పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదుర మైత్రేయ సంవాదంబు

  •  
  •  
  •  

3-196-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విదురుండు మైత్రేయు నడిగిన నతం డతనిం గని యతి మృదు మధురవచనరచనుండై యిట్లనియె "అనఘా! కృష్ణకథాశ్రవణ తత్పరుండవై నీవు నన్నడిగితివి గావున భద్రంబయ్యె; నీవు భగవద్భక్తుండవు గావున హరికథాసక్తుండ వగుట విచిత్రంబుగాదు; అదియునుంగాక మాండవ్యుశాపంబున సాత్యవతేయువలన భాతృక్షేత్రంబున శూద్రయోనింబుట్టినట్టి ప్రజాసంయమనుండవగు యముండవు పరమ జ్ఞానసంపన్నుండవు నారాయణునకుం బ్రియతముండవు గావునఁ గృష్ణుండు నిర్యాణకాలంబునం దన సన్నిధికిం జనిన నన్ను డాయంజీరి విజ్ఞానం బెల్ల నుపదేశించి నీకు నెఱింగింపు మని యానతిచ్చుటంజేసి యవశ్యంబును నీకు నెఱింగింతు దత్తావధానుండవై వినుము.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; విదురుండు = విదురుడు; మైత్రేయున్ = మైత్రేయుని; అడిగినన్ = అడుగగా; అతండు = అతడు; అతనిన్ = అతనిని; కని = చూసి; అతి = మిక్కిలి; మృదు = మృదువైన; మధుర = మధురమైన; వచన = మాటలతో; రచనుండు = పలుకువాడు; ఐ = అయి; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = అనియెను; అనఘా = పుణ్యాత్ముడా; కృష్ణ = కృష్ణుని; కథా = కథల; శ్రవణ = వినుటయందు; తత్పరుండవు = లగ్నమైనవాడవు; ఐ = అయి; నీవు = నీవు; నన్ను = నన్ను; అడిగితివి = అడిగావు; కావునన్ = కనుక; భద్రంబు = మంచిది; అయ్యెన్ = అయ్యింది; నీవు = నీవు; భగవత్ = భగవంతుని యొక్క; భక్తుండవు = భక్తుడవు; కావునన్ = కనుక; హరి = కృష్ణుని {హరి - సంచిత పాపకర్మబంధములను హరించువాడు, విష్ణువు}; కథా = కథల యందు; ఆసక్తుండవు = కుతూహలము కలవాడు; అగుటన్ = అవుట; విచిత్రంబు = విచిత్రము; కాదు = కాదు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; మాండవ్యున్ = మాండవ్యుని {మాండవ్యుడు - ఒక ఋషి ఇతను తపము చేసికొనుచుండగా రాజు దొంగయని వానింబట్టి కొరతవేయించెను ఆ ముని వెళ్ళి యమునితో నిష్కారణముగా నన్నిట్లు శిక్షించితివి కనుక శూద్రుడవై భూమిమీద పుట్టుము అని శపించెను ఆ యముడే విదురుడుగా పుట్టెను}; శాపంబునన్ = శాపమువలన; సాత్యవతేయు = వ్యాసుని {సాత్యవతేయుడు - సత్యవతి పుత్రుడు, వేదవ్యాసుడు}; వలన = వలన; భాత్రు = సోదరుని; క్షేత్రంబునన్ = భార్య యందు; శూద్ర = శూద్రస్త్రీ యొక్క; యోనిన్ = గర్భమున; పుట్టిన = జన్మించిన; అట్టి = అటువంటి; ప్రజా = ప్రజలను; సంయమనుండవు = సంయమనం కలవాడవు; అగు = అయిన; యముండవు = యముడవు; పరమ = అత్యుత్తమ; జ్ఞాన = జ్ఞానము; సంపన్నుడవు = సమృద్ధిగా కలవాడవు; నారాయణున = కృష్ణుని {నారాయణుడు - నీటి (నారములు)యందు వసించువాడు, విష్ణువు}; కున్ = కి; ప్రియతముండవు = మిక్కిలి ప్రియమైన వాడవు {ప్రియుడు - ప్రియతరుడు - ప్రియతముడు}; కావునన్ = కనుకనే; కృష్ణుండు = కృష్ణుడు; నిర్యాణ = నిర్యాణ; కాలంబునన్ = సమయమున; తన = తన; సన్నిధి = దగ్గర; కిన్ = కి; చనిన = వెళ్ళిన; నన్నున్ = నన్ను; డాయన్ = దగ్గరకు; చీరి = పిలిచి; విజ్ఞానమున్ = విజ్ఞానమును; ఎల్లన్ = అంతయు; ఉపదేశించి = చెప్పి; నీకున్ = నీకు; ఎఱింగింపుము = తెలుపుము; అని = అని; ఆనతిచ్చుటన్ = ఆజ్ఞాపించుట; చేసి = వలన; అవశ్యంబునున్ = రూఢిగా; నీకున్ = నీకు; ఎఱింగింతున్ = తెలిపెదను; దత్త = ధరించిన; అవధానుండవు = శ్రద్ధకలవాడవు; ఐ = అయి; వినుము = విను.

భావము:

“ఇలా విదురుడు మైత్రేయుణ్ణి అడిగాడు. అప్పుడు ఆ మహర్షి విదురుణ్ణి చూచి మిక్కిలి మృదుమధుర వాక్యాలతో ఇలా అన్నాడు. “ఓ పుణ్యాత్ముడా వీనులవిందుగా విష్ణుకథలు వినాలన్న ఆసక్తితో నన్ను అడిగావు. మంచిది. నీవు భగవంతుని యందు భక్తి గలవాడవు. కాబట్టి హరి కథలపై నీకు ఆసక్తి ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాక నీవు సాక్షాత్తూ సమవర్తియై ప్రజలను శాసించే యముడవు. మాండవ్యమహాముని శాపంవల్ల వ్యాసభగవానునకు శూద్ర స్త్రీ కడుపున జన్మించావు. శ్రీమన్నారాయణుని ప్రేమకు పాత్రుడైనవాడివి. అందుకనే కృష్ణుడు తన అవసాన సమయంలో సమీపానికి వెళ్ళిన నన్ను చేరపిలిచి విజ్ఞానాన్నంతా బోధించాడు. దానిని నీకు చెప్పవలసిందిగా నన్ను ఆదేశించాడు. ఆయన ఆనతి ప్రకారం అదంతా నీకు తప్పకుండా చెబుతాను. ఏకాగ్రమైన మనస్సుతో ఆకర్ణించు.