పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-288-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు యోగనిద్రా పరవశుండ వయ్యును జీవులకంటె నత్యంత విలక్షణుండ వై యుండుదు; వది యెట్లనిన బుద్ధ్యవస్థాభేదంబున నఖండితం బయిన స్వశక్తిం జేసి చూచు లోకపాలన నిమిత్తంబు యజ్ఞాధిష్ఠాతవు గావున నీవు నిత్యముక్తుండవును, బరిశుద్ధుండవును, సర్వజ్ఞుండవును, నాత్మవును, గూటస్థుండవును, నాదిపురుషుండవును, భగవంతుండవును, గుణత్రయాధీశ్వరుండవును నై వర్తింతువు; భాగ్యహీనుండైన జీవుని యందు నీ గుణంబులు గలుగవు; ఏ సర్వేశ్వరునం దేమి విరుద్ధగతులై వివిధ శక్తి యుక్తంబు లైన యవిద్యాదు లానుపూర్వ్యంబునం జేసి ప్రలీనంబు లగుచుం; డట్టి విశ్వకారణంబు నేకంబు ననంతంబు నాద్యంబు నానందమాత్రంబు నవికారంబు నగు బ్రహ్మంబునకు నమస్కరించెద; మఱియు దేవా! నీవ సర్వవిధఫలం బని చింతించు నిష్కాము లయినవారికి రాజ్యాదికామితంబులలోనఁ బరమార్థం బయిన ఫలంబు సర్వార్థరూపుండవైన భవదీయ పాద పద్మ సేవనంబ; నిట్లు నిశ్చితంబ యైనను సకాములయిన దీనులను గోవు వత్సంబును స్తన్యపానంబు చేయించుచు, వృకాది భయంబు వలన రక్షించు చందంబునం గామప్రదుండవై సంసార భయంబు వలన బాపుదు;” వని యిట్లు సత్యసంకల్పుండును, సుజ్ఞానియు నయిన ధ్రువునిచేత వినుతింపంబడి భృత్యానురక్తుం డైన భగవంతుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె.

టీకా:

అట్లు = ఆ విధముగ; యోగనిద్రా = యోగనిద్ర యందు; పరవశుండవు = మైమరచి ఉన్నవాడవు; అయ్యును = అయినప్పటికిని; జీవుల = జీవులు; కంటెన్ = కంటెను; అత్యంత = మిక్కిలి; విలక్షణుండవు = వేరైన లక్షణములు కలవాడవు; ఐ = అయ్యి; ఉండుదువు = ఉంటావు; అది = అది; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అనగా; బుద్ధి = బుద్ధి యొక్క; అవస్థా = అవస్థలలోని; భేదంబునన్ = భేదము వలన; అఖండితంబు = ఎడతెగనిది; ఐన = అయిన; స్వ = స్వంత; శక్తిన్ = శక్తి; చేసి = వలన; చూచు = చూచెడి; లోక = లోకములను; పాలన = పాలించెడి; నిమిత్తంబున్ = కొరకు; యజ్ఞ = యజ్ఞమునకు; అధిష్ఠాతవు = అధిపతిస్థానము వహించినవాడవు; కావునన్ = కనుక; నీవు = నీవు; నిత్య = శాశ్వతముగ; ముక్తుండవును = ముక్తికలవాడవు; పరిశుద్ధుండవును = మిక్కిలి శుద్ధమైనవాడవు; సర్వజ్ఞుండవును = సర్వమును తెలిసినవాడవు; ఆత్మవు = ఆత్మవు; కూటస్థుండవును = దేహములందుండువాడవు; ఆదిపురుషుండవును = ఆదిపురుషుడవు; భగవంతుడవును = మహామహిమాన్వితుడవు; గుణత్రయాధీశ్వరుండవును = త్రిగుణములకు అధిపతివి; ఐ = అయ్యి; వర్తింతువు = ప్రవర్తింతువు; భాగ్యహీనుండు = భాగ్యహీనుడు; ఐన = అయిన; జీవుని = జీవుని; అందున్ = లో; ఈ = ఈ; గుణంబులు = లక్షణములు; కలుగవు = ఉండవు; ఏ = ఏ; సర్వేశ్వరున్ = భగవంతుని; అందేమి = అందులోనైతే; విరుద్ధ = వ్యతిరిక్త; గతులు = గమనములు కలవి; ఐ = అయ్యి; వివిధ = రకరకముల; శక్తిన్ = సామర్థ్యములు; యుక్తంబుల్ = కూడినవి; ఐన = అయిన; అవిద్యా = అవిద్య; ఆదులు = మొదలైనవి; అనుపూర్వ్యంబు = క్రమబద్దము; చేసి = అనుసరించి; ప్రలీనంబులున్ = లయములు; అగుచుండు = అవుతుండును; అట్టి = అటువంటి; విశ్వ = విశ్వము పుట్టుటకు; కారణంబును = కారణమును; అనంతంబును = అంతములేనిది; ఆద్యంబున్ = సృష్టికి ఆది అయినది; ఆనందమాత్రంబున్ = ఆనందము ఒక్కటే ఐనది; అవికారంబున్ = మార్పులు లేనిది; అగు = అయిన; బ్రహ్మంబున్ = బ్రహ్మమున; కున్ = కు; నమస్కరించెదన్ = నమస్కరించెదను; మఱియు = ఇంకను; దేవా = దేవుడ; నీవ = నీవె; సర్వవిధ = అన్నిరకముల; ఫలంబున్ = ఫలితములును; అని = అని; చింతించు = ధ్యానించెడి; నిష్కాములు = కోరికలు లేనివారు; అయిన = అయిన; వారి = వారి; కిన్ = కి; రాజ్య = రాజ్యము; ఆది = మొదలగు; కామితంబుల = కోరదగినవాటి; లోనన్ = లో; పరమ = అత్యుత్తమ; అర్థంబున్ = ప్రయోజనములు; అయిన = అయిన; ఫలంబున్ = ఫలితము; సర్వ = సమస్తమైన; అర్థ = ప్రయోజనంబుల; రూపుండవు = స్వరూపము యైనవాడవు; ఐన = అయిన; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; పద్మ = పద్మముల; సేవనంబ = భజియించుటయె; ఇట్లు = ఈ విధముగ; నిశ్చితంబ = నిశ్చయింపబడినదే; ఐనను = అయినప్పటికిని; సకాములు = కోరికలు కలవారు; అయిన = అయిన; దీనులను = దీనులను; గోవు = ఆవు; వత్సంబును = దూడను; స్తన్య = పాలు; పానంబున్ = తాగించుట; చేయించుచు = చేయిస్తూ; వృక = తోడేలు; ఆది = మొదలగు వాటి; భయంబున్ = భయము; వలన = నుండి; రక్షించు = కాపాడెడి; చందంబునన్ = వలె; కామ = కోరినవి; ప్రదుండవు = ఇచ్చువాడవు; ఐ = అయ్యి; సంసార = సంసార మందలి; భయంబున్ = భయము; వలనను = నుండి; పాపుదువు = పోగొట్టెదవు; అని = అని; ఇట్లు = ఈ విధముగ; సత్యసంకల్పుండును = గట్టి సంకల్పము కలవాడు; సుజ్ఞానియు = మంచి జ్ఞానము కలవాడు; అయిన = అయిన; ధ్రువుని = ధ్రువుని; చేతన్ = చేత; వినుతింపంబడి = స్తుతింపబడి; భృత్యు = సేవకుని ఎడల; అనురక్తుండు = ప్రీతి కలవాడు; ఐన = అయిన; భగవంతుండు = హరి; సంతుష్ట = సంతుష్టి చెందిన; అంతరంగుండు = హృదయము కలవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ విధంగా యోగనిద్రలో మైమరచి ఉన్నప్పటికీ నీవు జీవుల కంటె మిక్కిలి విలక్షణంగా ఉంటావు. అవస్థా భేదాన్ని పొందిన బుద్ధితో, చెక్కు చెదరని దృష్టితో జగత్తును రక్షించటానికి విష్ణురూపాన్ని గైకొంటావు. నీవు నిత్యముక్తుడవు; పరిశుద్ధుడవు; సర్వజ్ఞుడవు; ఆత్మవు; కూటస్థుడవు; ఆదిపురుషుడవు; భగవంతుడవు; మూడు గుణాలకు అధిపతివి. జీవుడు భాగ్యహీనుడు. అతనియందు నీ గుణాలు ఉండవు. ఏ సర్వేశ్వరుని యందైతే విరుద్ధగమనం కలిగి వివిధ శక్తులతో కూడిన అవిద్యాదులు ఒకదాని వెంట ఒకటి విలీనం అవుతాయో, అటువంటి జగత్కారణమూ, అద్వితీయమూ, అనంతమూ, ఆద్యమూ, ఆనందమాత్రమూ, అవికారమూ అయిన పరబ్రహ్మవు నీవు. నీకు నమస్కారం. దేవా! నిష్కాములైనవారు నిన్నే సర్వతోముఖ ఫలంగా భావిస్తారు. వారికి రాజ్యం మొదలైన వాంఛలలో పరమార్థమైన ఫలం సర్వాంతర్యామివైన నీ పవిత్ర పాదసేవనమే. ఇది నిశ్చయం. అయినప్పటికీ ఆవు తన దూడకు చన్నిస్తూ తోడేళ్ళు మొదలైన క్రూర మృగాల బారినుండి రక్షించే విధంగా సకాములైనవారి కోరికలను తీరుస్తూనే సంసార భయాలను తొలగిస్తావు.” అని ఈ విధంగా సత్సంకల్పుడు, సుజ్ఞాని అయిన ధ్రువుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు భృత్యులపై అత్యంత ప్రేమగల భగవంతుడు మనస్సులో తృప్తిపడి ఇలా అన్నాడు.