పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిల దేవహూతి సంవాదంబు

  •  
  •  
  •  

3-891-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అందుఁ బ్రకృతి చతుర్వింశతితత్త్వాత్మకంబై యుండు;నది యెట్లనినం బంచమహాభూతంబులును, బంచతన్మాత్రలును, జ్ఞానకర్మాత్మకంబు లయిన త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులు వాక్పాణి పాదపాయూపస్థంబులు నను దశేంద్రియంబులును, మనోబుద్ధి చిత్తాహంకారంబు లను నంతఃకరణచతుష్టయంబును నను చతుర్వింశతి తత్త్వాత్మకం బైన సగుణబ్రహ్మ సంస్థానంబు సెప్పితి; నిటమీఁదఁ గాలం బను పంచవింశకతత్త్వంబుసెప్పెద;నది గొందఱు పురుషశబ్దవాచ్యుం డైన యీశ్వరుని పౌరుషంబు గాలశబ్దంబునఁ జెప్పబడు నందురు; యందు నహంకార మోహితుండై ప్రకృతి వొంది జీవుండు భయంబుఁ జెందు; ప్రకృతిగుణసామ్యంబునం జేసి వర్తించి నిర్విశేషుం డగు భగవంతుని చేష్టా విశేషంబు దేనివలన నుత్పన్నం బగు నదియ కాలం బని చెప్పంబడు; నదియు జీవరాశ్యంతర్గతం బగుటంజేసి పురుషుండనియు వాని బహిర్భాగ వ్యాప్తిం జేసి కాలం బనియుఁ జెప్పం బడు;నాత్మ మాయం జేసి తత్త్వాంతర్గతుం డయిన జీవునివలన క్షుభితం బయి జగత్కారణం బగు ప్రకృతి యందు పరమపురుషుడు దన వీర్యంబు పెట్టిన నా ప్రకృతి హిరణ్మయం బైన మహత్తత్త్వంబు పుట్టించె;నంత సకల ప్రపంచబీజభూతుడును లయవిక్షేప శూన్యుండును నగు నీశ్వరుండు దన సూక్ష్మవిగ్రహంబు నందు నాత్మ గతం బైన మహదాది ప్రపంచంబుల వెలిగించుచు స్వతేజోవిపత్తిం జేసి యాత్మప్రస్వాపనంబు సేయు నట్టి తమంబును గ్రసించె"నని చెప్పి; వెండియు నిట్లనియె.

టీకా:

అందున్ = అందులో {ప్రకృతి చతుర్వింశతి తత్త్వములు – పంచ భూతములు (1పృథివి 2జలము 3అగ్ని 4వాయువు 5ఆకాశము) పంచ తన్మాత్రలు (6శబ్దము 7స్పర్శము 8రూపము 9రుచి 10వాసన) పంచ జ్ఞానేంద్రియములు (11చర్మము 12కన్ను 13ముక్కు 14చెవి 15నాలుక) పంచ కర్మేంద్రియములు (16వాక్కు 17చేతులు 18కాళ్ళు 19గుదము 20ఉపస్థు) అంతఃకరణ చతుష్టయము (21మనస్సు 22బుద్ధి 23చిత్తము 24అహంకారము)}; ప్రకృతి = ప్రకృతి; చతుర్వింశతి = ఇరవైనాలుగు; తత్త్వ = తత్త్వములు; ఆత్మకంబున్ = కలిగినది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అది = అది; ఎట్లు = ఏ విధముగ; అనినన్ = అనగ; జ్ఞాన = జ్ఞానమునకు; కర్మ = కర్మమునకు; ఆత్మకంబుల్ = సంబంధించినవి; అయిన = అయినట్టి; త్వక్ = చర్మము; చక్షు = కన్ను; శోత్ర = చెవి; జిహ్వ = నాలుక; ఘ్రాణంబులు = ముక్కులును; వాక్ = వాక్కు; పాణి = చేతులు; పాద = కాళ్ళు; పాయు = గుదము (మలావయవము); ఉపస్థు = ఉపస్థు (జననేంద్రియము) లు; అను = అనెడి; దశేంద్రియంబులును = పదిఇంద్రియములును; మనస్ = మనస్సు; బుద్ధి = బుద్ధి; చిత్త = చిత్తము; అహంకారంబులు = అహంకారములు; అను = అనెడి; అంతఃకరణచతుష్టయంబును = చతురాంతఃకరణములును {అంతఃకరణ చతుష్టయంబులు - 1మనస్సు 2బుద్ధి 3చిత్తము 4 అహంకారము}; అను = అనెడి; చతుర్వింశతి = ఇరవైనాలుగు {చతుర్వింశతి తత్త్వములు - అష్టప్రకృతులు (1అవ్యకత్తము 2బుద్ధి 3అహంకారము పంచ తన్మాత్రలు అను 4శబ్దము 5స్పర్శము 6దృక్కు 7ఘ్రాణము 8రసనము) మరియును షోడశ వికృతులును (పంచ భూతములు (1పృథివి 2జలము 3అగ్ని 4వాయువు 5ఆకాశము) పంచ జ్ఞానేంద్రియములు (6చర్మము 7కన్ను 8ముక్కు 9చెవి 10నాలుక) పంచ కర్మేంద్రియములు (11వాక్కు 12చేతులు 13కాళ్ళు 14గుదము 15ఉపస్థు) మరియు16మనస్సు) పంచ వింశకము (25వది) కాలము (పురుషుడు)}; తత్త్వ = తత్త్వముల; ఆత్మకంబున్ = కలిగినది; ఐన = అయినట్టి; సగుణ = గుణములతో కూడిన; బ్రహ్మ = బ్రహ్మ యొక్క; సంస్థానంబున్ = నివాసమైనది; చెప్పితిన్ = తెలిపితిని; ఇటమీద = తరువాత; కాలంబు = కాలము; అను = అనెడి; పంచవింశక = ఇరవైయైదవ; తత్త్త్వంబున్ = తత్త్త్వమును; చెప్పెదన్ = చెప్తాను; అది = దానిని; కొందఱు = కొంతమంది; పురుష = పురుషుడు అను; శబ్ద = శబ్దముచేత; వాచ్యుండు = చెప్పబడువాడు; ఐన = అయినట్టి; ఈశ్వరుని = భగవంతుని; పౌరుషంబున్ = పురుషుని లక్షణము; కాల = కాలము అను; శబ్దంబునన్ = శబ్దముచేత; చెప్పబడును = చెప్పబడును; అందురు = అందురు; అందున్ = అందులో; అహంకార = అహంకారముచే; మోహితుండు = మోహింపబడువాడు; ఐ = అయ్యి; ప్రకృతిన్ = ప్రకృతిని; పొంది = చెంది; జీవుండు = జీవి; భయంబున్ = భయమును; చెందు = చెందును; ప్రకృతి = ప్రకృతి; గుణ = గుణముల; సామ్యంబునన్ = సమత్వము; చేసి = వలన; వర్తించి = ప్రవర్తించి; నిర్విశేషుండు = ఏమియును మిగలనివాడు; అగు = అయిన; భగవంతుని = భగవంతుని; చేష్టా = ప్రవర్తనల; విశేషంబున్ = ప్రత్యేకతలు; దేని = దేని; వలనన్ = వలననైతే; ఉత్పన్నంబున్ = పుట్టునది; అగున్ = అగునో; అది = దానిని; కాలంబున్ = కాలము; అని = అని; చెప్పంబడున్ = చెప్పబడును; అదియున్ = అదియు; జీవ = జీవ; రాశి = జాలము; అంతర్గతంబు = లోపలిది; అగుటన్ = అగుట; చేసి = వలన; పురుషుండు = పురుషుడు; అనియున్ = అనియు; వాని = వాని; బహిర్ = బయటి; భాగ = భాగములలో; వ్యాప్తిన్ = వ్యాపించుట; చేసి = వలన; కాలంబున్ = కాలము; అనియున్ = అనియును; చెప్పంబడున్ = చెప్పబడును; ఆత్మ = ఆత్మయొక్క; మాయన్ = మాయ; చేసి = వలన; తత్త్వ = (24)తత్త్వములలో; అంతర్గతుండు = చిక్కుకొన్నవాడు; అయిన = అయిన; జీవుని = జీవుని; వలనన్ = వలన; క్షుబితంబున్ = మిక్కిలి కదలించబడినది; అయి = అయ్యి; జగత్ = విశ్వమునకు; కారణంబున్ = కారణము; అగు = అయిన; ప్రకృతి = ప్రకృతి; అందున్ = అందు; పరమపురుషుండు = పరమపురుషుడు; తన = తన యొక్క; వీర్యంబున్ = వీర్యమును; పెట్టిన = పెట్టగా; ప్రకృతి = ప్రకృతి; హిరణ్ = బంగారు రంగుతో; మయంబున్ = కూడినది; ఐన = అయినట్టి; మహత్ = మహత్తు అనెడి; తత్త్వంబున్ = తత్త్వమును; పుట్టించెన్ = పుట్టించెను; అంతన్ = అంతట; సకల = సమస్తమైన; ప్రపంచ = ప్రపంచమునకు; బీజ = విత్తన; భూతుండును = అంశైనవాడును; లయ = లయమగుట; విక్షేప = కదలుటలు; శూన్యుండును = లేనివాడును; అగు = అయిన; ఈశ్వరుండు = భగవంతుడు; తన = తన యొక్క; సూక్ష్మ = సూక్ష్మ; విగ్రహంబున్ = రూపము; అందున్ = అందు; ఆత్మ = తనయందు; గతంబున్ = చేరినది; ఐన = అయిన; మహత్ = మహత్తు; ఆది = మొదలైన; ప్రపంచంబులన్ = ప్రపంచములను; వెలిగించుచున్ = వెలిగిస్తూ; స్వ = స్వంత; తేజస్ = తేజస్సు; విపత్తిన్ = ప్రసారము; చేసి = వలన; ఆత్మన్ = తనను; ప్రస్వాపనంబున్ = నిద్రింప; చేయునట్టి = చేసెడి; తమంబునున్ = తమమును; గ్రసించెన్ = మ్రింగెను; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఆ ప్రకృతి ఇరవై నాలుగు తత్త్వాలు కలదై ఉంటుంది. ఎలాగంటే పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలూ; శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే పంచ తన్మాత్రలూ; చర్మం, కన్ను, ముక్కు, చెవి, నాలుక అనే పంచ జ్ఞానేంద్రియాలూ; వాక్కు, చేతులు, కాళ్ళు, మలావయవం, మూత్రావయవం అనే పంచ కర్మేంద్రియాలూ; మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయమూ కలిసి ఇరవైనాలుగు తత్త్వాలు కలిగి సగుణబ్రహ్మకు సంస్థానం అయిన ప్రకృతిని వివరించాను. ఇక కాలం అనే ఇరవై ఐదవ తత్త్వాన్ని గురించి చెబుతాను. కొందరు పురుష శబ్ద వాచ్యుడైన ఈశ్వరుని స్వరూపమే కాలంగా చెప్పబడుతున్నదంటారు. అహంకార మోహితుడై ప్రకృతితో సంబంధం పెట్టుకున్న పురుషుడు జీవుడై భయాదులను అనుభవిస్తాడు. ప్రకృతి గుణాలన్నింటిలో సమానంగా అంతర్యామియై నిర్విశేషుడై ప్రవర్తించే భగవంతుని చేష్టా విశేషాలను కలుగచేసేదే కాలం అనబడుతుంది. అదికూడా జీవరాసులలో అంతర్యామిగా ఉన్నప్పుడు పురుషుడు అనీ, వానికి వెలుపల వ్యాపించి ఉన్నపుడు కాలం అనీ అనబడుతుంది. ఆత్మమాయ కారణంగా ప్రకృతి తత్త్వాలలో విలీనమైన జీవునివల్ల కదిలింపబడినదీ, జగత్తుకు కారణమైనదీ అయిన ప్రకృతియందు భగవంతుడు సృజనాత్మకమైన తన వీర్యాన్ని ఉంచగా ఆ ప్రకృతి తనలోనుంచి హిరణ్మయమైన మహత్త్వాన్ని పుట్టించింది. అనంతరం సకల ప్రపంచానికి మూలమైనవాడూ, లయవిక్షేప శూన్యుడూ అయిన ఈశ్వరుడు తన సూక్ష్మవిగ్రహంలో ఆత్మగతమైన మహదాది ప్రపంచాన్ని వెలిగిస్తూ, తన తేజఃప్రసారం చేత తనను నిద్రింపజేసే తమస్సును హరించి వేశాడు” అని చెప్పి కపిలుడు మళ్ళీ ఇలా అన్నాడు.