పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-1012-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి పురుషరూపంబు నొందిన జీవుండు నిరంతర స్త్రీసంగంబుచే విత్తాపత్య గృహాదిప్రదం బగు స్త్రీత్వంబు నొందు; నీ క్రమంబున నంగనా రూపుం డగు జీవుండు మన్మాయచేఁ బురుషరూపంబు నొంది ధనాదిప్రదుం డగు భర్తను నాత్మబంధకారణం బగు మృత్యువునుగ నెఱుంగ వలయు; మఱియు జీవోపాధిభూతం బగు లింగదేహంబుచే స్వావాస భూతలోకంబున నుండి లోకాంతరంబు నొందుచుం బ్రారబ్ద కర్మఫలంబుల ననుభవించుచు; మరలం గర్మాదులందాసక్తుఁ డగుచు మృగయుండు గాననంబున ననుకూల సుఖప్రదుం డైనను మృగంబునకు మృత్యు వగు చందంబున జీవుండు భూతేంద్రియ మనోమయం బైన దేహంబు గలిగి యుండు;యట్టి దేహనిరోధంబె మరణంబు; యావిర్భావంబె జన్మంబునుం; గాన సకల వస్తువిషయ జ్ఞానంబు గలుగుటకు జీవునకు సాధనంబు చక్షురింద్రయం బగు ద్రష్టదర్శనీయ యోగ్యతాప్రకారంబున జీవునకు జన్మమరణంబులు లేవు; గావున భయకార్పణ్యంబులు విడిచి సంభ్రమంబు మాని జీవప్రకారంబు జ్ఞానంబునం దెలిసి ధీరుండై ముక్తసంగుం డగుచు యోగ వైరాగ్యయుక్తం బైన సమ్యగ్జ్ఞానంబున మాయావిరచితం బైన లోకంబున దేహాదులం దాసక్తి మాని వర్తింప వలయు"నని చెప్పి; వెండియు నిట్లనియె.

టీకా:

అట్టి = అటువంటి; పురుష = పురుషుని; రూపంబున్ = రూపమున; పొందిన = చెందిన; జీవుండు = జీవుడు, దేహి; నిరంతర = ఎడతెగని; స్త్రీ = స్త్రీ; సంగంబున్ = సాంగత్యము; చేన్ = వలన; విత్తా = ధనము; అపత్య = సంతానము; గృహా = ఇళ్లు; ఆది = మొదలైన వానికి; ప్రదంబున్ = కలుగుటకు కారణము; అగు = అయిన; స్త్రీత్వంబున్ = స్త్రీగా జన్మమును; పొందున్ = పొందును; ఈ = ఈ; క్రమంబునన్ = విధముగనే; అంగనా = స్త్రీ; రూపుండు = రూపమున ఉన్నవాడు; అగు = అయిన; జీవుండు = జీవుడు, దేహి; మత్ = నా యొక్క; మాయ = మాయ; చేన్ = చేత; పురుష = పురుషునిగా; రూపంబున్ = రూపమును; పొంది = పొంది; ధన = ధనము; ఆది = మొదలైనవి; ప్రదుండు = కలిగించువాడు; అగు = అయిన; భర్తను = భర్తను; ఆత్మ = తన; బంధ = బంధనములకు; కారణంబున్ = కారణము; అగు = అయిన; మృత్యువును = మరణము; కాన్ = అగునట్లు; ఎఱుంగ = తెలిసికొన; వలయున్ = వలసినది; మఱియున్ = ఇంకను; జీవ = జీవన; ఉపాధి = ఆధారము; భూతంబున్ = అయినది; అగు = అయిన; లింగదేహము = లింగదేహము; చేన్ = చేత; స్వ = తన యొక్క; ఆవాసభూతంబు = నివాసమైన; లోకంబునన్ = లోకములో; ఉండి = ఉండి; లోక = లోకము; అంతరంబున్ = వేరొకటిని; పొందుచున్ = పొందుతూ; ప్రారబ్ద = పురాకృత; కర్మ = కర్మముల; ఫలంబులన్ = ఫలితములను; అనుభవించుచున్ = అనుభవిస్తూ; మరలన్ = మళ్ళీ; కర్మ = కర్మములు; ఆదులు = మొదలైనవాటి; అందున్ = అందు; ఆసక్తుడు = ఆసక్తి కలవాడు; అగుచున్ = అవుతూ; మృగయుండు = వేటగాడు; కాననంబునన్ = అడవిలో; అనుకూల = అనుకూలమైన; సుఖ = సుఖములు; ప్రదుండు = అమర్చు వాడు; ఐనను = అయినప్పటికిని; మృగంబున్ = జంతువున; కున్ = కు; మృత్యువున్ = మృత్యువే; అగు = అయ్యెడి; చందంబునన్ = విధముగనే; జీవుండు = జీవుడు, దేహి; భూత = పంచభూతములు; ఇంద్రియ = ఇంద్రియములు; మనస్ = మనస్సులతో; మయంబున్ = కూడినది; ఐన = అయిన; దేహంబున్ = శరీరమును; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; దేహ = శరీరము యొక్క; నిరోధంబె = అడ్డగింపె; మరణంబున్ = మరణము; ఆవిర్భవంబె = ఏర్పడుటే; జన్మంబునున్ = పుట్టుకయును; కాన = కావున; సకల = సమస్తమైన; వస్తు = వస్తువులకు; విషయ = సంబంధించిన; జ్ఞానంబున్ = తెలివిని; కలుగుట = కలిగించుట; కున్ = కు; జీవున్ = జీవుని; కున్ = కి; సాధనంబు = సాధనము; చక్షురింద్రియంబు = కన్ను; అగున్ = అగును; ద్రష్ట = చూచువాడు; దర్శనీయ = చూడతగినది; యోగ్యత = సమత్వమును చూడగలుగుట; ప్రకారంబునన్ = విధములో; జీవున్ = జీవున; కున్ = కు; జన్మమరణంబులున్ = జననమరణములు; లేవు = లేవు; కావున = అందుచేత; భయ = భయములు; కార్పణ్యంబులున్ = దీనత్వములు; విడిచి = వదిలేసి; సంభ్రమంబున్ = కంగారుపడుటను; మాని = మానేసి; జీవ = జీవన; ప్రకారంబున్ = విధానమును; జ్ఞానంబున్ = జ్ఞానమును; తెలిసి = తెలిసికొని; ధీరుండు = ధైర్యము కలవాడు; ఐ = అయ్యి; ముక్త = విడిచిన; సంగుండు = తగులములు కలవాడు; అగుచున్ = అవుతూ; యోగ = యోగమును; వైరాగ్య = వైరాగ్యమును; యుక్తంబున్ = కూడినది; ఐన = అయిన; సమ్యగ్ఙ్ఢానంబునన్ = సరియగు జ్ఞానముతో; మాయా = మాయతోకూడి; విరచితంబున్ = సృష్టింపబడినది; ఐన = అయినట్టి; లోకంబునన్ = లోకములో; దేహ = శరీరము; ఆదులు = మొదలగు వానిపై; ఆసక్తి = అసక్తిని; మాని = వదిలేసి; వర్తింపన్ = ప్రవర్తింప; వలయున్ = వలసినది; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అటువంటి పురుషరూపాన్ని ధరించిన జీవుడు ఎడతెగని స్త్రీసాంగత్యంవల్ల భోగభాగ్యాలు, పిల్లలు, ఇల్లు మొదలైన వాటిపై ఆసక్తి పెంచుకొని వచ్చే జన్మలో స్త్రీగానే జన్మిస్తాడు. ఈ విధంగా స్త్రీత్వాన్ని పొందిన జీవుడు నా మాయవల్ల పురుషరూపాన్ని పొంది ధనాదులను ఇచ్చే భర్తను సంసారబంధనానికి కారణంగా తెలుసుకోవాలి. ఈ సంసారబంధమే మృత్యువు. జీవునకు ఆధారంగా లింగమయ దేహం నిలిచి ఉంటుంది. ఆ లింగమయదేహంతో తనకు నివాసమైన ఈ లోకంనుండి వేరు లోకాలను పొందుతూ పూర్వకర్మలయొక్క ఫలితాన్ని అనుభవిస్తూ, తిరిగి కర్మలపై ఆసక్తుడు అవుతూ ఉంటాడు. మనస్సుతో పంచభూతాలతో పంచేంద్రియాలతో ఏర్పడి సుఖ సాధనమైన దేహం క్రమంగా శుష్కించి నశిస్తుంది. అడవిలో వేటగాడు మృగాలకు గానాదులతో అనుకూలమైన సదుపాయాలు కూర్చేవాడైనా, అతడే మృగాలపాలిటికి మృత్యువుగా పరిణమిస్తాడు. అట్టి దేహాన్ని చాలించడమే మరణం. దానిని పొందడమే జననం. కనుక సకల వస్తువులకూ సంబంధించిన జ్ఞానాన్ని పొందడానికి జీవునకు సాధనం కన్ను. ద్రష్ట చూడదగిన దానిని చూడడం అనే యోగ్యత సంపాదించుకున్నప్పుడు జీవునకు పుట్టడం, గిట్టడం అనేవి ఉండవు. కాబట్టి మానవుడు పిరికితనాన్నీ, దైన్యభావాన్నీ వదలిపెట్టి, తొందర లేనివాడై, జీవుని స్వరూపాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకొని, ధైర్యం వహించి బంధనాలు లేనివాడై యోగ్యమైన వైరాగ్యంతో కూడిన చక్కని జ్ఞానాన్ని అలవరచుకోవాలి. మాయాకల్పితమైన ఈ లోకంలో దేహం మొదలైన వానిపై ఆసక్తి లేకుండా ఉండాలి” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.