పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : ప్రకృతి పురుష వివేకంబు

  •  
  •  
  •  

3-912-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జీవుండు పరమాత్మానుషక్తుండై భూతాది తత్త్వంబులు లీనంబులై ప్రకృతి యందు వాసనామాత్రంబు గలిగి యకార్యకరణంబులై యున్న సుషుప్తి సమయంబునం దాను నిస్తంద్రుం డగుచు నితరంబుచేతఁ గప్పబడనివాఁ డై పరమాత్మానుభవంబు సేయుచుండు" నని చెప్పిన విని; దేవహూతి యిట్లనియె.

టీకా:

జీవుండు = జీవుడు; పరమాత్మా = భగవంతుని; అనుషక్తుండు = విడువలేని అభిలాష పెంచుకొన్నవాడు; ఐ = అయ్యి; భూత = పంచ భూతములు; ఆది = మొదలగు; తత్త్వంబులు = తత్త్వములు; లీనంబులు = లీనము; ఐ = అయిపోయి; ప్రకృతి = ప్రకృతి; అందున్ = అందు; వాసనా = సంస్కారములుగా; మాత్రంబున్ = మాత్రమే; కలిగి = ఉండి; అకార్య = కార్యములు కానివానిని; కరణంబులు = చేసినవి; ఐ = అయ్యి; ఉన్న = ఉన్న; సుషుప్తి = సుషుప్తి; సమయంబునన్ = సమయము; అందునున్ = లోకూడ; నిస్తంద్రుడు = మేల్కొని ఉన్నవాడు {నిస్తంద్రుడు - మత్తులేనివాడు, మేల్కొని ఉన్నవాడు}; ఇతరంబున్ = ఇతరమైన వాని; చేన్ = చేత; కప్పబడనివాడు = అవరోధము లేనివాడు; ఐ = అయ్యి; పరమాత్మా = పరమాత్మను; అనుభవంబున్ = చక్కగ భావము; చేయుచున్ = చేస్తూ; ఉండును = ఉండును; అని = అని; చెప్పిన = చెప్పిన; విని = విని; దేవహూతి = దేవహూతి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

జీవుడు సుషుప్తిలో భగవంతునితో ప్రగాఢమైన సంబంధం కలిగి ఉంటాడు. వానియందలి పంచభూతాలు మొదలైన తత్త్వాలు ప్రకృతిలో విలీనాలై సంస్కార మాత్రంగా ఉంటూ, తమ పనులను చేయలేని స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో సాధకుని ఆత్మ తానుమాత్రం మేల్కొని ఉండి ఎటువంటి అవరోధం లేనిదై పరమాత్మను భావన చేస్తూ ఉంటుంది” అని చెప్పగా విని దేవహూతి కపిలునితో ఇలా అన్నది.