పర్వతములు; నదులును = తూర్పుకి ప్రవహించెడి నదులు; రథ = రథము వెళ్ళుటకు; మార్గంబున్ = దారి; ఒసంగెన్ = ఇచ్చెను; తదనంతరంబ = తరువాత; సూత = సూతులు; మాగధ = మాగధులు; వంది = వంది; జనంబులు = జనులు; తన్ను = తనను; నుతియించినన్ = స్తోత్రముచేయగ; ప్రతాపశాలి = శౌర్యవంతుడు; అగు = అయిన; వైన్యుండు = పృథుచక్రవర్తి {వైన్యుడు - వేనునికొడుకు, పృథుడు}; మందస్మిత = చిరునవ్వుతో కూడిన; సుందర = అందమైన; వదన = ముఖము అనెడి; అరవిందుండు = పద్మము కలవాడు; ఐ = అయ్యి; చతుర = నేర్పుతో కూడిన; వచనుండు = మాటలు కలవాడు; అగుచున్ = అవుతూ; మేఘ = మేఘముల వలె; గంభీర = గంభీరమైన; భాషణంబులు = మాటలతో; వారల్ = వారి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా ఆకాశం ప్రతిదినమూ పృథు చక్రవర్తిపై పూలవాన కురిపించింది. మహర్షులు అమోఘమైన ఆశీర్వాదాలు చేశారు. సముద్రుడు శంఖాన్ని కానుకగా ఇచ్చాడు. నదీనదాలు, పర్వతాలు పృథు చక్రవర్తి రథానికి మార్గం ఇచ్చాయి. అనంతరం వందిమాగధులు, సూతులు ప్రతాపవంతుడైన పృథు చక్రవర్తిని పరిపరి విధాల ప్రస్తుతించారు. పృథువు వారి స్తోత్ర పాఠాలను ఆలకించి చిరునవ్వు నవ్వుతూ మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరంతో వారితో ఇలా పలికాడు.