పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సాంఖ్యయోగంబు

  •  
  •  
  •  

3-945-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మదిరాపానంబునం జేసి మత్తుం డగు వాఁడు దనకు బరిధానంబగు నంబరంబు మఱచి వర్తించు చందంబునఁ, దన శరీరంబు దైవాధీనం బని నశ్వరం బని తలంచి యాత్మతత్త్వనిష్ఠుండై యుపేక్షించు; అదియునుం గాక సమాధియోగంబునం జేసి సాక్షాత్కృతాత్మతత్త్వంబు గలవాడయి స్వాప్నికశరీరంబు చందంబున యావత్కర్మఫలానుభవ పర్యంతంబు పుత్ర దార సమేతం బగు ప్రపంచంబు ననుభవించి; యటమీదఁ బుత్ర దారాది సంబంధంబువలనం బాసి వర్తించు.

టీకా:

మదిరా = మద్యమును; పానంబున్ = తాగుట; చేసి = చేసి; మత్తుండు = మత్తెక్కినవాడు; అగు = అయిన; వాడు = వాడు; తన = తన; కున్ = కు; పరిధానంబు = ధరింపబడినది; అగు = అయినట్టి; అంబరంబున్ = బట్టను; మఱచి = మరిచిపోయి; వర్తించు = తిరుగు; చందంబునన్ = విధముగ; తన = తన యొక్క; శరీరంబున్ = దేహము; దైవ = దేవునికి; ఆధీనంబున్ = ఆధీనములో ఉన్నది; అని = అనియు; అశ్వరంబున్ = నశించునది; అని = అనియు; తలంచి = అనుకొని; ఆత్మతత్వ = ఆత్మతత్త్వము నందు; నిష్ఠుండు = నిష్ఠ కలవాడు; ఐ = అయ్యి; ఉపేక్షించున్ = అలక్ష్యము చేయును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; సమాధియోగంబునన్ = సమాధియోగము; చేసి = వలన; సాక్షాత్కృత = సాక్షాత్కరించిన; ఆత్మతత్త్వంబు = ఆత్మతత్త్వము; కల = కలిగిన; వాడు = వాడు; అయి = అయ్యి; స్వాప్నిక = స్వప్నమునకు చెందిన; శరీరంబు = దేహము; చందంబునన్ = వలె; యావత్ = సమస్తమైన; కర్మ = కర్మములు; ఫల = ఫలములను; అనుభవించు = అనుభవించుట; పర్యంతము = పూర్తగు వరకు; పుత్ర = సంతానము; దార = భార్యలతో; సమేతంబు = కూడినట్టిది; అగు = అయిన; ప్రపంచంబున్ = ప్రపంచమును; అనుభవించి = అనుభవించేసి; అటమీద = ఆపైన; పుత్ర = సంతానము; దార = భార్యలతో; ఆది = మొదలగు; సంబంధంబున్ = సంబంధములను; పాసి = విడిచి; వర్తించు = నడచును.

భావము:

మద్యపానం చేసి మైకంలో ఉన్న మనుష్యుడు పైబట్టను మరచిపోయి ప్రవర్తించిన విధంగా జీవన్ముక్తుడైనవాడు తన శరీరం దైవాధీనమనీ, అది ఎప్పుడో నశించిపోయేదనీ భావించి ఆత్మతత్త్వాన్ని అవగతం చేసుకొని ఉపేక్షాభావంతో ఉంటాడు. అంతేకాకుండా ఏకాగ్రభావంతో ఆత్మ సాక్షాత్కారం పొందినవాడై కర్మఫలం అనుభవింప వలసినంత వరకు భార్యాపుత్రులతో కూడిన ఈ సంసారాన్ని స్వప్నంలో లాగా అనుభవిస్తాడు. తర్వాత కలనుండి మేల్కొన్నవానిలాగా ఈ సంసార బంధాలన్నీ వదలిపెట్టి వర్తిస్తాడు.