పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు మరలివచ్చుట

  •  
  •  
  •  

4-319-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాంచన మయ మరత కుడ్య మణిజాల-
సంచయ రాజిత సౌధములను
రసుధాఫేన పాండుర రుక్మ పరికరో-
దాత్త పరిచ్ఛదల్పములను
సురతరు శోభిత శుక పిక మిథునాళి-
గాన విభాసి తోద్యానములను
సుమహిత వైడూర్య సోపాన విమల శో-
భిత జలపూర్ణ వాపీచయముల

4-319.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వికచ కహ్లార దర దరవింద కైర
ప్రదీపిత బక చక్రవాక రాజ
హంస సారస కారండవాది జల వి
హంగ నినదాభిరామ పద్మాకరముల.

టీకా:

కాంచన = బంగారమున; మయ = తాపిన; మరకత = పచ్చల; కుడ్య = గోడల; మణి = మణుల; జాల = కిటికీల; సంచయ = సమూహములుకలిగిన; రంజిత = ప్రకాశించు; సౌధములను = మేడలను; = వర = శ్రేష్టమైన; సుధా = అమృతపు; ఫేన = నురుగ వలె; పాండుర = తెల్లని; రుక్మ = బంగారపు; పరికర = చుట్టంచులుగల; ఉదాత్త = ఉత్తమమైన; పరిచ్ఛద = దుప్పట్లుగల; తల్పములను = మంచములును; = సురతరు = కల్పవృక్షములతో {సురతరువు - దేవతల చెట్టు, కల్పవృక్షము}; శోభిత = శోభిల్లుతున్న; శుక = చిలుకలు; పిక = నెమళ్ళు; మిధునా = జంటలు; ఆళి = తుమ్మెదల; గాన = గానములతో; విభాసిత = ప్రకాశిస్తున్న; ఉద్యానములను = ఉద్యానవనములును; = సు = మంచి; మహిత = గొప్ప; వైడూర్య = వైడూర్యముల; సోపాన = మెట్లుగల; విమల = నిర్మలముగ; శోభిత = శోభిస్తున్న; జల = నీటితో; పూర్ణ = నిండిన; వాపీ = నడబావుల, కోనేర్ల; చయముల = సమూహముల.
వికచ = వికసించిన; కహ్లార = తెల్లకలువ, తేలిక ఎఱుపు, తేలిక తెలుపు కలసినదియు, మిక్కలి సువాసనలు కలదియు అగు సౌగంధికము, వ్యు. కే- జలే, హ్లాదతే- క+హ్లాద+అచ్- వృషోచరాదిత్వాత్ దకారరస్యరకాలః, కృ.ప్ర., నీటిలో వికసించునది, శబ్దరత్నాకరము; దరత్ = అరవిచ్చిన; అరవింద = కమలములు, తామర పువ్వు, పద్మము, ఇందు రకములు నల్ల కలువ, రక్త కమలము, ఎఱ్ఱ కలువ, వ్యు. అరాకారాణి పత్రాణి విందతి - అరం = శీఘ్రం లిప్సాం విందతి వా-అర + వింద్‌ + శః (కృ.ప్ర.) బండికంటియాకులవంటి రేకులుకలది (లేక) శీఘ్రముగా మక్కువ కలిగించునది. ఆంధ్ర శబ్దరత్నాకరము, మన్మథబాణములు అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము. అయిదింటిలో ఒకటి; కైరవ = తెల్లకలువలతో, వ్యు. కేరవః- హంసః, కేరవస్య ప్రియమ్- కేరవ+ అణ్, త.ప్ర., హంసకు ప్రియమైనది, చంద్రోదయముతో వికసించును, కైరవి- చంద్రుడు, వెన్నెల, వ్యు. కైరవం ప్రకాశ్యత్వేన అస్తి అస్య, కైరవ+ఇని, త.ప్ర., కైరవములను ప్రకాశింపజేయునది; ప్రదీపిత = విరాజిల్లుతున్న; బక = కొంగ; చక్రవాక = చక్రవాకములు; రాజహంస = రాయంచలు; సారస = బెగ్గరు పక్షలు; కారండవ = కన్నెలేడి (నీటికాకి) పక్షులు; ఆది = మొదలగు; జల = నీటి పక్షుల; నినద = అరుపులతో; అభిరామ = మనోహరంబగుచున్న; పద్మాకరముల = సరస్సుల.

భావము:

ధ్రువుడు నగరంలోకి ప్రవేశించాడు. అక్కడి మేడలు పచ్చలు తాపిన బంగారు గోడలతోను, మణిఖచితాలైన గవాక్షాలతోను మెరిసిపోతున్నవి. పట్టెమంచాల పరుపులపై పాలనురుగువలె తెల్లనైన బంగారు జరీ అంచుల దుప్పట్లు పరచబడి ఉన్నాయి. ఉద్యానవనాలు కల్పవృక్షాలతో నిండి చిలుకలు, కోయిలలు, తుమ్మెదల జంటలు పాడే పాటలతో మారుమ్రోగుతున్నాయి. దిగుడు బావులు వైడూర్యాలతో కట్టిన మెట్లతో నిర్మలమైన జలంతో నిండి ప్రకాశిస్తున్నాయి. వికసించిన కలువలతో, కమలాలతో విరాజుల్లుతూ కొక్కెరలు, జక్కవలు, రాయంచలు, బెగ్గురు పక్షులు, కన్నెలేళ్ళు మొదలైన నీటి పక్షుల కలకల ధ్వనులతో అక్కడి దొరువులు, చెరువులు అలరారుతున్నాయి.