పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-342-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు పురంబున కరుగుట మాని చిత్రరథుండైన యా ధ్రువుండు సప్రయత్నుం డయ్యును బరప్రతియోగశంకితుండై యుండె; నయ్యెడ మహాజలధి ఘోషంబు ననుకరించు శబ్దంబు వినంబడె; నంత సకల దిక్తటంబుల వాయుజనితం బయిన రజః పటలంబు దోఁచె; దత్క్షణంబ యాకాశంబున విస్ఫురత్తటిత్ప్రభా కలిత గర్జారవయుక్త మేఘంబు లమోఘంబులై భయంకరాకారంబులై తోఁచె; నంత.

టీకా:

అట్లు = ఆ విధముగ; పురంబున్ = పురమునకు; అరుగుట = వెళ్ళుట; మాని = మాని; చిత్ర = విశిష్టమైన; రథుండు = రథముపై ఎక్కినవాడు; ఐన = అయిన; ఆ = ఆ; ధ్రువుండు = ధ్రువుడు; సప్రయత్నుండు = ప్రయత్నముతో కూడినవాడు; అయ్యున్ = అయినప్పటికిని; పర = శత్రువుల; ప్రతియోగ = ప్రతిక్రియలందు; శంకితుండు = సందేహపడుతున్నవాడు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; ఎడన్ = స్థలములో; మహా = గొప్ప; జలధి = సముద్రమును; అనుకరించు = పోలెడి; శబ్దంబున్ = సవ్వడి; వినంబడెన్ = వినబడెను; అంత = అంతలోనే; సకల = అన్ని; దిక్తటంబులు = దిగంతములందు; వాయు = గాలిచే; జనితంబున్ = పుట్టినది; అయిన = అయిన; రజస్ = ధూళి; పటలంబు = తెరలు; తోచెన్ = కనబడిన ట్లనిపించెను; తత్క్షణంబ = వెంటనే; ఆకాశంబునన్ = ఆకాశములో; విస్ఫుర = మెరుస్తున్న; తటత్ = మెరుపుల; ప్రభా = కాంతులతో; కలిత = కూడిన; గర్జా = ఘర్జనల; రవ = శబ్దములతో; యుక్త = కలిసిన; మేఘంబులు = మేఘములు; అమోఘంబులు = అమోఘంబులు; ఐ = అయ్యి; భయంకర = భీకరమైన; ఆకారంబులు = రూపములు కలవి; ఐ = అయ్యి; తోచెన్ = కనబడిన ట్లనిపించెను; అంత = అంతట.

భావము:

అందువల్ల ధ్రువుడు మహా ప్రయత్నశాలి అయినా శత్రువుల ప్రతిక్రియలు అంతుపట్టక, పట్టణంలోకి ప్రవేశించే ప్రయత్నాన్ని మానుకున్నాడు. అప్పుడు మహాసముద్రఘోష వంటి ధ్వని వినిపించినట్లు. దిక్కులన్నీ పెనుగాలి రేపిన ధూళితో కప్పబడ్డట్లు. ఆకాశంలో మెరుపులు తళతళ మెరిసినట్లు. మేఘాలు భయంకరంగా గర్జించినట్లు తోచసాగింది.