పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-990-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ గుటుంబపోషణంబునఁ గుక్షింభరుం డగుచు నధర్మపరుం డై భూతద్రోహంబున నతిపాపుండై నిరయంబునుం బొంది నిజ ధనంబులు గోలుపడి మొఱవెట్టు నాపన్నుని చందంబునం బరస్పర సంబంధంబునఁ గల్పింపబడిన తమిస్రాంధతామిస్ర రౌరవాదు లగు నరకంబులం బడి తీవ్రంబు లయిన బహుయాతనల ననుభవించి క్షీణపాపుండై పునర్నరత్వంబునుం బొందు" నని చెప్పి వెండియు నిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; కుటుంబ = కుటుంబమును; పోషణంబునన్ = పోషించుటలో; కుక్షింభరుండు = కడుపుకోసమైనవాడు {కుక్షింభరుడు - పొట్టపోసుకొనుట మాత్రము తెలిసినవాడు}; అగుచున్ = అవుతూ; అధర్మ = అధర్మమునకు; పరుండు = చెందినవాడు; ఐ = అయ్యి; భూత = జీవులకు; ద్రోహంబునన్ = ద్రోహము చేయుటచే; అతి = మిక్కిలి; పాపుండు = పాపి; ఐ = అయ్యి; నిరయంబున్ = నరకమును; పొంది = పొంది; నిజ = తన; ధనంబులున్ = ధనములను; కోలుపడి = పోగొట్టుకొని; మొఱవెట్టున్ = మొత్తుకొనుచున్న; ఆపన్నుని = ఆపదచెందినవాని; చందంబునన్ = విధముగ; పరస్పర = ఒకదానికొకటి; సంబంధంబునన్ = సంబంధించునట్లు; కల్పింపబడిన = కలుపబడిన; తమిస్ర = చీకట్లు నరకము; అంధతామిస్ర = గుడ్డిచీకట్లు నరకము; రౌరవ = రురువులు అనబడు పురుగులచే తినిపించుట; ఆదులు = మొదలగునవి; అగు = అయిన; నరకంబులన్ = నరకములలో; పడి = పడి; తీవ్రంబులు = తీవ్రమైనవి; అయిన = అయినట్టి; బహు = అనేక; యాతనలన్ = బాధలను; అనుభవించి = అనుభవించి; క్షీణ = తగ్గిన; పాపుండు = పాపములుకలవాడు; ఐ = అయ్యి; పునర్ = మరల; నరత్వంబున్ = మానవుడు అగుటను; పొందును = పొందును; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

పాపాత్ముడు సంసార పోషణకై పడరాని పాట్లు పడుతూ, తన పొట్టను నింపుకొంటూ, అధర్మమార్గంలో నడుస్తూ, ప్రాణులను హింసిస్తూ మహాపాపం మూటకట్టుకొని యమలోకానికి పోయి అక్కడ తన సొమ్మును పోగొట్టుకొని మొరపెట్టుకునే దిక్కులేని దీనునివలె ఆక్రోశిస్తూ ఒకదాని వెంట ఒకటిగా తామిస్రం, అంధతామిస్రం, రౌరవం మొదలైన నరకాలలో పడి సహింపరాని పెక్కు బాధలను అనుభవిస్తూ, తన పాపాలన్నీ తరిగిపోయిన తరువాత మళ్ళీ మనుష్యజన్మను పొందుతాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.