పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-391-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షితినాథోత్తముఁ డాత్మనందనుని దుశ్శీలంబు వీక్షించి దుః
ఖితుఁడై యొంటిగఁ దత్పురిన్ వెడలి యేగెన్ వేగ మెందేనిఁ ద
ద్గతి వీక్షించి మునీశ్వరుల్గుపితులై దంభోళిసంకాశ వా
క్యతిం జావ శపింప వాఁ డపుడు వీఁకం గూలె, నమ్మేదినిన్

టీకా:

క్షితిన్ = భూమికి; నాథన్ = ప్రభువులలో; ఉత్తముడు = ఉత్తమమైన వాడు; ఆత్మ = తన; నందనునిన్ = పుత్రుని; దుశ్శీలంబు = చెడు నడవడిక; వీక్షించి = చూసి; దుఃఖితుడు = దుఃఖము కలవాడు; ఐ = అయ్యి; ఒంటిగన్ = ఒంటరిగ; తత్ = ఆ; పురిన్ = నగరమును; వెడలియేగెన్ = వెళ్ళిపోయెను; వేగమ = శ్రీఘ్రముగ; ఎందేని = ఎక్కడకో; తత్ = అతని; గతిన్ = నడవడికను; వీక్షించి = చూసి; ముని = మునులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; కుపితులు = కోపము కలవారు; ఐ = అయ్యి; దంభోళి = పిడుగు; సంకాశ = వంటి; వాక్య = మాటల; తతిన్ = సమూహముతో; చావన్ = మరణించమని; శపింపన్ = శపించగా; వాడు = వాడు; అపుడు = అప్పుడు; వీకన్ = దైన్యముగ; కూలెన్ = కూలిపోయెను; మేదినిన్ = నేలపైన.

భావము:

అంగరాజేంద్రుడు తన కొడుకైన వేనుని చెడు స్వభావాన్ని చూచి దుఃఖించి నగరం విడిచి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ సంగతి విని మునీశ్వరులు వేనునిపై కోపించి వజ్రకఠోరాలైన వాక్కులతో అతడు మరణించాలని శపించారు. వేనుడు వెంటనే నేలకూలాడు.