పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట

  •  
  •  
  •  

4-390-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అతని నున్మత్తునింగాఁ దెలసి తదనుజుం డైన వత్సరునికిఁ బట్టంబు గట్టిరి; ఆ వత్సరునికి సర్వర్థి యను భార్య యందుఁ బుష్పార్ణుండును, జంద్రకేతుండును, నిషుండును, నూర్జుండును, వసువును, జయుండును నన నార్వురు తనయులు గలిగిరి; అందుఁ బుష్పార్ణుం డనువానికిఁ బ్రభయు దోషయు నను నిద్దఱు భార్య లైరి; అందుఁ బ్రభ యనుదానికిం బ్రాతర్మధ్యందిన సాయంబు లను సుతత్రయంబును, దోష యను దానికిం బ్రదోష నిశీథ వ్యుష్టు లనువారు ముగ్గురును బుట్టిరి; అందు వ్యుష్టుం డనువానికిఁ బుష్కరిణి యను పత్ని యందు సర్వతేజుం డను సుతుండు పుట్టె; వానికి నాకూతి యను మహిషి వలనఁ జక్షుస్సంజ్ఞుం డయిన మనువు జనియించె; వానికి నడ్వల యను భార్య యందుఁ బురువును, గుత్సుండును, ద్రితుండును, ద్యుమ్నుండును, సత్యవంతుండును, ఋతుండును, వ్రతుండును, నగ్నిష్ఠోముండును, నతిరాత్రుండును, సుద్యుమ్నుండును, శిబియును, నుల్ముకుండును నను పన్నిద్ధఱు తనయులు గలిగిరి; అందు నుల్ముకునికిఁ బుష్కరిణి యనుదాని వలన నంగుండును, సుమనసుండును, ఖ్యాతియుఁ, గ్రతువును, నంగిరసుండును, గయుండును నను నార్వురు గొడుకులు పుట్టిరి; అందు నంగునికి సునీథ యను ధర్మపత్నివలన వేనుం డను పుత్రుం డుదయించిన.

టీకా:

అతనిన్ = అతనిని; ఉన్మత్తుని = పిచ్చివానిగ; తెలిసి = తెలుసుకొని; తత్ = అతని; అనుజుండు = సోదరుడు; ఐన = అయిన; వత్సరుని = వత్సరుని; కిన్ = కి; పట్టంబున్ = పదవీకృతుని; కట్టిరి = చేసిరి; ఆ = ఆ; వత్సరుని = వత్సరుని; కిన్ = కి; సర్వర్థి = సర్వర్థి {సర్వర్థి - సమస్తమైన ప్రయోజనములు}; అను = అనెడి; భార్య = పత్ని; అందున్ = అందు; పుష్పార్ణుండును = పుష్పార్ణుడు {పుష్పార్ణుడు - పుష్పముల అర్ణుడు (సముద్రమైనవాడు)}; చంద్రకేతుండును = చంద్రకేతుడు {చంద్రకేతువు - చంద్రుని గుర్తుకల జండాకలవాడు}; ఇషుండును = ఇషుడు {ఇషుడు - ఇష (బాణము) కలవాడు}; ఊర్జుండును = ఊర్జుడు {ఊర్జుడు - ఊర్జ (ఉత్సాహము) కలవాడు, కార్తీకమాసము}; వసువును = వసువును {వసువు - సంపద కలవాడు}; జయుండు = జయుడు {జయుడు – జయము కలవాడు}; అనన్ = అనెడి; ఆర్వురు = ఆరుగురు (6); తనయులున్ = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో; పుష్పార్ణుండు = పుష్పార్ణుడు; అను = అనెడి; వాడు = వాడు; కిన్ = కి; ప్రభయున్ = ప్రభ; దోషయున్ = దోష; అను = అనెడి; ఇద్దఱు = ఇద్దరు (2); భార్యలు = బార్యలు; ఐరి = కలరు; అందున్ = వారిలో; ప్రభ = ప్రభ {ప్రభ - వెలుగు, పగలు}; అను = అనెడి; దాని = ఆమె; కిన్ = కి; ప్రాతః = ప్రాతః {ప్రాతః - ఉదయము}; మధ్యందిన = మధ్యాహ్న {మధ్యాహ్న - మధ్యాహ్నము}; సాయంబులు = సాయము {సాయము - సాయంత్రము}; అను = అనెడి; సుత = పుత్రుల; త్రయంబునున్ = ముగ్గురు (3); దోష = దోష {దోష - రాత్రి}; అను = అనెడి; దాని = ఆమె; కిన్ = కి; ప్రదోష = ప్రదోష {ప్రదోష - సూర్యాస్తమయము తరువాతి కాలము. మునిమాపు}; నిశీథ = నిశీథ {నిశీథ - అర్థరాత్రి కాలము}; వ్యుష్టి = వ్యుష్టి {వ్యుష్టము - తెల్లవారకపూర్వపు కాలము, వేకువ}; అను = అనెడి; వారు = వారు; ముగ్గురు = ముగ్గురు (3); పుట్టిరి = పుట్టిరి; అందున్ = వారిలో; వ్యుష్టుండు = వ్యుష్టుడు; అను = అనెడి; వాడు = వాడు; కిన్ = కి; పుష్కరిణి = పుష్కరిణి {పుష్కరిణి – తామర కొలను, కోనేఱు, ఆడ ఏనుగు}; అను = అనెడి; పత్ని = భార్య; అందున్ = అందు; సర్వతేజుండు = సర్వతేజుడు; అను = అనెడి; సుతుండు = పుత్రుడు; పుట్టెన్ = పుట్టెను; వాడు = వాడు; కిన్ = కి; ఆకూతి = ఆకూతి {ఆకూతి – అభిప్రాయము }; అను = అనెడి; మహిషి = భార్య; వలన = అందు; చక్షుస్సు = చక్షుస్సు {చక్షుస్సు - కన్నుయైనవాడు}; సంజ్ఞుండు = పేరుకలవాడు; అయిన = అయిన; మనువు = మనువు; జనియించెన్ = పుట్టెను; వాడు = వాడు; కిన్ = కి; నడ్వల = నడ్వల; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; పురువును = పురువు; కుత్సుండును = కుత్సుడు; త్రితుండు = త్రితుడు; ఉద్యమ్నుండును = ఉద్యమ్నుడు; సత్యవంతుండును = సత్యవంతుడు; ఋతుండును = ఋతుడు; వ్రతుండును = వ్రతుడు; అగ్నిష్ఠోముండును = అగ్నిష్ఠోముడు; అతిరాత్రుండును = అతిరాత్రుడు; సుద్యుమ్నుండును = సుద్యుమ్నుడు; శిబియును = శిబి; ఉల్ముకుండును = ఉల్ముతుడు; అను = అనెడి; పన్నిద్దఱు = పన్నిండుమంది (12); తనయులు = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో; ఉల్ముకున్ = ఉల్ముకుని {ఉల్ముకము – మండుతున్న కొఱవి}; కిన్ = కి; పుష్కరిణి = పుష్కరిణి; అను = అనెడి; దాని = ఆమె; వలనన్ = అందు; అంగుండును = అంగుడు; సుమనసుండును = సుమనసుడు; ఖ్యాతియున్ = ఖ్యాతి; క్రతువును = క్రతువు; అంగిరసుండు = అంగిరసుడు; గయుండునున్ = గయుడు; అను = అనెడి; ఆర్వురు = ఆరుగురు (6); కొడుకులున్ = పుత్రులు; పుట్టిరి = పుట్టిరి; అందున్ = వారిలో; అంగున్ = అంగుని; కిన్ = కి; సునీథ = సునీథ {సునీథుడు – పుణ్యాత్ముడు, ధార్మికుడు (శబ్దార్థ దీపిక}; అను = అనెడి; ధర్మపత్ని = భార్య; వలనన్ = అందు; వేనుండు = వేనుడు; అను = అనెడి; పుత్రుండు = కొడుకు; ఉదయించినన్ = పుట్టగా.

భావము:

ఆ ఉత్కలుణ్ణి పిచ్చివానిగా భావించి, అతని తమ్ముడైన వత్సరునికి పట్టం కట్టారు. ఆ వత్సరునికి సర్వర్థి అనే భార్యవల్ల పుష్పార్ణుడు, చంద్రుకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనే ఆరుగురు కుమారులు కలిగారు. వారిలో పుష్పార్ణునకు ప్రభ, దోష అని ఇద్దరు భార్యలు. అందులో ప్రభకు ప్రాతస్సు, మధ్యందినం, సాయం అని ముగ్గురు కొడుకులు కలిగారు. దోషకు ప్రదోషం, నిశీథ, వ్యుష్టుడు అని ముగ్గురు కుమారులు పుట్టారు. అందులో వ్యుష్టుడు అనేవానికి పుష్కరిణి అనే భార్య వల్ల సర్వతేజుడు అనే కుమారుడు పుట్టాడు. అతనికి ఆకూతి అనే భార్యవల్ల చక్షుస్సు అనే మనువు కొడుకై పుట్టాడు. అతనికి నడ్వల అనే భార్యవలన పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్ఠోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే పన్నెండుమంది పుత్రులు కలిగారు. వారిలో ఉల్ముకునికి పుష్కరిణి అనే భార్యవల్ల అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అనే ఆరుగురు కొడుకులు పుట్టారు. వారిలో అంగునికి సునీథ అనే భార్యవల్ల వేనుడు అనే కొడుకు కలిగాడు.