పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-435-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అందు లోకరక్షణార్థంబుగా నారాయణాంశంబున నొక్క పురుషుండును హరికి నిత్యానపాయిని యైన లక్ష్మీకళాకలితయు, గుణంబులను భూషణంబులకు నలంకార ప్రదాత్రియు నగు కామినియు జనియించె; అందుఁ బృథుశ్రవుండును బృథుయశుండు నగుట నతండు ‘పృథు చక్రవర్తి’ యనుపేరం ప్రసిద్ధుండయ్యె; అయ్యంగనయు ’నర్చి’ యను నామంబునం దనరుచు నతని వరియించె; నా సమయంబున.

టీకా:

అందున్ = దానిలో; లోక = లోకములను; రక్షణ = కాపాడుట; అర్థంబుగా = కోసము; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; అంశంబునన్ = అంశతో; ఒక్క = ఒక; పురుషుండును = మగవాడును; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; నిత్య = ఎల్లప్పుడును; అనపాయిని = విడిచిపెట్టనిది; ఐన = అయిన; లక్ష్మీ = లక్ష్మీదేవి యొక్క; కళా = అంశతో; కలితయు = కూడినది; గుణంబులు = సుగుణములు; అను = అనెడి; భూషణముల్ = అలంకారముల; కున్ = కు; అలంకార = అలంకార మనెడి లక్షణము; ప్రదాత్రియున్ = కలిగించునది; అగు = అయిన; కామినియు = స్త్రీ; జనియించెన్ = పుట్టినది; అందున్ = వారిలో; పృథు = పెద్ద; శ్రవుండున్ = చెవులు కలవాడును,; పృథు = పెద్ద; యశుండున్ = కీర్తి కలవాడును; అగుటన్ = అగుటచేత; అతండు = అతడు; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి; అను = అనెడి; పేరన్ = పేరుతో; ప్రసిద్ధుడు = ఖ్యాతిపొందినవాడు; అయ్యెన్ = ఆయెను; ఆ = ఆ; అంగనయున్ = స్త్రీ; అర్చి = అర్చి; అను = అనెడి; నామంబునన్ = పేరుతో; తనరుచున్ = అతిశయించి; అతని = అతనిని; వరియించెన్ = పెండ్లాడెను; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో.

భావము:

వేనరాజు బాహువులనుండి లోకసంరక్షణార్థం శ్రీమన్నారాయణుని అంశతో ఒక పురుషుడు, ఆయనను ఎప్పుడూ విడిచి ఉండని లక్ష్మీదేవి అంశతో ఒక కన్యక ఉదయించారు. ఆ కన్యక సుగుణాలే ఆమెకు సహజ భూషణాలు. ఆమె అలంకారలకే అలంకారం. పెద్ద చెవులు, పెద్ద యశస్సు కల ఆ పురుషుడే పృథు చక్రవర్తి అనే పేరుతో సుప్రసిద్ధు డయ్యాడు. ఆ స్త్రీ పేరు అర్చి. ఆమె పృథు చక్రవర్తిని వరించింది. ఆ సమయంలో…