పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట

  •  
  •  
  •  

4-384-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్లేశనాశనంబును మహాప్రకాశంబును నైన భగవద్భక్తియు శీలాది గుణంబులును గలుగు; మఱియుఁ దేజఃకామునకుఁ దేజంబును, మనః కామునకు మనంబును, నిష్కామునకుఁ దత్త్వవిజ్ఞానంబును గలుగు; దీని వినిపించువారికి దేవతానుగ్రహంబు గలుగు: నిట్టి యుపాఖ్యానంబు నీ కెఱింగించింతి” నని మైత్రేయుండు విదురునకుఁ జెప్పిన క్రమంబున శుకయోగి పరీక్షితున కెఱింగించిన తెఱంగున సూతుండు శౌనకాదులకు వినిపించి వెండియు నిట్లనియె "నట్లు చెప్పిన మైత్రేయునిం గని విదురుం డిట్లనియె.

టీకా:

క్లేశ = క్లేశములు, చీకాకులు; నాశనంబును = నాశన మగుట; మహా = గొప్ప; ప్రకాశంబునున్ = ప్రకాశవంతము; ఐన = అయిన; భగవత్ = భగవంతుని యెడ; భక్తియున్ = భక్తి; శీల = శీలము, మంచి నడవడిక; ఆది = మొదలగు; గుణంబులును = గుణములును; మఱియున్ = ఇంకను; తేజస్ = తేజస్సును; కామున్ = కోరెడివాని; కున్ = కి; తేజంబును = తేజస్సును; మనః = మానసిక శక్తిని; కామున్ = కోరెడివాని; కున్ = కి; మనంబును = మానసిక శక్తిని; నిష్కామున్ = విరాగుని; కున్ = కి; తత్త్వ = తత్త్వ; విజ్ఞానంబును = విజ్ఞానమును; కలుగున్ = కలుగును; దీనిన్ = దీనిని; వినిపించు = వినపించెడి; వారి = వారి; కిన్ = కి; దేవతా = దైవ; అనుగ్రహంబున్ = కరుణ; కలుగున్ = కలుగును; ఇట్టి = ఇటువంటి; ఉపాఖ్యానంబున్ = ఉపాఖ్యానమును {ఉపాఖ్యానము - ఇతిహాసము, ఒక కథాకథనమున వచ్చెడి మరియెక కథ}; నీ = నీ; కున్ = కి; ఎఱిగించితిని = తెలిపితిని; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; విదురున్ = విదురుని; కున్ = కి; చెప్పినన్ = చెప్పినట్టి; క్రమంబు = విధముగ; శుక = శుకుడు అనెడి; యోగి = యోగి; పరీక్షితున్ = పరీక్షితుని; కిన్ = కి; ఎఱింగించిన = తెలిపిన; తెఱంగునన్ = విధముగ; సూతుండు = సూతుడు; శౌనక = శౌనకుడు; ఆదులు = మొదలగు వారి; కున్ = కి; వినిపించి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అట్లు = అలా; చెప్పినన్ = చెప్పినట్టి; మైత్రేయునిన్ = మైత్రేయుని; కని = చూసి; విదురుండు = విదురుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

క్లేశాలు నాశనం అవుతాయి,, ప్రకాశవంతం అయిన భగవద్భక్తి, మంచి శీలం అలవడుతాయి. తేజస్సు కోరేవానికి తేజస్సు, మానసిక శక్తిని కోరేవానికి మానసిక శక్తిని, కోరికలు లేనివానికి తత్త్వజ్ఞానం కలుగుతాయి. ఈ కథను వినిపించేవారికి దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఇటువంటి ధ్రువోపాఖ్యానాన్ని నీకు వినిపించాను” అని మైత్రేయుడు విదురునికి వినిపించాడని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు తెలిపిన విధానాన్ని సూతుడు శౌనకాది మునులకు చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “ఆ విధంగా చెప్పిన మైత్రేయుని చూచి విదురుడు ఇలా అన్నాడు.