పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువుండు తపంబు చేయుట

  •  
  •  
  •  

4-270-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లు గని డాయంజని యమునానదిం గృతస్నానుండై నియతుండును, సమాహిత చిత్తుండును నై సర్వేశ్వరుని ధ్యానంబు చేయుచుం బ్రతిత్రిరాత్రాంతంబునఁ గృత కపిత్థ బదరీఫల పారణుం డగుచు దేహ స్థితి ననుసరించి యిటుల నొక్కమాసంబు హరిం బూజించి, యంత నుండి యాఱేసి దినంబుల కొక్కపరి కృతజీర్ణ తృణ పర్ణాహారుం డగుచు, రెండవ మాసంబున విష్ణుసమారాధనంబు చేసి, యంత నుండి నవరాత్రంబుల కొకమా ఱుదకభక్షణంబు చేయుచు, మూఁడవ మాసంబున మాధవు నర్చించి, యంతనుండి ద్వాదశ దినంబుల కొకమాఱు వాయుభక్షణుం డగుచు, జితశ్వాసుండై నాలవ మాసంబునం, బుండరీకాక్షుని భజియించి, యంతనుండి మనంబున నలయక నిరుచ్ఛ్వాసుండై యేకపదంబున నిలిచి, పరమాత్మఁ జింతించుచు, నచేతనంబైన స్థాణువుంబోలె నైదవ మాసంబును జరిపె; నంత.

టీకా:

అట్లు = ఆ విధముగ; డాయన్ = దగ్గరకు; చని = వెళ్ళి; యమునా = యమున అనెడి; నదిన్ = నదిలో; కృత = చేసిన; స్నానుండు = స్నానము చేసినవాడు; ఐ = అయ్యి; నియతుండును = నియమములను పూనినవాడు; సమ = చక్కగా; ఆహిత = కూడగట్టుకొనిన; చిత్తుండును = మనసు కలవాడు; ఐ = అయ్యి; సర్వేశ్వరుని = విష్ణుమూర్తిని; ధ్యానంబున్ = ధ్యానము; చేయుచున్ = చేస్తూ; ప్రతి = ప్రతి; త్రి = మూడు (3); రాత్రంబునన్ = రాత్రుల కొకమారు; కృత = చేసిన; కపిత్థ = వెలగ; బదరీ = రేగు; ఫల = పండ్లను; పారణుండు = భోజనము కలవాడు; అగుచున్ = అవుతూ; దేహ = శరీర; స్థితిని = స్థితిని; అనుసరించి = ప్రకారము; ఇటుల = ఈ విధముగ; ఒక్క = ఒక; మాసంబు = నెల; హరిన్ = విష్ణుని; పూజించి = పూజించి; అంతన్ = అప్పటి; నుండి = నుండి; ఆఱేసి = ఆరు చొప్పున; దినంబుల = దినముల; కున్ = కి; ఒక్క = ఒక; పరి = మారు; కృత = చేసిన; జీర్ణ = ఎండిన; తృణ = గడ్డి; పర్ణ = ఆకులు; ఆహారుండు = భోజనము కలవాడు; అగుచున్ = అవుతూ; రెండవ = రెండో (2); మాసంబునన్ = నెలలో; విష్ణు = విష్ణుమూర్తిని; సమ = చక్కగా; ఆరాధనంబు = పూజ; చేసి = చేసి; అంత = అప్పటి; నుండి = నుండి; నవ = తొమ్మిది (9); రాత్రంబుల = రాత్రుల; కున్ = కి; ఒక = ఒక; మాఱున్ = మారు; ఉదక = నీటిని; భక్షణంబున్ = తీసుకొనుట; చేయుచున్ = చేస్తూ; మూడవ = మూడో (3); మాసంబునన్ = నెలలో; మాధవున్ = విష్ణుమూర్తిని; అర్చించి = పూజించి; అంత = అప్పటి; నుండి = నుండి; ద్వాదశ = పన్నెండు (12); దినంబుల = దినముల; కున్ = కి; ఒక = ఒక; మాఱున్ = మారు; వాయు = వాయువును; భక్షణుండు = తినువాడు; అగుచున్ = అవుతూ; జిత = జయించిన; శ్వాసుండు = శ్వాస కలవాడు; నాలవ = నాలుగో (4); మాసంబునన్ = నెలలో; పుండరీకాక్షునిన్ = విష్ణుమూర్తిని; భజియించి = పూజించి; అంత = అప్పటి; నుండి = నుండి; మనంబునన్ = మనసులో; అలయక = అలసిపోకుండగ; నిరుచ్ఛ్వాసుండు = ఊపిరివిడుచుట లేనివాడు; ఐ = అయ్యి; ఏక = ఒంటి; పదంబునన్ = కాలుమీద; నిలిచి = నిలబడి; పరమాత్మన్ = పరమాత్మను; చింతించుచున్ = ధ్యానిస్తూ; అచేతనంబున్ = కదలికలులేనిది; ఐన = అయిన; స్థాణువున్ = రాయి; పోలెన్ = వలె; ఐదవ = అయిదవ (5); మాసంబునున్ = నెలను; జరిపెన్ = గడిపెను; అంత = అంతట.

భావము:

ధ్రువుడు మధువనంలో ప్రవేశించి, యమునా నదిలో స్నానం చేసాడు. నియమంతో ఏకాగ్రచిత్తంతో భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు. శరీరస్థితినిబట్టి మూడు దినాల కొకసారి వెలగపండ్లను, రేగుపండ్లను ఆరగిస్తూ ఒక్క నెల శ్రీహరిని అర్చిస్తూ గడిపాడు. తరువాత ఆరు దినాలకు ఒకసారి జీర్ణతృణపర్ణాలను తింటూ విష్ణుపూజలో రెండవ నెల గడిపాడు. తొమ్మిది దినాలకు ఒకమారు నీటిని త్రాగి మాధవసమారాధనలో మూడవ నెల గడిపాడు. అనంతరం పన్నెండు దినాల కొకసారి గాలిని ఆరగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నిరోధించి నారాయణ సేవలో నాలుగవ నెల గడిపాడు. తరువాత ఒంటికాలిపై నిలిచి పరమాత్ముణ్ణి భజిస్తూ ప్రాణం లేని మ్రోడులాగా నిశ్చలంగా ఐదవ నెల గడిపాడు.