పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మాండోత్పత్తి

  •  
  •  
  •  

3-896-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది యెట్టు లంటేని సామాన్యచింతయు విశేషచింతయు ననందగు సంకల్ప వికల్పంబులం జేసి కామసంభవం బనంబడు నెద్ది, యనిరుద్ధాఖ్యం బయిన వ్యూహం బదియ హృషీకంబులకు నధీశ్వరం బయి సకల యోగీంద్ర సేవ్యం బగుచు శరదిందీవర శ్యామం బయి యుండు; వెండియుం దైజసంబువలన బుద్ధితత్త్వంబు పుట్టె; దాని లక్షణంబులు ద్రవ్యప్రకాశం బైన జ్ఞానంబును, నింద్రియానుగ్రహంబును, సంశయంబును, మిథ్యాజ్ఞానంబును, నిద్రయు, నిశ్చయంబును స్మృతియు ననందగి యుండు; మఱియుఁ దైజసాహంకారంబు వలన జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులును గ్రియాజ్ఞానసాధనంబులును గలిగి యుండుఁ; బ్రాణంబునకుం గ్రియాశక్తియు బుద్ధికి జ్ఞానశక్తియు నగుటం జేసి యింద్రియంబులకుఁ దైజసత్వంబు గలిగి యుండు; భగద్భక్తి ప్రేరితం బయిన తామసాహంకారంబువలన శబ్ద తన్మాత్రంబు పుట్టె; దానివలన నాకాశంబును నాకాశంబువలన శ్రోత్రింద్రియంబును పుట్టె; శ్రోత్రంబు శబ్దగ్రాహి యయ్యె; శబ్దం బర్థంబునకు నాశ్రయంబై శ్రోతకు జ్ఞానజనకం బయ్యె మఱియు శబ్దతన్మాత్రంబువలన నాకాశం బయి యా యాకాశంబు భూతంబులకు బాహ్యాభ్యంతరంబుల నవకాశం బిచ్చటయు నాత్మ ప్రాణేంద్రియాదులకు నాశ్రయం బగుటయు నను లక్షణంబులు గలిగి యుండు కాల గతిచే వికారంబు నొందు; శబ్దతన్మాత్ర లక్షణం బగు నభంబువలన స్పర్శంబును స్పర్శంబువలన వాయువును వాయువుచే స్పర్శగ్రాహియైన త్వగింద్రియంబును బుట్టె; మృదుత్వంబును గఠినత్వంబును శైత్యంబును నుష్ణత్వంబును నను నివి స్పర్శంబునకు స్పర్శత్వం బని చెప్పంబడు; మఱియు వాయువునకుఁ జాలనంబును పరస్పర విభాగకరణంబును దన్మేళనంబును ద్రవ్యశబ్దనేతృత్వంబు నగు;నందు గంధవంతం బగు ద్రవ్యంబును ఘ్రాణేద్రియంబు నొందించుట ద్రవ్యనేతృత్వంబు దూరస్థం బగు శబ్దంబును శ్రోత్రేంద్రియ గ్రాహ్య మగు; నట్లొనరించుట శబ్దనేతృత్వంబు సర్వేంద్రియాత్మకత్వంబు ననునవి లక్షణంబులై యుండు; దైవప్రేరితంబై స్పర్శ తన్మాత్ర గుణకం బగు వాయువువలన రూపంబును దానివలనఁ దేజంబును బుట్టె; రూపంబు నేత్రేంద్రియ గ్రాహకం బయ్యె నేత్రగతం బయిన రూపంబునకు నుపలంభకత్వంబును ద్రవ్యాకారసమత్వంబును ద్రవ్యంబునకు నుపసర్జనం బగుటయు ద్రవ్యపరిణామ ప్రతీతియు నివి రూపవృత్తు లనంబడు; తైజసంబునకు సాధారణంబు లగు ధర్మంబులు ద్యోతం బనఁ బ్రకాశంబు పచనం బనఁ దండులాదుల పాకంబు పిపాసా నిమిత్తం బైన పానంబు క్షున్నిమిత్తం బైన యోదనంబు హిమమర్దనం బగు శోషణంబు ననునివి వృత్తులై యుండు; రూపతన్మాత్రంబువలన దైవచోదితంబై వికారంబు నొందు తేజస్సు వలన రసతన్మాత్రంబు పుట్టె; రసతన్మాత్రంబువలన జలంబు పుట్టె; జిహ్వ యను రసనేంద్రియంబు రసగ్రాహకం బయ్యె; నా రసం బేకంబై యుండియు భూతవికారంబునం జేసి కషాయ తిక్త కట్వామ్ల మధురాది భేదంబుల ననేక విధం బయ్యె; వెండియు సాంసర్గిక ద్రవ్యవికారంబునంజేసి యార్ద్రం బగుటయు ముద్దగట్టుటయుఁ దృప్తి దాతృత్వంబును జీవంబును దద్వైక్లబ్య నివర్తనంబును మృదూకరణంబును దాపనివారణంబును గూపగతం బయిన జలంబు దివియ మఱియు నుద్గమించుటయు ననునివి జలవృత్తు లనంబడు; రసతన్మాత్రంబువలన దైవచోదితంబై వికారంబునం బొందిన జలంబు వలన గంధతన్మాత్రంబు పుట్టె; దానివలనం బృథ్వియు గలిగె ఘ్రాణంబు గంధగ్రాహకం బయ్యె;నందు గంధం బేకం బయ్యు వ్యంజనాదిగతం బయి హింగ్వాది నిమిత్తం బయిన మిశ్రమగంధంబును కరంభంబును గృంజనాదిగతం బయిన పూతిగంధంబును; ఘనసారాది నిమిత్తం బయిన సుగంధంబును శతపత్రాదిగతం బగు శాంత గంధంబును లశునాదిగతం బైన యుగ్రగంధంబును బరుష్యిత చిత్రాన్నాది గతం బయిన యామ్లగంధంబును ద్రవ్యావయవ వైషమ్యంబునం జేసి యనేకవిధంబై యుండు; నదియునుం గాక ప్రతిమాదిరూపంబులం జేసి సాకారతాపాదనం బగు భావంబును, జలాది విలక్షణ త్రయాంతర నిరపేక్షం బయిన స్థితియు జలాధ్యాధారత యను ధారణంబును, నాకాశాద్యవచ్ఛేదకత్వంబును, సకలప్రాణి పుంస్త్వాభి వ్యక్తీకరణంబును ననునివి పృథ్వీవృత్తు లనంబడు" నని చెప్పి వెండియు నిట్లనియె "నభో సాధారణగుణ శబ్దవిశేషగ్రాహకంబు శ్రోత్రంబును, వాయ్వ సాధారణగుణ విశేషగ్రాహకంబు స్పర్శంబును, దేజో సాధారణగుణ విశేషగ్రాహకంబు చక్షురింద్రియంబును, నంభో సాధారణగుణ విశేషగ్రాహకంబు రసనేంద్రియంబును, భూమ్య సాధారణగుణ విశేషగ్రాహకంబు ఘ్రాణేంద్రియంబును, నాకాశాది గుణంబులగుచు శబ్దాదికార్యంబు లగు వాయ్వాదు లందుఁ గారణాన్వయంబు ననన్నిఁటికిం బృథ్వీ సంబంధంబు గలుగుటంజేసి భూమి యందు శబ్దస్పర్శరూపరసగంధంబులు గలుగుట మహదాదిపృథివ్యంతంబు లగు నీ యేడు తత్త్వంబులు పరస్పర మిళితంబు లై భోగాయతనం బగు పురుషునిం గల్పింప సమర్థంబులై యున్నం జూచి కాలాదృష్టసత్వాదులం గూడి జగత్కారణుండును ద్రైగుణ్యవిశిష్టుండును నశేష నియామకుండును నిరంజనాకారుండును నగు సర్వే శ్వరుం డందు బ్రవేశించు; నంత నన్యోన్యక్షుబితంబు లై మిళితంబు లైన మహదాదుల వలన నధిష్ఠాతృచేతన రహితం బగు నొక యండంబు పుట్టె; నందు.

టీకా:

అది = అది; ఎట్టులన్ = ఎలాగ; అంటేని = అంటే; సామాన్య = సామాన్యముగ; చింతయున్ = ఆలోచించుటయును; విశేష = విశేషముగ; చింతయున్ = ఆలోచించుటయును; అనన్ = అనుటకు; తగు = తగిన; సంకల్ప = సంకల్పము; వికల్పుంలన్ = వికల్పములను; చేసి = వలన; కామ = కోరిక; సంభవంబు = పుట్టుట; అనంబడు = అనబడెడిది; ఎద్దియ = ఏదో; అనిరుద్ధ = అనిరుద్ధము; ఆఖ్యంబు = అనబడునది; అయిన = అయిన; వ్యూహంబు = తత్త్వము; అదియ = అదే; హృషీకంబుల్ = ఇంద్రియముల {హృషీకేశుడు- హృషీకములు (ఇంద్రియములకు) ఈశుడు, అనిరుద్దుడు, విష్ణువు}; కున్ = కు; అధీశ్వరంబున్ = అధిపత్యము వహించినది; అయి = అయ్యి; సకల = సమస్తమైన; యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠులచే; సేవ్యంబున్ = కొలవబడునది; అగుచున్ = అవుతూ; శరత్ = శరత్కాలపు; ఇందీవర = నల్లకలువ వలె; శ్యామంబున్ = నల్లని రంగు కలది; అయి = అయ్యి; ఉండున్ = ఉండును; వెండియున్ = ఇంకనూ; తైజంబు = తైజసము; వలనన్ = వలన; బుద్ధి = బుద్ధి; తత్త్వంబున్ = తత్వము; పుట్టెన్ = పుట్టినది; దాని = దాని యొక్క; లక్షణంబులున్ = లక్షణములు; ద్రవ్య = వస్తువులను; ప్రకాశంబున్ = తెలియజేయునది; ఐన = అయిన; జ్ఞానంబును = జ్ఞానమును; ఇంద్రియ = ఇంద్రియములను; అనుగ్రహంబును = ఏలుకొను శక్తియును; సంశయంబునున్ = సంశయమును; మిథ్యాజ్ఞానంబును = ఆరోపించుకొనుటయును; నిద్రయు = నిద్రయును; నిశ్చయంబునున్ = నిశ్చయమును; స్మృతియున్ = స్మృతియును; అనన్ = అనుటకు; తగి = తగి; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకను; తైజసాహంకారంబు = తైజసాహంకారము; వలనన్ = వలన; జ్ఞానేంద్రియ = జ్ఞానేంద్రియములు; కర్మేద్రియంబులును = కర్మేంద్రియములును; క్రియా = క్రియలను, పనులను; జ్ఞాన = జ్ఞానమును; సాధనంబులునున్ = సాధించు వాటిని; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; ప్రాణంబున్ = ప్రాణముల; కున్ = కు; క్రియా = క్రియలనుచేయు; శక్తియు = శక్తియును; బుద్ధిన్ = బుద్ధి; కిన్ = కి; జ్ఞాన = జ్ఞాన; శక్తియున్ = శక్తియును; అగుటన్ = కలుగుట; చేసి = వలన; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; కున్ = కు; తైజసత్వంబున్ = రజోగుణము; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; భగవత్ = భగవంతునిచే; ప్రేరితంబున్ = ప్రేరేపింపబడినది; అయిన = అయిన; తామసాహంకారంబున్ = తామసాహంకారము; వలనన్ = వలన; శబ్ద = శబ్దము యొక్క; తన్మాత్రంబున్ = తన్మాత్రమును; పుట్టెన్ = పుట్టెను; దానిన్ = దాని; వలనన్ = వలన; ఆకాశంబునున్ = ఆకాశమును; ఆకాశంబునున్ = ఆకాశము; వలనన్ = వలన; శ్రోత్రింద్రియంబునున్ = చెవియును; పుట్టెన్ = పుట్టెను; శ్రోత్రంబు = చెవి; శబ్ద = శబ్దమును; గ్రాహి = గ్రహించునది; అయ్యెన్ = అయ్యెను; శబ్దంబున్ = శబ్దము; అర్థంబున్ = అర్థమున; కున్ = కు; ఆశ్రయంబున్ = ఆశ్రయమును; ఐ = అయ్యి; శ్రోత = వినువాని; కున్ = కి; జ్ఞాన = జ్ఞానమును; జనకంబున్ = కలిగించునది; అయ్యెన్ = అయ్యెను; మఱియున్ = ఇంకనూ; శబ్దతన్మాత్రంబు = శబ్దతన్మాత్రము; వలనన్ = వలన; ఆకాశంబునున్ = ఆకాశము; అయి = అయ్యి; ఆ = ఆ; ఆకాశంబున్ = ఆకాశము; భూతంబుల్ = ఇతర భూతములకు (వాయువు, తేజము, జలము, పృథ్వి); కున్ = కును; బాహ్య = బయటయును; అభ్యంతరంబులన్ = లోపలలలోను; అవకాశంబు = అవకాశము; ఇచ్చుటయునున్ = ఇచ్చుటయును; ఆత్మ = ఆత్మకును; ప్రాణ = ప్రాణములు; ఇంద్రియ = ఇంద్రిములు; ఆదుల్ = మొదలైనవాని; కున్ = కిని; ఆశ్రయంబున్ = ఆశ్రయము; అగుటయున్ = అగుటయు; అను = అనెడి; లక్షణంబులున్ = లక్షణములును; కలిగి = కలిగి; ఉండున్ = ఉండును; కాల = కాలము యొక్క; గతి = గమనము; చేన్ = వలన; వికారంబున్ = మార్పులను; ఒందు = పొందు; శబ్దతన్మాత్ర = శబ్దతన్మాత్రము యొక్క; లక్షణంబున్ = లక్షణము; అగు = అయిన; నభంబున్ = ఆకాశము; వలనన్ = వలన; స్పర్శంబునున్ = స్పర్శంబును; స్పర్శంబున్ = స్పర్శంబు; వలనన్ = వలన; వాయువును = వాయువును; వాయువు = వాయువు; చేన్ = వలన; స్పర్శ = స్పర్శను; గ్రాహి = గ్రహించునది; ఐ = అయ్యి; త్వగింద్రియంబునున్ = చర్మము అనెడి ఇంద్రియము; పుట్టెన్ = పుట్టెను; మృదుత్వంబునున్ = మెత్తదనమును; కఠినత్వంబును = గట్టిదనమును; శైత్యంబునున్ = చల్లదనమును; ఉష్ణత్వంబునున్ = వేడియును; అనునవి = అనెడి; స్పర్శంబున్ = స్పర్శమున; కున్ = కు; స్పర్శత్వంబున్ = స్పర్శత్వము; అని = అని; చెప్పంబడున్ = చెప్పబడును; మఱియున్ = ఇంకను; వాయువున్ = వాయువున; కున్ = కు; చాలనంబును = కదలుటయును; పరస్పర = ఒకటికొకటి; విభాగకరణంబునున్ = విడిపోవుటయును; తత్ = వాని; మేళనంబునున్ = కలియుటయును; ద్రవ్య = వస్తువుపైన; శబ్ద = శబ్దముపైన; నేతృత్వంబున్ = ప్రభావము చూపగలుగుట; అగున్ = అగును; అందు = వానిలో; గంధవంతంబున్ = వాసనకలవి; అగు = అయిన; ద్రవ్యంబునున్ = ద్రవ్యమును; ఘ్రాణేంద్రియంబున్ = ముక్కునకు; పొందించుట = చెందించుట; ద్రవ్యనేతృత్వంబున్ = ద్రవ్యనేతృత్వము; దూరస్థంబున్ = దూరముగ; అగు = ఉండు; శబ్దంబును = శబ్దమును; శ్రోత్రేందియ = చెవికి; గ్రాహ్యంబున్ = గ్రహింపబడుట; అగున్ = జరుగు; అట్లు = విధముగ; ఒనరించుట = కలుగ చేయుట; శబ్దనేతృత్వంబున్ = శబ్దనేతృత్వము; సర్వ = అన్ని; ఇంద్రియ = ఇంద్రియములను; ఆత్మకత్వంబున్ = తనలోకలిగియుండుట; అనునవి = అనెడివి; లక్షణంబులున్ = లక్షణములు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; దైవ = దైవముచే; ప్రేరితంబున్ = ప్రేరింపబడినది; ఐ = అయ్యి; స్పర్శతన్మాత్ర = స్పర్శతన్మాత్ర యొక్క; గుణకంబున్ = గుణములు కలది; అగు = అయిన; వాయువు = గాలి; వలనన్ = వలన; రూపంబునున్ = రూపమును; దానిన్ = దాని; వలనన్ = వలన; తేజంబునున్ = తేజస్సును; పుట్టెన్ = పుట్టెను; రూపంబున్ = రూపము; నేత్రేంద్రియ = కన్ను అనెడి ఇంద్రియముచే; గ్రాహకంబున్ = గ్రహింపబడునది; అయ్యెన్ = అయ్యెను; నేత్ర = కంటికి; గతంబున్ = చెందినది; అయిన = అయిన; రూపంబున్ = రూపమున; కున్ = కు; ఉపలంభకత్వంబునున్ = అనుభవము కలదియును, ఉన్నచోటు తెలియుట; ద్రవ్య = వస్తువు యొక్క; ఆకార = ఆకారమును; సమత్వంబునున్ = సమముగతెలియుటను; ద్రవ్యంబున్ = వస్తువున; కున్ = కు; ఉపసర్జనంబు = అప్రధానము; అగుటయున్ = అగుటయు; ద్రవ్య = వస్తువు యొక్క; పరిణామ = మార్పులు చెందుట; ప్రతీతియున్ = తెలియుటయును; ఇవి = ఇవి; రూపవృత్తులు = రూపవృత్తులు; అనంబడు = అనబడును; తైజసంబున్ = తైజసమునకు; సాధారణంబులు = సాధారణమైనవి; అగు = అయిన; ధర్మంబులును = ధర్మములు; ద్యోతంబున్ = ఉన్నట్లు తెలియుట, తోచుట; అనన్ = అనెడి; ప్రకాశంబున్ = ప్రకాశము; పచనంబున్ = వండుట; అనన్ = అనెడి; తండుల = బియ్యము; ఆదులన్ = మొదలైనవాని; పాకంబున్ = వంట; పిపాసా = దాహమునకు; నిమిత్తంబున్ = కారణము; ఐన = అయిన; పానంబున్ = తాగుట; క్షుత్ = ఆకలి; నిమిత్తంబున్ = కారణము; ఐన = అయిన; ఓదనంబున్ = ఆహారమును; హిమ = చలిని; మర్దనంబున్ = పోగొట్టునది; అగు = అయిన; శోషణంబున్ = వేడిచేయుటయును; అనున్ = అనెడి; ఇవి = ఇవి; వృత్తులు = లక్షణములు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; రూపతన్మాత్రంబు = రూపతన్మాత్రము; వలనన్ = వలన; దైవ = దైవముచే; చోదితంబున్ = ప్రేరేపింపబడినది; ఐ = అయ్యి; వికారంబున్ = మార్పులను; పొందున్ = చెందు; తేజస్సు = తేజస్సు; వలనన్ = వలన; రసతన్మాత్రంబు = రసతన్మాత్రము; పుట్టెన్ = పుట్టెను; రసతన్మాత్రంబు = రసతన్మాత్రము; వలనన్ = వలన; జలంబున్ = జలము; పుట్టెన్ = పుట్టెను; జిహ్వ = నాలుక; అను = అనెడి; రసనేంద్రియంబున్ = రుచిచూచు సాధనము; రస = రుచిని; గ్రాహకంబున్ = గ్రహించ కలది; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; రసంబు = రసము; ఏకంబున్ = ఒకటే; ఐ = అయ్యి; ఉండియున్ = ఉన్నప్పటికిని; భూత = పంచభూతముల; వికారంబునన్ = మార్పుల; చేసి = వలన; కషాయ = వగరు; తిక్త = చేదు; కటు = కారము; ఆమ్ల = పులుపు; మధుర = తీపి; ఆది = మొదలగువాని; భేదంబులన్ = తేడాలతో; అనేక = అనేక; విధంబున్ = రకములు; అయ్యెన్ = అయ్యెను; వెండియున్ = ఇంకను; సాంసర్గిక = కలియకలు చెందుటచే; ద్రవ్య = వస్తువులందలి; వికారంబునన్ = మార్పుల; చేసి = వలన; ఆర్ద్రంబున్ = చెమ్మగిల్లుటను; అగుటయున్ = చెందుటయును; ముద్దగట్టుటయున్ = ముద్దగట్టుటయును; తృప్తీ = తృప్తిని; దాతృత్వంబును = ఇచ్చుటయును; జీవంబున్ = జీవనమును; తత్ = వాని; వైక్లబ్య = బాధను; నివర్తనంబును = నివారించుటయును; మృదూ = మృదువుగా; కరణంబునున్ = చేయుటయును; తాప = తాపమును; నివారణంబునున్ = నివారించుటయును; కూప = బావి; గతంబున్ = లోనున్నవి; అయిన = అయిన; జలంబున్ = నీటిని; తివియన్ = తోడగా; మఱియున్ = మరల; ఉద్గమించుటయున్ = ఊరుటయును; అనున్ = అను; ఇవి = ఇవి; జలవృత్తులు = జలలక్షణములు; అనంబడున్ = అనబడును; రసతన్మాత్రంబున్ = రసతన్మాత్రము; వలనన్ = వలన; దైవ = దైవముచే; చోదితంబున్ = ప్రేరింపబడినది; ఐ = అయ్యి; వికారంబున్ = మార్పులను; పొందిన = చెందినట్టి; జలంబున్ = నీరు; వలనన్ = వలన; గంధతన్మాత్రంబన్ = గంధతన్మాత్రము; పుట్టెన్ = పుట్టెను; దాని = దాని; వలనన్ = వలన; పృథ్వియున్ = పృథ్వియును; కలిగెన్ = కలిగెను; ఘ్రాణంబున్ = ముక్కు; గంధ = వాసనను; గ్రాహకంబున్ = గ్రహించకలది; అయ్యెన్ = అయ్యెను; గంధంబు = వాసన; ఏకంబున్ = ఒకటే; అయ్యున్ = అయినను; వ్యంజన = కూరలు; ఆది = మొదలైనవాని; గతంబున్ = లోనిది; అయి = అయ్యి; హింగ్వ = ఇంగువ; ఆది = మొదలైనవాని; నిమిత్తంబున్ = వలన; అయిన = అయిన; మిశ్రమ = కలగలుపు; గంధంబును = వాసనయును; కరభంబున్ = పెరుగన్నపు ముద్ద; గృంజన = జంతుమాంసము; ఆది = మొదలైనవాని; గతంబున్ = కూడినది; అయిన = అయిన; పూతి = చెడు; గంధంబున్ = వాసనయు; ఘనసార = పచ్చకర్పూరము; ఆది = మొదలైనవాని; నిమిత్తంబున్ = వలన; అయిన = అయిన; సుగంధంబును = సుగంధమును; శతపత్ర = తామరపూలు; ఆది = మొదలైనవాని; గతంబున్ = కూడినది; అయిన = అయిన; శాంత = శాంతపు; గంధంబును = వాసనయు; లశున = వెల్లుల్లి; ఆది = మొదలైనవాని; గతంబున్ = కూడినది; ఐన = అయిన; ఉగ్ర = ఘాటు; గంధంబునున్ = వాసనయు; పరి = మిక్కిలి; ఉష్యత = చల్దియైన, పులిసిపోయిన; చిత్రాన్న = పులిహార; ఆది = మొదలైనవాని; గతంబున్ = కూడినది; అయిన = అయిన; ఆమ్ల = పుల్లని; గంధంబునున్ = వాసనయును; ద్రవ్య = వస్తువుల; అవయవ = పాళ్ళయొక్క; వైషమ్యంబున్ = తేడాల; చేసి = వలన; అనేక = అనేక; విధంబున్ = విధములు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ప్రతిమ = బొమ్మలు; ఆది = మొదలైనవాని; రూపంబులన్ = రూపముల; చేసి = వలన; సాకారత = ఆకారముతో కూడి ఉండుట; ఆపాదనంబున్ = కల్పింపబడినది; అగు = అయిన; భావంబునున్ = భావమును; జలాది = నీరు మొదలైన {జలాది విలక్షణ త్రయము - జలము వాయువు అగ్ని}; విలక్షణ = ప్రత్యేకమైన; త్రయ = మూటి; అంతర = లోని; నిరపేక్షంబున్ = స్వతంత్రము; అయిన = అయిన; స్థితియున్ = విధమును; జలాది = నీరు మొదలైన; ఆధారత = ఆధారపడుట; అను = అనెడి; ధారణంబును = ధరించుటయును; ఆకాశాది = ఆకాశము మొదలైన {ఆకాశాది - 1ఆకాశము 2వాయువు 3అగ్ని 4జలము 5 పృథ్వి}; అవచ్ఛేదకత్వంబునున్ = విడదీయగలుగుటయును; సకల = సమస్తమైన; ప్రాణి = ప్రాణుల; పుంస్త్వ = పురుషత్వ, లింగము; అభివ్యక్తీకరణ = స్పష్టపరచుట; అనునవి = అనెడివి; పృథ్వీవృత్తులు = పృథ్వి తత్త్వము యొక్క లక్షణములు; అనంబడున్ = అనబడును; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; నభస్ = ఆకాశమునకు; అసాధారణ = అసాధారణ; గుణ = గుణము అయిన; శబ్ద = శబ్దమను; విశేష = విశేషమును; గ్రాహకంబున్ = గ్రహించగలిగినది; శ్రోత్రంబునున్ = చెవియును; వాయువు = వాయువునకు; అసాధారణ = అసాధారణ; గుణ = గుణము అయిన; విశేష = విశేషమును; గ్రాహకంబున్ = గ్రహించగలిగినది; స్పర్శంబునున్ = చర్మమును; తేజస్ = తేజస్సునకు; అసాధారణ = అసాధారణ; గుణ = గుణము అయిన; విశేష = విశేషమును; గ్రాహకంబున్ = గ్రహించగలిగినది; చక్షురింద్రియంబునున్ = కన్నుయును; అంభస్ = నీటికి; అసాధారణ = అసాధారణ; గుణ = గుణము అయిన; విశేష = విశేషమును; గ్రాహకంబున్ = గ్రహించగలిగినది; రసనేంద్రియంబున్ = నాలుకయును; భూమి = భూమికి; అసాధారణ = అసాధారణ; గుణ = గుణము అయిన; విశేష = విశేషమును; గ్రాహకంబున్ = గ్రహించగలిగినది; ఘ్రాణంబునున్ = ముక్కుయును; ఆకాశాది = ఆకాశము మొదలైన; గుణంబుల్ = గుణములు కలది; అగుచున్ = అవుతూ; శబ్దాది = శబ్దాది; కార్యంబులు = చేయు పనులు; అగు = అగు; వాయ్వాదులు = వాయువు మొదలైనవాని; కారణ = కారణము; అన్వయంబునన్ = సరిపడుటయు; అన్నిటికిన్ = అన్నిటికిని; పృథ్వీ = భూమికి; సంబంధంబున్ = సంబంధము; కలుగుటన్ = కలుగుట; చేసి = వలన; భూమి = భూమి; అందు = అందు; శబ్ద = శబ్దము; స్పర్శ = స్పర్శము; రూప = రూపము; రస = రుచి; గంధంబులు = వాసనలు; కలుగుటన్ = కలుగుటయు; మహత్ = మహత్తు; ఆది = మొదలైన; పృథ్వి = పృథ్వి; అంతంబుల్ = వరకు; అగు = కల; ఈ = ఈ; ఏడున్ = ఏడు (7); తత్త్వంబులున్ = తత్త్వములును; పరస్పర = ఒకదానిలోనింకొకటి; మిళితంబుల్ = కలసిపోయినవి; ఐ = అయ్యి; భోగాయతనము = అనుభవించుటకు తగినది; అగు = అయిన; పురుషునిన్ = పురుషుని; కల్పింపన్ = సృష్టించుటకున్; సమర్థంబులున్ = తగినవి; ఐ = అయ్యి; ఉన్నన్ = ఉండగ; చూచి = చూసి; కాల = కాలము; అదృష్ట = అవ్యక్తము; సత్త్వ = సత్త్వము; ఆదులన్ = మొదలైనవానిని; కూడి = కలసి; జగత్ = విశ్వమునకు; కారణుండునున్ = కారణము అయినవాడును; త్రైగుణ్య = త్రిగుణములతోను; విశిష్టుండును = ప్రత్యేకత చెందినవాడును; నిరంజన = కంటికి అందని; ఆకారుండునున్ = ఆకారము కలవాడును; సర్వేశ్వరుండు = భగవంతుడు {సర్వేశ్వరుడు - సమస్తమునకును ప్రభువు అయినవాడు, విష్ణువు}; ప్రవేశించున్ = ప్రవేశించును; అంతన్ = అంతట; అన్యోన్య = ఒకదానితోనొకటి; క్షుభితంబులు = మథింపబడినవి; ఐ = అయ్యి; మిళితంబుల్ = కలసిపోయినవి; అయిన = అయిన; మహత్ = మహత్తు; ఆదులు = మొదలగువాని; వలనన్ = వలన; అధిష్ఠాతృ = అధిష్ఠించిన వానికి, భగవంతుని; చేతన = ప్రజ్ఞ; రహితంబులు = లేనట్ట్టి; అగు = అయిన; ఒక = ఒక; అండంబున్ = గుడ్దు; పుట్టెన్ = పుట్టెను; అందున్ = అందు.

భావము:

అది ఎలాగంటే ఈ మనస్తత్త్వానికి చింతనం సహజం. ఆ చింతనం సామాన్య చింతనం, విశేష చింతనం అని రెండు విధాలు. వీనినే క్రమంగా సంకల్పం, వికల్పం అని పేర్లు. ఈ సంకల్ప వికల్పాల వల్లనే సృష్టిలోని వస్తువులు వేరువేరు లక్షణాలతో మనకు కనిపిస్తాయి. వీనివల్లనే వివిధ కామాలు ఉత్పన్నమౌతాయి. కనుకనే ఇది ప్రద్యుమ్న వ్యూహం అని చెప్పబడుతుంది. ఇక అనిరుద్ధ వ్యూహం సంగతి చెబుతాను. ఇదే ఇంద్రియాలన్నిటికి అధీశ్వరమై,(హృషీకేశిుడై) యోగీంద్రు లందరకు సంసేవ్యమై, శరత్కాల మందలి నల్లకలువ వలె శ్యామల వర్ణంతో విరాజిల్లుతూ ఉంటుంది. తైజసాహంకారం వల్ల బుద్ధితత్త్వం పుట్టింది. ద్రవ్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానం, ఇంద్రియానుగ్రహం, సంశయం, మిథ్యాజ్ఞానం, నిద్ర, నిశ్చయం, స్మృతి అనేవి బుద్ధితత్త్వ లక్షణాలు. ఈ తైజసాహంకారం వల్లనే ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, క్రియాజ్ఞాన సాధనాలు ఏర్పడుతాయి. ఈ తైజసాహంకారం వల్లనే ప్రాణానికి సంబంధించిన క్రియాశక్తి, బుద్ధికి సంబంధించిన జ్ఞానశక్తి కలుగుతాయి. ఈ రెండు శక్తులూ కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను పనిచేయిస్తాయి. భగవద్భక్తివల్ల ప్రేరేపించబడిన తామసాహంకారంనుండి శబ్దతన్మాత్రం పుట్టింది. ఈ శబ్ద తన్మాత్రంనుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి శ్రోత్రేంద్రియం (చెవి) పుట్టింది. శ్రోత్రం శబ్దాన్ని గ్రహిస్తుంది. అదే శబ్దం అర్థానికి ఆశ్రయమై శబ్దం వినేవానికి జ్ఞానజనకం అవుతున్నది. ఈ శబ్దతన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడింది. ఈ ఆకాశం సకల జీవులకు లోపల వెలుపల అవకాశం ఈయటమే కాక ఆత్మకూ, ప్రాణాలకూ, ఇంద్రియాలకూ ఆశ్రయంగా ఉంటుంది. కాలగమనం వల్ల మార్పు చెందే శబ్దతన్మాత్ర లక్షణమైన ఆకాశం వల్ల స్పర్శమూ, స్పర్శంవల్ల వాయువూ, ఆ వాయువువల్ల స్పర్శను గ్రహించగల చర్మమూ పుట్టి స్పర్శజ్ఞానాన్ని కలిగించింది. మెత్తదనం, గట్టిదనం, చల్లదనం, వెచ్చదనం ఇవి స్పర్శజ్ఞానానికి లక్షణాలు. వాయువునకు కదలుట, కదలించుట, వేరుచేయుట, కలుపుట, ద్రవ్యనేతృత్వం, శబ్దనేతృత్వం, సర్వేంద్రియాత్మకత్వం అనేవి లక్షణాలు. గంధంతో కూడిన ద్రవ్యాలను ఆఘ్రాణింపజేయటం ద్రవ్యనేతృత్వం. దూరంగా ఉన్న శబ్దాన్ని చెవికి వినిపింప జేయటం శబ్దనేతృత్వం. భగవత్ప్రేరణతో స్పర్శతన్మాత్రం వల్ల పుట్టిన వాయువువల్ల రూపం పుట్టింది.ఈ రూపం వలన తేజస్సు కలిగింది. నేత్రేంద్రియం వల్ల గ్రహింపదగింది రూపం. నేత్రాన్ని పొందిన రూపానికి అనగా కనుపించునటువంటి ఆకారానికి వృత్తులు ఉపలంభకత్వం (అనుభవం కలుగడం), ద్రవ్యాకారసమత్వం (ద్రవ్యంయొక్క ఆకారాన్ని ఉన్నదున్నట్లుగా చూపడం), ద్రవ్యోపసర్జనం (ద్రవ్యం అప్రధానం కావడం), ద్రవ్యపరిణామ ప్రతీతి (ద్రవ్యంయొక్క మార్పు తెలియడం). ఇక తేజస్సుకు సాధారణాలైన ధర్మాలు ద్యోతం, పచనం, పిపాస, ఆకలి, చలి. ద్యోతానికి ప్రకాశం, పచనానికి బియ్యం మొదలైన పాకం, పిపాసకు పానం, ఆకలికి ఆహారం, చలికి శోషణం అనేవి వృత్తులు. దైవప్రేరితమై మార్పు చెందిన తేజస్సువల్ల రసతన్మాత్రం పుట్టింది. ఈ రసతన్మాత్ర వల్ల జలం పుట్టింది. జిహ్వ అనే పేరుగల రసనేంద్రియం రసాన్ని గ్రహించేది అయింది. ఆ రసం ఒకటే అయినా ద్రవ్యాల కలయికలోని మార్పువల్ల వగరు, చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు అనే రుచులుగా మారి వాటి కలయిక వల్ల ఇంకా అనేకవిధాలుగా మార్పు చెందింది. తనలో చేరిన ద్రవ్యాల మార్పులనుబట్టి ఆర్ద్రం కావడం, ముద్ద గట్టడం, తృప్తినివ్వడం, జీవనం, అందలి మాలిన్యాన్ని నివారించడం, మెత్తపరచడం, తాపాన్ని పోగొట్టడం, బావిలో జలలు ఏర్పడి అడుగున ఉన్న జలం పైకెగయడం అనేవి ఈ జలవృత్తులు. రసతన్మాత్రవల్ల దైవప్రేరణతో మార్పుచెందిన జలంనుండి గంధతన్మాత్రం పుట్టింది. ఈ గంధతన్మాత్రం వలన పృథ్వి (భూమి) ఏర్పడింది. ఘ్రాణేంద్రియం (ముక్కు) గంధాన్ని గ్రహించేదయింది. ఈ గంధం ఒకటే అయినా ఇంగువ మొదలైన పదార్థాలతో కలిసిన కారణంగా మిశ్రమగంధం అనీ, నిలువ ఉన్న పెరుగు ముద్ద, జంతుమాంసం మొదలైన వానితో కలిసినప్పుడు దుర్గంధం అనీ, కర్పూరం మొదలైనవానితో కలిసినపుడు సుగంధం అనీ, తామరపూలు మొదలైన వానితో కలిసినపుడు శాంతగంధం అనీ, వెల్లుల్లి మొదలైన వానితో కలిసినపుడు ఉగ్రగంధం అనీ, పాసిపోయిన చిత్రాన్నం వంటి వాటితో కలిసినపుడు ఆమ్లగంధం అనీ వేరువేరు పదార్థాలతో కలిసినపుడు మరెన్నో విధాలుగా పేర్కొనబడుతుంది. భూమికి సంబంధించిన సాధారణ ధర్మాలు ఏవనగా ప్రతిమల రూపాన్నీ వాటి ఆకారాలనూ నిలుపుకోవడం, జలం మొదలైన వాటితో అవసరం లేకుండా స్వతంత్రంగా నిలబడగలగటం, జలాదులకు తాను ఆధారమై ఉండటం, ఆకాశం, వాయువు, తేజస్సు, జలం వీనిని విభజించడం, సకల జీవరాసులకు దేహంగా పనిచేయటం అనేవి పృథ్వీవృత్తులు” అని చెప్పి కపిలుడు ఇంకా ఇలా అన్నాడు. “పంచభూతాలకు సాధారణ ధర్మాలు విన్నావు. ఇవికాక వానికి సంబంధించిన అసాధారణ ధర్మాలు విను. ఆకాశానికి అసాధారణగుణం శబ్దం. దీనిని శ్రవణేంద్రియం గ్రహిస్తుంది. వాయువుకు అసాధారణగుణం స్పర్శం. దీనిని త్వగింద్రియం గ్రహిస్తుంది. తేజస్సుకు అసాధారణగుణం రూపం. దీనిని నేత్రేంద్రియం గ్రహిస్తుంది. జలానికి అసాధారణగుణం రసం. దీనిని జిహ్వేంద్రియం గ్రహిస్తుంది. పృథివికి అసాధారణగుణం గంధం. దీనిని ఘ్రాణేంద్రియం గ్రహిస్తుంది. ఆకాశం మొదలైన అన్నింటితో సంబంధం ఉండడం వల్ల భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అసాధారణ గుణాలు అయినాయి. మహత్తు, అహంకారం, పంచతన్మాత్రలు అనే ఈ ఏడు తత్త్వాలు ఒకదానితో ఒకటి కలిసి భోగానుభవానికి పాత్రుడైన పురుషుని కల్పించటానికి అసమర్థంగా ఉన్న ఆ సమయంలో కాలస్వరూపుడూ అంతుపట్టని అస్తిత్వం కలవాడూ, జగత్కారణుడూ, సత్త్వరజస్తమోగుణాలకు అతీతుడూ, సమస్తాన్ని నియమించేవాడూ, నిరంజనాకారుడూ అయిన సర్వేశ్వరుడు పైన చెప్పబడిన పురుషునిలో ప్రవేశించాడు. అప్పుడు ఒకదానితో ఒకటి కలగాపులగమై ఘర్షణ పొంది కలిసిపోయిన మహదాదుల వలన అధిష్ఠాతయైన భగవంతుని చైతన్యం కోల్పోయిన ఒక అండం పుట్టింది.