పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-280-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దండప్రణామంబు లాచరించి కృతాంజలి యై స్తోత్రంబు చేయ నిశ్చయించియు స్తుతిక్రియాకరణ సమర్థుండుఁ గాక యున్న ధ్రువునకును సమస్త భూతంబులకు నంతర్యామి యైన యీశ్వరుం డాతని తలంపెఱింగి వేదమయం బయిన తన శంఖంబు చేత నబ్బాలుని కపోలతలం బంటిన జీవేశ్వర నిర్ణయజ్ఞుండును, భక్తిభావ నిష్ఠుండును నగు ధ్రువుండు నిఖిలలోక విఖ్యాత కీర్తిగల యీశ్వరుని భగవత్ప్రతిపాదితంబు లగుచు వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్తుతియించె “దేవా! నిఖిలశక్తి ధరుండవు నంతఃప్రవిష్టుండవు నైన నీవు లీనంబు లైన మదీయ వాక్యంబులం బ్రాణేంద్రియంబులం గరచరణ శ్రవణత్వ గాదులను జిచ్ఛక్తిచేఁ గృపంజేసి జీవింపం జేసిన భగవంతుం డవును, బరమపురుషుండవును నైన నీకు నమస్కరింతు; నీ వొక్కరుండవయ్యు మహదాద్యంబైన యీ యశేష విశ్వంబు మాయాఖ్యం బయిన యా త్మీయశక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబు లందు వసించుచుఁ దత్తద్దేవతారూపంబులచే నానా ప్రకారంబుల దారువు లందున్న వహ్ని చందంబునం బ్రకాశింతువు; అదియునుం గాక.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; దండప్రణామంబులు = సాష్టాంగనమస్కారములు; ఆచరించి = చేసి; కృత = చేసిన; అంజలి = నమస్కారము కలవాడు; ఐ = అయ్యి; స్తోత్రంబు = స్తోత్రము; చేయ = చేయవలెనని; నిశ్చయించియు = సంకల్పించుకొని; స్తుతి = స్తోత్రము; క్రియా = చేయుటకు; కరణ = చేసెడి; సమర్థుండు = సమర్థత కలవాడు; కాక = కాకుండగ; ఉన్న = ఉన్నట్టి; ధ్రువున్ = ధ్రువుని; కున్ = కి; సమస్త = సమస్తమైన; భూతంబుల్ = జీవుల; కున్ = కి; అంతర్యామి = లోనుండువాడు; ఐన = అయిన; ఈశ్వరుండు = హరి; అతని = అతని; తలంపున్ = ఊహను; ఎఱింగి = తెలిసి; వేద = వేదములతో; మయంబున్ = నిండినది; అయిన = అయినట్టి; తన = తన; శంఖంబు = శంఖము; చేతన్ = తోటి; ఆ = ఆ; బాలునిన్ = పిల్లవాని; కపోల = చెక్కిలి; తలంబున్ = ప్రదేశమును; అంటిన = తాకిన; జీవ = జీవుని; ఈశ్వర = ఈశ్వరుని అనెడి; నిర్ణయజ్ఞుండును = నిర్ణయించు జ్ఞానము కలవాడు; భక్తిభావ = భక్తిభావమునందు; నిష్ఠుండును = నిష్ఠకలవాడును; అగు = అయిన; ధ్రువుండు = ధ్రువుడు; నిఖిల = సమస్తమైన; లోక = లోకములందు; విఖ్యాతి = ప్రసిద్ధమైన; కీర్తి = కీర్తి; కల = కలిగిన; ఈశ్వరుని = హరిని; భగవత్ = భగవంతునిగ; ప్రతిపాదితంబులు = నిర్ణయించెడివి; అగుచున్ = అవుతూ; వేద = వేదముల; ఆత్మకంబులు = స్వరూపంబులు; ఐన = అయిన; తన = తన; వాక్కులన్ = పలుకులతో; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించె = స్తుతియించెను; దేవా = భగవంతుడా; నిఖిల = సమస్తమైన; శక్తి = సామర్థ్యములను; ధరుండవు = ధరించినవాడవు; అంతః = లోపల; ప్రవిష్టుండవు = ప్రవేశించినవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; లీనంబులు = లీనమైపోయినవి; ఐన = అయిన; మదీయ = నా యొక్క; వాక్యంబులన్ = మాటను; ప్రాణ = ప్రాణములను; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; కర = చేతులు; చరణ = కాళ్ళు; శ్రవణ = చెవులు; త్వక్ = చర్మము; ఆదులనున్ = మొదలగువాటిని; చిత్ = చేతన; శక్తి = శక్తి; చేన్ = చేత; కృపంజేసి = దయచేసి; జీవింపన్ = జీవించునట్లు; చేసిన = చేసిన; భగవంతుండవును = మహా మహిమాన్వితుండవును {భగవంతుండు – మహా మహిమాన్వితుడు}; పరమపురుషుండవును = పరమాత్మవవును {పరమపురుషుడు - సర్వాతీతమై సకల పురముల (దేహముల)లోను ఉండువాడు, పరమాత్మ}; ఐన = అయిన; నీకున్ = నీకు; నమస్కరింతు = నమస్కరించెదను; నీవు = నీవు; ఒక్కరుండవు = ఒకడివే; అయ్యు = అయి యుండియు; మహదాద్యంబు = మహదాదులతో కూడినది; ఐన = అయిన; ఈ = ఈ; అశేష = అనంతమైన; విశ్వంబున్ = విశ్వమును; మాయా = మాయ అనెడి; ఆఖ్యంబు = పేరుకలది; అయిన = అయిన; ఆత్మీయ = ఆత్మ యొక్క; శక్తిన్ = శక్తి; చేతన్ = చేత; కల్పించి = సృష్టించి; అందున్ = వాటిలో; ప్రవేశించి = చేరి; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; అందున్ = లో; వసించుచున్ = నివసిస్తూ; తత్తత్ = ఆయా; దేవతా = దేవతల; రూపంబులన్ = రూపముల; చేన్ = చేత; నానా = వివిధ; ప్రకారంబులన్ = రకములుగ; దారువులు =కొయ్యలు; అందున్ = లోపల; ఉన్న = ఉండెడి; వహ్ని = అగ్ని; చందంబునన్ = వలె; ప్రకాశింతువు = ప్రకాశిస్తుంటావు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

ఈ విధంగా సాష్టాండ దండ ప్రణామం చేసి, చేతులు జోడించి శ్రీహరిని స్తుతించాలనుకొని, స్తుతి విధానం తెలియక మిన్నకున్నాడు ధ్రువుడు. సర్వాంతర్యామియైన భగవంతుడు ధ్రువుని తలంపు గ్రహించి తన చేతిలో ఉన్న వేదమయమైన పాంచజన్య శంఖంతో ఆ బాలుని చెక్కిలిని స్పృశించాడు. ఆ ప్రభావం వల్ల జీవేశ్వర నిర్ణయాన్ని గుర్తించిన ధ్రువుడు భక్తిభావంతో భగవంతుడు ప్రసాదించిన వేదవాక్కులతో విశ్వవిఖ్యాతుడైన ఈశ్వరుణ్ణి ఇలా స్తుతించాడు. “దేవా! నీవు అఖిల శక్తిసంపన్నుడవు. అంతర్యామివి. స్తంభించిపోయిన నా వాక్కులను, ప్రాణాలను, నా కరచరణాది సకలేంద్రియాలను దయతో జ్ఞానాత్మకమైన నీ శక్తివల్ల తిరిగి బ్రతికించిన భగవంతుడవు. పరమపురుషుడవైన నీకు నమస్కారం. నీవు ఒక్కడవే అయినప్పటికీ నీ మాయాశక్తిచేత ఈ సమస్త విశ్వాన్ని సృజిస్తావు. ఆ విశ్వంలో ప్రవేశిస్తావు. ఇంద్రియాలతో నివసిస్తావు. అగ్ని ఒక్కటే అయినా ఎన్నో దారువులలో ప్రకాశించే విధంగా నీవు ఆయా దేవతారూపాలలో ప్రవేశించి ప్రకాశిస్తావు.