పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-273-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తఁడు ననన్యదృష్టిని జరాచర దేహిశరీర ధారణా
స్థితి గల యీశునందుఁ దన జీవితమున్ ఘటియింపఁ జేసి యే
తఁ గనఁ దన్నిరోధమునఁ గైకొని కంపము నొందె నీశ్వరుం;
తఁడు చలింప నిజ్జగము న్నియుఁ జంచల మయ్యె భూవరా!

టీకా:

అతడు = అతడు; అనన్య = అనితరమైన; దృష్టిని = దృష్టితో; చర = చలనము కల; అచర = చలనము లేని; దేహి = జీవుల; శరీర = శరీరములందు; ధారణా = ధారణ యొక్క; స్థితి = స్థితిలో; కల = ఉన్న; ఈశున్ = ఈశ్వరుని; అందున్ = అందు; తన = తన యొక్క; జీవితమున్ = ప్రాణమును; ఘటియింపన్ = కూర్చుట; చేసి = వలన; ఏకతన్ = ఐక్యమును; కనన్ = పొందగ; తత్ = దాని; నిరోధమునన్ = నిరోధమును; కైకొని = గ్రహించి; కంపమున్ = కంపించుటను; ఒందెన్ = పొందెను; ఈశ్వరుండు = ఈశ్వరుడు; అతడు = అతడు; చలింపన్ = చలించగ; ఈ = ఈ; జగములున్ = లోకములు; అన్నియున్ = సర్వము; చంచలము = మిక్కిలి చలించునవి; అయ్యెన్ = అయినవి; భూవరా = రాజా.

భావము:

ధ్రువుడు ఏకాగ్రదృష్టితో చరాచర విశ్వానికి అధీశ్వరుడైన భగవంతుని ధ్యానించాడు. తదేక చిత్తంతో తన ప్రాణవాయువును నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేసాడు. ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే అఖిలలోకాలూ ప్రకంపించాయి.