పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-353-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున నా చిత్రరథుండగు ధ్రువునిచేత నిహన్యమానులును నిరపరాధులును నయిన గుహ్యకులం జూచి యతని పితామహుండైన స్వాయంభువుండు ఋషిగణ పరివృతుం డై చనుదెంచి ధ్రువునిం జూచి యిట్లనియె “వత్సా నిరపరాధులైన యీ పుణ్యజనుల నెట్టి రోషంబున వధియించితి, వట్టి నిరయహేతువైన రోషంబు చాలు; భ్రాతృవత్సల! భ్రాతృవధాభితప్తుండవై కావించు నీ యత్నం బుడుగుము.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ఆ = ఆ; చిత్రరథుండు = సూర్యనివంటివాడు; అగు = అయినట్టి; ధ్రువుని = ధ్రువుని; చేతన్ = చేత; నిహన్యమానులును = చంపబడినవారును; నిరపరాధులును = అపరాధములు లేనివారును; అయిన = అయినట్టి; గుహ్యకులన్ = గుహ్యకులను; చూచి = చూసి; అతని = అతని యొక్క; పితామహుండు = తాత; ఐన = అయినట్టి; స్వాయంభువుండు = స్వాయంభువ మనువు; ఋషి = ఋషుల; గణ = సమూహముచే; పరివృతుండు = చుట్టును యున్నవాడు; ఐ = అయ్యి; చనుదెంచి = వచ్చి; ధ్రువునిన్ = ధ్రువుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; వత్సా = పుత్రా; నిరపరాధులును = అపరాధములు లేనివారు; ఐన = అయినట్టి; ఈ = ఈ; పుణ్యజనులన్ = రాక్షసులను; ఎట్టి = ఎటువంటి; రోషంబునన్ = రోషముతో; వధియించితివి = సంహరించావో; అట్టి = అటువంటి; నిరయ = దుర్గతికి, నరకానికి; హేతువు = కారణము; ఐన = అయినట్టి; రోషంబున్ = రోషము; చాలు = చాలు; భాతృవత్సల = సోదరప్రేమ కలవాడ; భాతృ = సోదరుని; వధా = సంహారమునకు; అభితప్తుండవు = మిక్కిలి బాధపడినవాడవు; ఐ = అయ్యి; కావించు = చేసెడి; నీ = నీ; యత్నంబు = ప్రయత్నమును; ఉడుగుము = మానుము.

భావము:

ఈ విధంగా చిత్రరథుడైన ధ్రువుడు సంహరిస్తున్న నిరపరాధులైన యక్షులను చూచి ధ్రువుని తాత అయిన స్వాయంభువ మనువు ఋషులతో కూడి వచ్చి ధువునితో ఇలా అన్నాడు “నాయనా! తప్పు చేయని యక్ష రాక్షసులను కోపంతో వధించావు. నరక కారణమైన క్రోధాన్ని చాలించు. తమ్ముని చావునకు పరితపించి నీవు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విరమించు.