పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-322-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు ప్రవేశించిన రాజర్షి యైన యుత్తానపాదుండు సుతుని యాశ్చర్యకరంబైన ప్రభావంబు వినియుం జూచియుం మనంబున విస్మయంబు నొంది ప్రజానురక్తుండును, బ్రజాసమ్మతుండును, నవయౌవ్వన పరిపూర్ణుండును నైన ధ్రువుని రాజ్యాభిషిక్తుం జేసి వృద్ధవయస్కుండైన తన్నుఁదాన యెఱింగి యాత్మగతిఁ బొంద నిశ్చయించి విరక్తుండై వనంబునకుం జనియె; నంత నా ధ్రువుండు శింశుమార ప్రజాపతి కూఁతురైన భ్రమి యను దాని వివాహంబై దానివలనఁ గల్ప, వత్సరు లను నిద్దఱు గొడుకులం బడసి; వెండియు వాయుపుత్రియైన యిల యను భార్య యందు నుత్కల నామకుఁడైన కొడుకు నతి మనోహర యైన కన్యకారత్నంబునుం గనియె; నంత దద్భ్రాత యైన యుత్తముండు వివాహంబు లేకుండి మృగయార్థంబు వనంబున కరిగి హిమవంతంబున యక్షునిచేత హతుండయ్యె; నతని తల్లియుఁ దద్దుఃఖంబున వనంబున కేఁగి యందు గహనదహనంబున మృతిం బొందె; ధ్రువుండు భ్రాతృమరణంబు విని కోపామర్షశోకవ్యాకులిత చిత్తుండై జైత్రంబగు రథంబెక్కి యుత్తరాభిముఖుండై చని హిమవద్ద్రోణి యందు భూతగణ సేవితంబును గుహ్యక సంకులంబును నైన యలకాపురంబు బొడగని యమ్మహాబాహుండు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ప్రవేశించిన = ప్రవేశించగా; రాజర్షి = రాజులలో ఋషి; ఐన = అయిన; ఉత్తానపాదుండు = ఉత్తానపాదుడు; సుతుని = పుత్రుని; ఆశ్చర్యకరంబులు = ఆశ్చర్యమును కలిగించెడివి; ఐన = అయిన; ప్రభావంబులు = ప్రభావములను; వినియున్ = విని; చూచియున్ = చూసి; మనంబునన్ = మనసులో; విస్మయంబును = ఆశ్చర్యమును; ఒంది = పొంది; ప్రజ = ప్రజల యందు; అనురక్తుండును = అనురాగము కలవాడును; ప్రజా = ప్రజల; సమ్మతుండును = అంగీకార మైనవాడును; నవయౌవ్వన = నవయౌవ్వనముతో; పరిపూర్ణుండును = నిండుగ నున్నవాడును; ఐన = అయిన; ధ్రువునిన్ = ధ్రువుని; రాజ్యాభిషిక్తున్ = రాజ్యాభిషిక్తునిగా; చేసి = చేసి; వృద్ధ = ముసలి; వయస్కుండు = వయస్కుడు; ఐన = అయిన; తన్నుదాన = తననుతాను; ఎఱింగి = తెలుసుకొని; ఆత్మ = ఆత్మదర్శన; గతిన్ = మార్గమును; పొందన్ = పొందుటను; నిశ్చయించి = నిశ్చయించి; విరక్తుండు = వైరాగ్యము చెందినవాడు; ఐ = అయ్యి; వనంబున్ = అడవికి; చనియెన్ = వెళ్ళెను; అంతన్ = అంతట; ధ్రువుండు = ధ్రువుడు; శింశుమార = శింశుమార {శింశుమార చక్రము – గ్రహ నక్షత్ర మండలములు తిరిగెడు చక్రము}; ప్రజాపతి = ప్రజాపతి; కూతురు = పుత్రిక; ఐన = అయిన; భ్రమి = భ్రమి {భ్రమి – భ్రమించెడిది}; అను = అనెడి; దానిన్ = ఆమెని; వివాహంబున్ = పెండ్లి; ఐ = అయ్యి; దానిన్ = ఆమె; వలనన్ = అందు; కల్ప = కల్పుడును; వత్సరులు = వత్సరుడును {వత్సరము - సంవత్సరము}; అను = అనెడి; ఇద్దఱున్ = ఇద్దరిని; కొడుకులన్ = పుత్రులను; పడసి = పొంది; వెండియున్ = మరల; వాయు = వాయుదేవుని; పుత్రి = పుత్రిక; ఐన = అయిన; ఇల = ఇల; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; ఉత్కల = ఉత్కలుడు; నామకుడు = అనెడి పేరు కలవాడు; ఐన = అయిన; కొడుకున్ = పుత్రుని; అతి = మిక్కిలి; మనోహర = అందమైనది; ఐన = అయిన; కన్యకా = కన్యలలో; రత్నంబున్ = రత్నమువంటి ఆమెను; కనియెన్ = కనెను; అంతన్ = అంతట; తత్ = అతని; భ్రాత = సోదరుడు; ఐన = అయిన; ఉత్తముండు = ఉత్తముడు; వివాహంబున్ = పెండ్లి; లేకుండి = కాక యుండి; మృగయా = వేట; అర్థంబున్ = కోసము; వనంబున్ = అడవికి; అరిగి = వెళ్ళి; హిమవంతంబునన్ = హిమవత్పర్వతము నందు; యక్షుని = యక్షుని; చేతన్ = చేత; హతుండు = మరణించినవాడు; అయ్యెన్ = ఆయెను; అతని = అతని; తల్లియున్ = తల్లికూడ; తత్ = ఆ; దుఃఖంబునన్ = దుఃఖముతో; వనంబున్ = అడవికి; ఏగి = వెళ్ళి; అందున్ = అందులో; గహనదహనంబునన్ = కారుచిచ్చులో; మృతిన్ = మరణమును; పొందెన్ = పొందెను; ధ్రువుండు = ధ్రువుడు; భాత్రు = సోదరుని; మరణంబున్ = మరణమును; విని = విని; కోప = కోపము; అమర్ష = రోషము; శోక = దుఃఖములతో; వ్యాకులిత = చీకాకుపడిన; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; జైత్రంబు = జయించు లక్షణము కలది; అగు = అయిన; రథంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; ఉత్తర = ఉత్తరపు దిక్కు; అబిముఖుండు = వైపు వెళ్ళువాడు; ఐ = అయ్యి; చని = వెళ్ళి; హిమవద్ద్రోణి = హిమాలయ పర్వతపంక్తి; అందున్ = అందు; భూత = భూతముల; గణ = సమూహములచే; సేవితంబునున్ = సేవింపబడుతున్నది; ఐన = అయిన; గుహ్యక = గుహ్యకులచే; సంకులంబున్ = వ్యాపించినది; ఐన = అయిన; అలకాపురంబున్ = అలకాపురమును; పొడగని = కాంచి; ఆ = ఆ; మహాబాహుండు = మహాపరాక్రమశాలి {మహాబాహుడు - గొప్ప బాహువులు కలవాడు, మహాపరాక్రమశాలి}.

భావము:

ఆ విధంగా ప్రవేశించగా రాజర్షి అయిన ఉత్తానపాదుడు అద్భుతమైన కొడుకు ప్రభావానికి ఆశ్చర్యపడ్డాడు. ధ్రువునకు ప్రజలపై గల అనురాగాన్ని, ప్రజలకు ధ్రువునిపై గల అభిమానాన్ని పరికించి నవయౌవనవంతుడైన ధ్రువుణ్ణి రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసాడు. తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకొని సుగతిని పొందడానికి నిశ్చయించుకొని విరక్తుడై తపోవనానికి వెళ్ళాడు. ఆ తరువాత ధ్రువుడు శింశుమార ప్రజాపతి కూతురయిన భ్రమిని వివాహమాడి ఆమెవల్ల కల్పుడు, వత్సరుడు అనె ఇద్దరు కొడుకులను పొందాడు. వాయు పుత్రిక అయిన ఇలను పెండ్లాడి ఆమెవల్ల ఉత్కలుడు అనే కొడుకును, సౌందర్యవతి అయిన కూతురును పొందాడు. ధ్రువుని తమ్ముడైన ఉత్తముడు పెండ్లి కాకముందే వేటాడటానికి హిమవత్పర్వత ప్రాంతంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఉత్తముని తల్లియైన సురుచి పుత్రదుఃఖంతో అడవికి వెళ్ళి అక్కడ కారుచిచ్చు మంటలలో చిక్కి మరణించింది. ధ్రువుడు తమ్ముని మరణవార్త విని కోపంతోను, దుఃఖంతోను కలత చెందిన మనస్సు కలవాడై జయశీలమైన రథాన్ని ఎక్కి ఉత్తరదిక్కుగా వెళ్ళాడు. అక్కడ మంచుకొండ లోయలో భూతగణాలతోను, యక్షులతోను నిండిన అలకాపురాన్ని చూచి మహాపరాక్రమవంతుడైన ఆ ధ్రువుడు…