పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విష్ణు సర్వాంగ స్తోత్రంబు

  •  
  •  
  •  

3-937-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదరకరసరోరుహం బందు రాజహంస రుచిరం బయిన పాంచజన్యంబును, నరాతిభటశోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారణి యగు కౌమోదకియును, బంధుర సుగంధ గంధానుబంధ మంథర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకార నినద విరాజితం బైన వైజయంతీ వనమాలికయును, జీవతత్త్వం బైన కౌస్తుభమణియును, బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు; వెండియు, భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్యమంగళవిగ్రహంబున కనురూపంబును, మకరకుండల మణి నిచయ మండిత ముకురోపమాన నిర్మల గండమండలంబును, సంతత శ్రీనివాస లోచనపంకజకలితంబును, లాలిత భ్రూలతాజుష్టంబును, మధుకర సమానరుచి చికురవిరాజితంబును నైన ముఖకమలంబు ధ్యానంబు గావింపవలయు; మఱియు, శరణాగతుల కభయప్రదంబు లగుచు నెగడు పాణిపంకేరుహంబుల మనంబునఁ దలఁపవలయు.

టీకా:

మఱియున్ = ఇంకను; విమత = శత్రువులు యైన {విమతుడు - వ్యతిరేకమైన ఆలోచనా విధానములు కలవాడు, శత్రువు}; జనా = జనములకు; అసహ్యంబులున్ = సహింపరానివి; ఐన = అయిన; సహస్ర = వెయ్యి (1000); ఆరంబులు = అంచులు; కలుగు = ఉండెడి; సుదర్శనంబున్ = సుదర్శనచక్రమును; సరసిజోదర = విష్ణుమూర్తి యొక్క {సరసిజోదరుడు - సరసిజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; కర = చేయి అనెడు; సరోరుహంబున్ = పద్మము {సరోరుహము - సరస్సున పుట్టునది, పద్మము}; అందున్ = లో; రాజహంస = రాయంచ వంటి; రుచిరంబున్ = కాంతికలది; అయిన = అయినట్టి; పాంచజన్యంబునున్ = పాంచజన్యమును; ఆరాతి = శత్రు; భట = వీరుల; శోణిత = రక్తము అనెడి; కర్దమము = బురద; లిప్త = అంటిన; అంగంబున్ = దేహము కలది; ఐ = అయ్యి; భగవత్ = భగవంతునికి; ప్రీతిన్ = ఇష్టమును; కారిణి = కలిగించునది; అగు = అయిన; కౌమోదికయును = కౌమోదికము అను గదను; బంధుర = చక్కటి; సుగంధ = సుగంధము యొక్క; గంధ = వాసన; అనుబంధ = కూడిన; మంథర = మెల్లని; గంధవహా = వాయువుచే; ఆహూయమాన = ఆహ్వానించబడిన; పుష్పంధయ = తుమ్మెద; ఝంకార = ఝంకారము అను; నినద = నినాదములతో; విరాజితంబును = విరాజిల్లుతున్నదియును; ఐన = అయిన; వైజయింతికా = వైజయంతిక అను; వనమాలికయును = వనమాలికను {వనమాలిక - ఆకులు పూలుతో కట్టిన మాల}; జీవతత్త్వంబున్ = జీవతత్త్వము కలది; ఐన = అయిన; కౌస్తుభ = కౌస్తుభము అను; మణియును = మణిను; ప్రత్యేకంబ = ప్రత్యేకముగా; ధ్యానంబున్ = ధ్యానము; చేయన్ = చేయ; తగున్ = వలయును; వెండియున్ = మరియును; భక్త = భక్తులను; సంరక్షణ = చక్కగా రక్షించుట; అర్థంబున్ = కోసము; అంగీకరించు = స్వీకరించు; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకరమైన; విగ్రహంబున్ = విగ్రహమున; కున్ = కు; అనురూపంబును = తగిన స్వరూపము కలిగిన; మకరకుండల = మకరకుండలముల; మణి = మణుల; నిచయ = సమూహములచే; మండిత = అలంకరింపబడిన; ముకుర = అద్దముతో; ఉపమాన = పోల్చదగిన; నిర్మల = స్వచ్ఛమైన; గండమండలంబును = చెక్కిళ్ళ ప్రదేశమును; సంతత = నిత్య; శ్రీ = లక్ష్మీ; నివాస = నివాసములైన; లోచన = కన్నులు అను; పంకజ = పద్మముల; కలితంబును = కలిగినదియును; లాలిత = మనోజ్ఞమైన; భ్రూ = కనుబొమలు అను; లతా = పూలతీగలతో; జుష్టంబును = ఇంపైనదియును; మధుకర = తుమ్మెదలతో; సమాన = సమానమైన; రుచి = కాంతివంతమైన; చికుర = ముంగురులచే; విరాజితంబున్ = విరాజిల్లుతున్నదియును; ఐన = అయినట్టి; ముఖ = ముఖము అనెడి; కమలంబున్ = కమలమును; ధ్యానంబున్ = ధ్యానము; కావింపన్ = చేయ; వలయున్ = వలయును; మఱియున్ = ఇంకను; శరణాగతుల్ = శరణుకోరువారి; కున్ = కి; అభయ = అభయమును; ప్రదంబులును = ఇచ్చునవి; అగుచున్ = అవుతూ; నెగడు = అతిశయించు; పాణి = హస్తములు అనెడి; పంకేరుహంబులు = పద్మములను {పంకేరుహములు - పంకము (నీరు) అందు ఈరుహము (పుట్టునది), పద్మము}; మనంబునన్ = మనస్సున; తలపన్ = స్మరించ; వలయున్ = వలెను.

భావము:

ఇంకా శత్రుసమూహాలకు సహింపరాని వేయి అంచుల సుదర్శన చక్రాన్ని, పద్మనాభుని కరపద్మంలో రాజహంసవలె విరాజిల్లే పాంచజన్య శంఖాన్ని, రాక్షసుల నెత్తురు చారికలతో కూడి దామోదరునికి ఆమోదదాయకమైన కౌమోదకి అనే గదను, గుప్పుమంటున్న కొంగ్రొత్త నెత్తావులు కమ్ముకున్న కమ్మ తెమ్మరల పిలుపు లందుకొని సంగీతాలు పాడే తుమ్మెదలతో కూడిన వైజయంతి అనే వనమాలికను, అఖిల లోకాలకు ఆత్మస్వరూపమైన కౌస్తుభమణిని వేరువేరుగా ధ్యానం చేయాలి. ఇంకా భక్తరక్షణ పరాయణత్వాన్ని స్వీకరించే దివ్యమంగళ రూపానికి తగినదై, మకరకుండలాల మణికాంతులు జాలువారే చక్కని చెక్కుటద్దాలతో ఎల్లవేళలా జయశ్రీకి మందిరాలైన అందాల కందమ్ములతో వంపులు తిరిగిన సొంపైన కనుబొమలతో, తేటి కదుపుల వంటి నల్లని ముంగురులతో, ముద్దులు మూటగట్టే ముకుందుని ముఖకమలాన్ని ధ్యానం చేయాలి. ఆర్తులై శరణాగతులైన భక్తులకు అభయమిచ్చే కరపద్మాలను మనస్సులో ధ్యానించాలి.