పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి నిర్యాణంబు

  •  
  •  
  •  

3-1044-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానిత సౌరభప్రసవ మంజుల పక్వ ఫలప్రవాళ భా
రాత చూతపోత విటపాగ్ర నికేతన రాజకీర స
మ్మాని సుఖానులాప పరిమండిత కర్దమ తాపసాశ్రమో
ద్యా వనప్రదేశ కమలాకర తీర నికుంజ పుంజముల్.

టీకా:

మానిత = మంచి; సౌరభ = సువాసనలు కల; ప్రసవ = కలిగిస్తున్న; మంజుల = పొదరిళ్ళతోను; పక్వ = పండిన; ఫల = పండ్లయొక్క; ప్రవాళ = చిగుర్లుయొక్క; భారా = బరువుతో; నత = వంగిన; చూత = మామిడి; పోత = లేత; విటప = చెట్ల; అగ్ర = చిగుర్లు యందు; నికేతన = వసించుతున్న; రాజకీర = రామచిలుకలచే; సమ్మాని = చక్కని; సుఖ = సుఖకరమగ; అనులాప = పలుకులచే; పరిమండిత = చక్కగా అలంకరింప బడిన; కర్దమ = కర్దముడు అను; తాపస = తపసి యొక్క; ఆశ్రమ = ఆశ్రమము అందలి; ఉద్యానవన = ఉద్యానవనము యొక్క; ప్రదేశ = ప్రదేశ మందలి; కమలాకర = సరస్సుల {కమ లాకరము - కమలమలకు ఆకరము (వాసము), సరస్సు}; తీర = తీరమందలి; నికుంజ = పొదరిండ్ల; పుంజముల్ = సమూహములను.

భావము:

(ఆ ఉద్యానవనంలో) పరిమళాలు వెదజల్లే పూలగుత్తులతో, పండిన పండ్లతో, చెంగావి చిగుళ్ళతో, వంగిన కొమ్మలతో ఉన్న గున్నమామిళ్ళు కనువిందుగా ఉన్నాయి. ఆ మామిడి చెట్ల చిటారు కొమ్మలపై కూర్చున్న రామచిలుకలు వీనుల విందుగా పలుకుతున్నాయి. అక్కడి తామరకొలను చుట్టూ దట్టంగా అల్లుకున్న పొదరిండ్లు గోచరించాయి.