పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : ప్రకృతి పురుష వివేకంబు

  •  
  •  
  •  

3-914-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన భగవంతుం డిట్లనియె "ననిమిత్తం బయిన స్వధర్మంబునను, నిర్మలాంతఃకరణంబునను, సునిశ్చితంబైన మద్భక్తియోగంబునను, సత్కథాశ్రవణసంపాదితంబైన వైరాగ్యంబునను, దృష్ట ప్రకృతిపురుష యాధ్యాత్మంబగు జ్ఞానంబునను, బలిష్ఠం బయి కామానభిష్వంగం బగు విరక్తివలనఁ దపోయుక్తం బయిన యోగంబునను, దీవ్రం బయిన చిత్తైకాగ్రతం జేసి పురుషుని దగు ప్రకృతి దందహ్యమానం బై తిరోధానంబును బొందు; నదియునుం గాక యరణిగతం బైన వహ్నిచే నరణి దహింపఁ బడు చందంబున జ్ఞానంబునను దత్త్వదర్శనంబుననుం జేసి నిరంతరంబు బలవంతంబును దృష్టదోషంబును నగు ప్రకృతి జీవునిచేత భుక్తభోగమై విడువంబడు" నని చెప్పి.

టీకా:

అనినన్ = అనగా; భగవంతుండు = సర్వశక్తి సంపన్నుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అనిమిత్తంబున్ = ఫలితము ఆశించనిది; అయిన = అయినట్టి; స్వధర్మంబునన్ = తన మార్గమునందును; నిర్మల = స్వచ్ఛమైన; అంతఃకరణంబునను = మనసునందును; సునిశ్చితంబున్ = దృఢమైనది; ఐన = అయినట్టి; మత్ = నా యందలి; భక్తియోగంబుననున్ = భక్తియోగమువలనను; సత్కథా = మంచివారి కథలను; శ్రవణ = వినుటచే; సంపాదితము = సంపాదించుకొన్నది; ఐన = అయినట్టి; వైరాగ్యంబుననున్ = వైరాగ్యమునందును; దృష్ట = తెలిసికొన్న; ప్రకృతి = ప్రకృతి; పురుష = పురుషుడు; ఆది = మొదలైనవి; ఆత్మకంబున్ = తనలోనివే; అగు = అనెడి; జ్ఞానంబునను = జ్ఞానమువలనను; బలిష్ఠంబున్ = బలిష్ఠమైనది; అయి = అయిన; కామ = కామములందు; అనభిష్వంగంబు = అత్యంత అనాసక్తి; అగున్ = కలుగును; విరక్తి = విరక్తి; వలనన్ = వలనను; తపస్ = తపస్సుతో; యుక్తంబున్ = కూడినది; అయిన = అయినట్టి; యోగంబునను = యోగము యందును; తీవ్రంబున్ = తీవ్రము; అయిన = అయినట్టి; చిత్త = చిత్తము యొక్క; ఏకాగ్రతన్ = ఏకాగ్రత; చేసి = చేసికొనుట వలనను; పురుషునిన్ = పురుషుని అందు; అగు = ఉన్న; ప్రకృతిన్ = ప్రకృతి; దందహ్యమానంబున్ = కాలిపోయినది; ఐ = అయ్యి; తిరోధానంబున్ = అదృశ్యము; పొందును = అగును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; అరణి = అరణి {అరణి - ఘర్షణతో నిప్పును పుట్టిండుటకు వాడెడి కఱ్ఱ}; గతంబున్ = లోనున్నది; ఐన = అయినట్టి; వహ్ని = అగ్ని; చేన్ = చేత; అరణి = అరణి; దహింపబడు = కాల్చబడు; చందంబునన్ = విధముగనె; జ్ఞానంబుననున్ = జ్ఞానమందుట; తత్త్వదర్శనంబుననున్ = తత్త్వదర్శనముఅందుట; చేసి = వలన; నిరంతరంబున్ = ఎడతెగనిది; బలవంతంబును = బలిష్ఠమైనది; దృష్ట = దృష్టి; దోషంబునున్ = దోషభూయిష్టమును; అను = అయిన; ప్రకృతి = ప్రకృతి; జీవునిన్ = జీవుని; చేతన్ = చేత; భుక్తభోగమై = ఎంగిలి మెతుకులు వలె {భుక్తభోగము - భుక్త (భుజింపబడినట్టి) భోగము (పిండివంట) ఇక మిగిలినది, ఎంగిలి మెతుకులు}; విడువంబడు = విడిచివేయబడును; అని = అని; చెప్పి = చెప్పి.

భావము:

దేవహూతి ఇలా ప్రశ్నించగా భగవంతుడైన కపిలుడు ఇలా అన్నాడు. “సాధకుడైన పురుషుడు ఎటువంటి ఫలాన్ని కోరకుండా తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ ఉండాలి. తన మనస్సును ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలి. నాయందు అచంచలమైన భక్తి కలిగి ఉండాలి. పుణ్యకథలను ఆసక్తితో వినాలి. ప్రకృతి పురుష సంబంధమైన యథార్థజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలి. కోరికలను దూరంగా పారద్రోలి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. తపస్సుతో కూడిన యోగాభ్యాసం చేయాలి. అఖండమైన ఏకాగ్రతను అవలంభించాలి. ఈ సాధనవల్ల పురుషుని అంటుకొని ఉన్న ప్రకృతి దందహ్యమానమై అదృశ్యమైపోతుంది. అరణినుంచి ఉదయించిన అగ్ని అరణిని కాల్చి వేసినట్లు జ్ఞానం వల్లనూ, తత్త్వదర్శనం వల్లనూ పటిష్ఠమూ బలిష్ఠమూ దోషభూయిష్ఠమూ అయిన ప్రకృతిని అనుభవిస్తున్న జీవుడు సగంలోనే మొగం మొత్తి పరిత్యాగం చేస్తాడు” అని చెప్పి (ఇంకా ఇలా అన్నాడు).