పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-428-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదిగాన మీరు నాయందు బలివిధానంబులు చేయుం;"డని పాప కర్ముండు, నసత్ప్రవర్తకుండు, నష్టమంగళుండు, విపరీతజ్ఞానుండు నగు వేనుండు పండితమాని యగుచుం బలికి మునుల వచనంబులు నిరాకరించి యూరకున్న; నమ్మునులు భగ్నమనోరథులై తమలో నిట్లని “రీ దారుణకర్ముం డయిన పాతకుండు హతుం డగుం గాక; వీఁడు జీవించెనేని వీనిచేత నీ జగంబులు భస్మంబులు గాఁగల; విది నిశ్చితంబు; దుర్వృత్తుం డగు వీడు మహారాజ సింహాసనంబున కర్హుండు గాఁడు; వీఁడు మున్ను నే సర్వేశ్వరు ననుగ్రహంబున నిట్టి విభూతి యుక్తుం డయ్యె నట్టి యజ్ఞపతి యైన శ్రీవిష్ణుని నిందించుచున్నవాఁడు; గావున నిర్లజ్జుండైన హరినిందకుని హననంబు చేయ వలయు” నని మును లుద్యోగించి యాత్మప్రకాశితంబైన క్రోధంబునం జేసి హుంకారమాత్రంబున నా యీశ్వరనిందాహతుం డగు వేనునిం బొలియించి; రంత.

టీకా:

అదిగాన = అందుచేత; మీరు = మీరు; నా = నా; అందున్ = ఎడల; బలి = బలులు; విధానంబులు = విధానములు; చేయుండు = చేయండి; అని = అని; పాప = పాపపు; కర్ముండున్ = పనులు చేయువాడు; అసత్ = చెడ్డ; ప్రవర్తకుండున్ = నడవడిక కలవాడు; నష్ట = నాశనమైన; మంగళుండున్ = శుభములు కలవాడు; విపరీత = వ్యతిరిక్త; జ్ఞానుండున్ = జ్ఞానము కలవాడు; అగు = అయిన; వేనుండు = వేనుడు; పండితమాని = తెలిసినవాడిని యని యనుకొనెడివాడు; అగుచున్ = అవుతూ; పలికి = పలికి; మునుల = మునుల యొక్క; వచనంబులు = మాటలు; నిరాకరించి = తిరస్కరించి; ఊరకున్నన్ = ఊరకుండగా; ఆ = ఆ; మునులు = మునులు; భగ్న = విఫలమైన; మనోరథులు = కోరిక కలవారు; ఐ = అయ్యి; తమలోన్ = తమలో తాము; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; ఈ = ఈ; దారుణ = క్రూరమైన; కర్ముండున్ = పనులు చేయువాడు; అయిన = అయిన; పాతకుండు = పాపి; హతుండు = మరణించినవాడు; అగుంగాక = అయిపోవుగాక; వీడు = ఇతడు; జీవించెనేని = బతికి ఉంటే; వీని = ఇతని; చేతన్ = చేత; ఈ = ఈ; జగంబులు = లోకములు; భస్మంబులు = కాలిబూడిదైపోయినవి; కాగలవు = అయిపోగలవు; ఇది = ఇది; నిశ్చితంబు = తప్పక జరుగును; దుర్ = చెడ్డ; వృత్తుండు = నడవడిక కలవాడు; అగు = అయిన; వీడు = ఇతను; మహారాజ = మహారాజు యొక్క; సింహాసనంబున = పదవి; కున్ = కి; అర్హుండు = తగినవాడు; కాడు = కాడు; వీడు = ఇతడు; మున్నున్ = ఇంతకు ముందు; ఏ = ఏ; పరమేశ్వరున్ = భగవంతుని; అనుగ్రహంబునన్ = అనుగ్రహమువలన; ఇట్టి = ఇటువంటి; విభూతిన్ = వైభవమును; యుక్తుండు = కూడినవాడు; అయ్యెన్ = అయ్యెనో; అట్టి = అటువంటి; యజ్ఞపతి = యజ్ఞములకు అధిపతి; ఐన = అయిన; శ్రీవిష్ణుని = విష్ణుమూర్తిని; నిందించుచున్ = నిందిస్తూ; ఉన్నవాడు = ఉన్నాడు; కావునన్ = అందుచేత; నిర్లజ్జుండు = సిగ్గులేనివాడు; ఐన = అయిన; హరి = విష్ణుమూర్తిని; నిందకుని = నిందించువానిని; హననంబున్ = చంపుట; చేయవలయును = చేయవలెను; అని = అని; మునులు = మునులు; ఉద్యోగించి = సంకల్పించి; ఆత్మ = తమ; ప్రకాశితంబున్ = వెలుగుతున్నది; ఐన = అయిన; క్రోధంబునన్ = రోషము; చేసి = వలన; హుంకార = హుం అనెడి శబ్దము; మాత్రంబునన్ = మాత్రముచేతనే; ఆ = ఆ; ఈశ్వర = హరి; నిందా = నిందించుటచే; హతుండు = దెబ్బతిన్నవాడు; అగు = అయిన; వేనునిన్ = వేనుని; పొలియించిరి = సంహరించిరి; అంత = అంతట.

భావము:

కాబట్టి మీ బలులు నాకే సమర్పించండి” అని పాపాత్ముడు, దుర్మార్గుడు, అమంగళుడు, అజ్ఞాని అయిన వేనుడు విపరీతబుద్ధితో మునుల మాటలను నిరాకరించి పలికాడు. అప్పుడు మునులు తమ ప్రయత్నాలు వ్యర్థం కాగా పరస్పరం ఇలా అనుకున్నారు “భయంకర కృత్యాలకు పాల్పడుతున్న ఈ పాపాత్ముడు నశించిపోవాలి. వీడు బ్రతికి ఉన్నట్లయితే వీని వల్ల ఈ లోకాలన్నీ నశిస్తాయి. దురాచారుడైన వీడు గద్దె నెక్కటానికి అర్హుడు కాడు. ఏ సర్వేశ్వరుని అనుగ్రహం వల్ల వీడు ఇటువంటి ఐశ్వర్యాన్ని పొందాడో ఆ యజ్ఞపతి అయిన విష్ణువును నిందిస్తున్నాడు. కాబట్టి సిగ్గు మాని శ్రీహరిని నిందించే వీనిని హతమార్చాలి” అని మునులు తమలో పెల్లుబికిన కోపంతో హుంకరించారు. ఆ మహర్షుల హుంకారానికి భగవన్నిందకుడైన వేనుడు మరణించాడు. అప్పుడు…