పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-395-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రద్ధాయుక్తులై ధృతవ్రతులైన యీ బ్రహ్మవాదులచేత సంప్రయుక్తంబు లైన యీ ఛందస్సులు వీర్యవంతంబులయి యున్న యవి; ఇందు దేవతాపరాధం బణుమాత్రం బయిన నెఱుంగము; ఇట్టిచోటం గర్మసాక్షు లయిన దేవతలు స్వకీయ భాగంబు లంగీకరింపకుండుటకుఁ గతం బెయ్యదియో" యనిన న య్యంగుండు దుఃఖితస్వాంతుండై తన్నిమిత్తంబు సదస్యుల నడుగం దలంచి వారల యనుమతిం బడసి మౌనంబు మాని యిట్లనియె.

టీకా:

శ్రద్ధా = శ్రద్ధతో; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి; ధ్రుత = దీక్ష; వ్రతులు = నియమించుకొన్నవారు; ఐన = అయిన; ఈ = ఈ; బ్రహ్మవాదులు = వేదధర్మమును అనుష్ఠించువారి; చేతన్ = చేత; సంప్రయుక్తంబులు = చక్కగా ప్రయోగించబడినవి; ఐన = అయిన; ఈ = ఈ; ఛందస్సులు = మంత్రములు; వీర్యవంతంబులు = శక్తిపూరితంబులు; అయి = అయ్యి; ఉన్నయవి = ఉన్నవి; ఇందున్ = ఇందులో; దేవతా = దేవతల యెడ; అపరాధంబు = అపరాధము; అణుమాత్రంబు = కొంచము {అణుమాత్రంబు - అణువు అంత యైనను, కొంచమైనను}; అయినన్ = అయినను; ఎఱుంగము = తెలియము; ఇట్టి = ఇటువంటి; చోటన్ = చోట; కర్మసాక్షులు = కర్మములకు సాక్షీభూతులు; అయిన = అయిన; దేవతలు = దేవతలు; స్వకీయ = స్వంత; భాగంబులన్ = భాగములను; అంగీకరింపకుండుట = అంగీకరించపోవుట; కున్ = కు; కతంబున్ = కారణము; ఎయ్యదియో = ఏమిటో; అనినన్ = అనగా; ఆ = ఆ; అంగుండు = అంగుడు; దుఃఖిత = దుఃఖముతో కూడిన; స్వాంతుడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; తత్ = దానికి; నిమిత్తంబు = కారణము; సదస్యులన్ = యజ్ఞవిధి పరీక్షాధికారులు; అడుగన్ = అడగవలెనని; తలచి = అనుకొని; వారల = వారి; అనుమతిన్ = అనుమతిని; పడసి = పొంది; మౌనంబున్ = మౌనమును; మాని = విడిచి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

బ్రహ్మవేత్తలు శ్రద్ధతో, దృఢ నియమాలతో, సారవంతాలైన మంత్రాలను పఠించారు. దేవతలకు అణువంతకూడా అపరాధం జరుగలేదు. అయినా కర్మసాక్షులయిన దేవతలు తమ తమ భాగాలను గ్రహింపకుండా ఉండటానికి కారణం ఏమిటో?” అని అన్నారు. అప్పుడు అంగుడు మనస్సులో దుఃఖిస్తూ కారణం సదస్యులను అడిగి తెలుసుకొన గోరి వారి ఆజ్ఞను పొంది, మౌనాన్ని విడిచి ఇలా అన్నాడు.