పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-355-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక, దేహాభిమానంబునం బశుప్రాయులై భూతహింస గావించుట హృషీకేశానువర్తను లైన సాధువులకుం దగదు; నీవ సర్వభూతంబుల నాత్మభావంబునఁ దలంచి సర్వభూతావాసుండును దురారాధ్యుండును నైన విష్ణుని పదంబులఁ బూజించి తత్పరమపదంబును బొందితి; వట్టి భగవంతుని హృదయంబున ననుధ్యాతుండవు, భాగవతుల చిత్తంబులకును సమ్మతుండవు మఱియు సాధువర్తనుండ వన నొప్పు నీ వీ పాపకర్మం బెట్లు చేయ సమకట్టితి? వే పురుషుండైననేమి మహాత్ముల యందుఁ దితిక్షయు, సముల యందు మైత్రియు, హీనుల యందుఁ గృపయు, నితరంబులగు సమస్త జంతువుల యందు సమత్వంబును గలిగి వర్తించు వానియందు సర్వాత్మకుం డైన భగవంతుడు ప్రసన్నుం డగు; నతండు ప్రసన్నుం డయిన వాఁడు ప్రకృతి గుణంబులం బాసి లింగశరీరభంగంబు గావించి బ్రహ్మానందంబునుం బొందు; నదియునుం గాక, కార్య కారణ సంఘాత రూపంబైన విశ్వం బీశ్వరునందు నయస్కాంత సన్నిధానంబు గలిగిన లోహంబు చందంబున వర్తించు; నందు సర్వేశ్వరుండు నిమిత్తమాత్రంబుగాఁ బరిభ్రమించు; నట్టి యీశ్వరుని మాయా గుణ వ్యతికరంబున నారబ్ధంబు లైన పంచభూతంబుల చేత యోషిత్పురుషవ్యవాయంబు వలన యోషిత్పురుషాదిరూప సంభూతి యగు; నివ్విధంబునఁ దత్సర్గంబుఁ దత్సంస్థానంబుఁ దల్లయంబు నగుచు నుండు; నిట్లు దుర్విభావ్యం బైన కాలశక్తిం జేసి గుణక్షోభంబున విభజ్యమాన వీర్యుండు ననంతుండు ననాదియు నై జనంబులచేత జనంబులం బుట్టించుచుండుటం జేసి యాదికరుండును, మృత్యుహేతువున జనంబుల లయంబు నొందించుటం జేసి యంతకరుండును, ననాది యగుటంజేసి యవ్యయుండును నైన భగవంతుండు జగత్కారణుం డగుం; గావున నీ సృష్టి పాలన విలయంబులకుం గర్తగానివాని వడుపున దానిఁ జేయుచుండు; నిట్లు మృత్యరూపుండును బరుండును సమవర్తియు నైన యీశ్వరునికి స్వపక్ష పరపక్షంబులు లేవు; కర్మాధీనంబులైన భూతసంఘంబులు రజంబు మహావాయువు ననుసరించు చాడ్పున నస్వతంత్రంబు లగుచు నతని ననువర్తించు; నీశ్వరుండును జంతుచయాయు రుపచయాపచయ కరణంబులం దస్పృష్టుండును నగు జీవుండు గర్మబద్ధుం డగుటంజేసి కర్మంబ వానికి నాయురుపచయాపచయంబులం జేయుచుండు; మఱియు సర్వజగత్కర్మసాక్షి యగు సర్వేశ్వరుని.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దేహా = శరీరముపైని; అభిమానంబునన్ = అభిమానమువలన; పశుప్రాయులు = పశువుల వంటివారు; ఐ = అయ్యి; భూత = జీవులను; హింస = హింస; కావించుట = చేయుట; హృషీకేశ = విష్ణుని {హృషీకేశుడు - హృషీకములు (ఇంద్రియములు)కు ఈశుడు, విష్ణువు, వ్యు. హృషీకేశః – హృషీకాణాం (ఇంద్రియాణాం) ఈశః (నియామకుడు), విష్ణుసహస్రనామాలులోని 47వ నామం, సూర్య చంద్రుల (హృష్టముల) కేశములు (కిరణములు) చే జగత్తునకు ప్రబోధము, స్వాపము కలిగించువాడు, ఇంద్రియాలకు క్షేత్రజ్ఞరూపుడు}; అనువర్తులు = మార్గ మనుసరించువారు; ఐన = అయినట్టి; సాధువుల్ = మంచివారి; కున్ = కి; తగదు = తగిన పనికాదు; నీవు = నీవు; సర్వ = అన్ని; భూతంబులన్ = జీవులను; ఆత్మ = తానను; భావమునన్ = భావముతో; తలంచి = తలచి; సర్వ = అన్ని; భూత = జీవు లందును; ఆవాసుండు = వసించువాడును; దురారాధ్యుండును = ఆరాధించుట కష్టమైనవాడును; ఐన = అయినట్టి; విష్ణుని = విష్ణుమూర్తి యొక్క; పదంబులన్ = పాదములను; పూజించి = పూజించి; తత్ = అతని యొక్క; పరమ = అత్యుత్తమమైన; పదంబునున్ = స్థానమును; పొందితివి = పొందితివి; అట్టి = అటువంటి; భగవంతుని = విష్ణువుని; హృదయంబునన్ = హృదయమందు; అనుధ్యాతుండవు = అనుకూలముగ ధ్యానము చేయబడిన వాడవు; భాగవతుల = భాగవతుల యొక్క; చిత్తంబుల్ = మనసుల; కున్ = కు; సమ్మతుండవు = అంగీకారము పొందిన వాడవు; మఱియున్ = ఇంకను; సాధు = మంచి; వర్తనుండవు = నడవడిక కలవాడవు; అనన్ = అనుటకు; ఒప్పు = తగనట్టి; నీవు = నీవు; ఈ = ఈ విధమైన; పాప = పాపపు; కర్మంబున్ = కర్మమును; ఎట్లు = ఏ విధముగ; చేయన్ = చేయుటకు; సమకట్టితివి = పూనుకొంటివి; ఏ = ఏ; పురుషుండు = మానవుడు; ఐననేమి = అయితే; మహాత్ముల = గొప్పవారి; అందున్ = ఎడల; తితిక్షయున్ = సహనము; సముల = సమానమైనవారి; అందున్ = ఎడల; మైత్రియున్ = స్నేహము; హీనులు = తక్కువ వారి; అందున్ = ఎడల; కృపయున్ = దయ; ఇతరంబులు = ఇతరము; ఐన = అయినట్టి; సమస్త = సమస్తమైన; జంతువులు = ప్రాణుల; అందున్ = ఎడల; సమత్వంబును = సమత్వము; కలిగి = ఉండి; వర్తించు = నడచు; వాని = వాని; అందున్ = ఎడల; సర్వ = అందరిలోను; ఆత్మకుండు = ఆత్మరూపమున ఉండువాడు; ఐన = అయినట్టి; భగవంతుండు = నారాయణుడు; ప్రసన్నుండు = ప్రసన్నత కలవాడు; అగు = అగును; అతండు = అతడు; ప్రసన్నుండు = ప్రసన్నుండు; అయిన = అయినచో; వాడు = వాడు; ప్రకృతిగుణంబులన్ = ప్రకృతి గుణములను {ప్రకృతి గుణములు - త్రిగుణ సమ్మేళనము వలన పుట్టిన వ్యక్తిగతమైన ప్రత్యేక స్వభావము నందలి గుణములు}; పాసి = తొలగి; లింగశరీర = లింగశరీరమును {లింగశరీరము - తన ప్రత్యేక స్వభావ సంస్కారముల గుర్తులుగల ప్రవర్తనాత్మకమయిన దేహము}; భంగంబున్ = బద్దలుకొట్టుటను; కావించి = చేసి; బ్రహ్మానందబునున్ = బ్రహ్మానందమును; పొందున్ = పొందును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; కార్య = కార్యము; కారణ = కారణముల; సంఘాత = కూడిన; రూపంబు = రూపము కలది; ఐన = అయినట్టి; విశ్వంబు = జగత్తు; ఈశ్వరుని = భగవంతుని; అందున్ = లో; అయస్కాంత = అయస్కాంతము యొక్క; సన్నిధానంబు = సామీప్యము; కలిగిన = ఉన్నట్టి; లోహంబున్ = ఇనుము; చందంబునన్ = వలె; వర్తించు = ప్రవర్తించును; అందున్ = అందులో; సర్వేశ్వరుండు = భగవంతుడు, {విష్ణుసహస్రనామాలులో 96వ నామం, ఈశ్వరులందరికి ఈశ్వరుడు}; నిమిత్తమాత్రంబుగా = నిమిత్తమాత్రముగా; పరిభ్రమించు = తిరుగుతుండును; అట్టి = అటువంటి; ఈశ్వరుని = భగవంతుని; మాయా = మాయ యొక్క; గుణ = గుణముల; వ్యతికరంబున్ = అల్లిక, పరస్పర మేళనంబువలన; ఆరబ్ధంబులు = ఆరంభింపబడినవి, కల్పింపబడినవి; ఐన = అయినట్టి; పంచభూతంబుల = పంచభూతముల {పంచభూతంబులు - 1.భూమి 2.జలము 3తేజస్సు 4.వాయువు 5,ఆకాశము "పృథివ్యాపస్తేజో వాయురాకాశమితి భూతాని"[గౌతమన్యాయసూత్రములు 1-1-13]}; చేతన్ = చేత; యోషిత్ = స్త్రీ; పురుష = పురుష; వ్యవాయంబున్ = లక్షణముల సమ్మేళనము; వలనన్ = వలన; యోషిత్ = స్త్రీ; పురుష = పురుషులు; ఆది = మొదలగు; రూప = రూపముల; సంభూతి = పుట్టుకలు; అగు = అగును; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; తత్ = ఆ; సర్గంబును = సృష్టి; తత్ = దాని; సంస్థానంబున్ = స్థితి; తత్ = దాని; లయంబున్ = లయమును; అగుచున్ = అవుతూ; ఉండున్ = ఉండును; ఇట్లు = ఈ విధముగ; దుర్విభావ్యంబు = భావింప శక్యము కానిది; ఐన = అయినట్టి; కాలశక్తిన్ = కాలము అనెడి శక్తి; చేసి = వలన; గుణ = గుణముల; క్షోబంబునన్ = సమ్మేళనము నందు; విభజ్యమాన = విభజింపబడుతున్న; వీర్యుండు = శక్తి కలవాడు; అనంతుడు = అంతము లేనివాడు, {అనంతః - విష్ణుసహస్రనామాలులో 659వ నామం, 886వ నామం, అంతములేనివాడు, సర్వత్రా సర్వకాలము లందు ఉండువాడు}; అనాదియున్ = మొట్టమొదటినుండి ఉన్నవాడు {అనాదిః - విష్ణుసహస్రనామాలులో 941వ నామం, ఆది లేని వాడు, తనకు కారణము లేనివాడు}; ఐ = అయ్యి; జనంబుల = జనముల; చేతన్ = చేత; జనంబులన్ = జనులను; పుట్టించుచున్ = పుట్టిస్తూ; ఉండుటన్ = ఉండుట; చేసి = వలన; ఆదికరుండును = మొదలు అనెడి దానిని చేయువాడు; మృత్యు = మరణము అనెడి; హేతువున్ = కారణముచే; జనంబులన్ = జనములను; లయంబున్ = లయమును; ఒందించుటన్ = పొందిస్తుండుట; చేసి = వలన; అంతకరుండును = అంతము అనెడి దానిని కలిగించువాడు; అనాది = మొదలు అనెడిది లేనివాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; అవ్యయుండును = వ్యయము కానివాడు {అవ్యయః విష్ణుసర్వనామాలులో 13వ నామం, 900వ నామం వినాశముకాని, వికారము కాని లేనివాడు}; ఐన = అయిన; భగవంతుండు = భగవంతుడు; జగత్ = లోకములకు; కారణుండు = కారణము యైనవాడు; అగున్ = అగును; కావునన్ = అందుచేత; ఈ = ఈ; సృష్టి = సృష్టి; పాలన = స్థితి; విలయంబుల = లయముల; కున్ = కు; కర్తకానివాని = కర్త కాని వాని; వడుపునన్ = విధముగ; దానిన్ = దానిని; చేయుచుండు = చేస్తుండును; ఇట్లు = ఈ విధముగ; మృత్యు = మృత్యువు యొక్క; రూపుండును = రూపము కలవాడును; పరుండును = అతీతుడును; సమవర్తియున్ = సమత్వముతో వర్తించువాడును; ఐన = అయిన; ఈశ్వరుని = ఈశ్వరుని; కిన్ = కి; స్వ = తన; పక్షంబున్ = వారు; పర = ఇతరులు యైన; పక్షంబున్ = వారు; లేవు = అనెడి భేదములు లేవు; కర్మ = కర్మకు; ఆధీనంబులు = ఆధీనము యైనవి; ఐన = అయిన; భూత = జీవ; సంఘంబులున్ = సమూహములు; రజంబున్ = ధూళిరేణులు; మహా = గొప్ప; వాయువు = గాలిని; అనుసరించు = అనుసరించెడి; చాడ్పున = విధముగ; అస్వతంత్రంబులు = స్వతంత్రము లేనివి; అగుచున్ = అవుతూ; అతనిన్ = అతనిని; అనువర్తించు = అనుసరించును; ఈశ్వరుండును = భగవంతుడును; జంతు = జంతువుల; చయ = సమూహములు; ఆయుః = ఆయుర్దాయములను; ఉపచయ = సమకూర్చుట; అపచయ = రూపుమాపుట; కరణంబులు = చేయుటల; అందున్ = లో; అస్పృష్టుండును = తాకనివాడును; అగున్ = అగును; జీవుండు = ప్రాణి; కర్మ = కర్మలచే; బద్ధుండు = కట్టబడినవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; కర్మంబ = కర్మమే; వాని = వాని; కిన్ = కి; ఆయుః = ఆయుర్దాయములను; ఉపచయ = సృష్టించుటయునప; అపచయంబులన్ = లయంబును; చేయుచుండు = చేస్తుండును; మఱియున్ = ఇంకను; సర్వ = అన్ని; జగత్ = లోకములకు; కర్మ = కర్మములకు; సాక్షి = తెలిసి చూచెడివాడు; అగు = అయిన; సర్వేశ్వరుని = సర్వేశ్వరుని.

భావము:

అంతేకాక దేహం మీది అభిమానంతో పశువులవలె ప్రాణి హింస చేయడం శ్రీహరి భక్తులైన సజ్జనులకు తగదు. నీవు సర్వప్రాణులను నీవలె భావించి సర్వప్రాణి స్వరూపుడైన శ్రీహరిని కొలిచి ఆయన స్థానాన్ని సాధించావు. ఆయన మనస్సుకు ఎక్కావు. హరిభక్తులను మెప్పించావు. నీవు మంచి నడవడి కలవాడవు. తనకంటే గొప్పవారియందు సహనభావం, తనతో సమానులయందు స్నేహభావం, తనకంటే తక్కువ వారియందు దయ, మిగిలిన సమస్త ప్రాణులయందు సమభావం కలిగి వర్తించే వానిని సర్వాంతర్యామి అయిన భగవంతుడు కరుణిస్తాడు. భగవంతుడు కరుణిస్తే మానవుడు ప్రాకృత గుణాలనుండి విముక్తుడై లింగ శరీరాన్ని విడిచి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అయస్కాంతం సన్నిధిలో లోహం భ్రమించినట్లు పరమాత్ముని సన్నిధిలో కార్యకారణ స్వరూపమైన ప్రపంచం భ్రమిస్తుంది. సర్వేశ్వరుడు నిమిత్తమాత్రంగా ఉంటాడు. అటువంటి భగవంతుని మాయాగుణ సంబంధంవల్ల పంచభూతాల వల్ల దేహాది ఆకారాలను పొందిన స్త్రీ పురుషుల కలయిక చేత స్త్రీపురుషుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధంగా సృష్టి, స్థితి, నాశము జరుగుతూ ఉంటాయి. ఊహింప శక్యం కాని కాలశక్తి ద్వారా జనములనుండి జనములను పుట్టించడం వల్ల ఆద్యుడు, నశింపజేయటం వల్ల అంతకుడు, అనాది కావటం వల్ల అవ్యయుడు అయి భగవంతుడు జగత్తుకు కారణం అవుతాడు. అందువల్ల సృష్టి స్థితి లయాలను చేయనట్లే ఉండి చేస్తుంటాడు. ఈ విధంగా మృత్యుస్వరూపుడు, పరుడు, సమవర్తి అయిన భగవంతునకు తనవారనీ, పరులనీ భేదం లేదు. కర్మలకు లోబడిన జీవులు స్వతంత్రత లేనివారై ధూళికణాలు గాలిని అనుసరించిన విధంగా భగవంతుని అనుసరిస్తారు. ఉపచయం, అపచయం కలిగిస్తాడు. సర్వేశ్వరుడు కర్మసాక్షి.