పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిల దేవహూతి సంవాదంబు

  •  
  •  
  •  

3-885-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విను మదిగాక యీ భువిఁ దివిం బలుమాఱుఁ జరించు నాత్మ దా
పశు పుత్ర మిత్ర వనితాతతిపైఁ దగులంబు మాని న
న్నఘుని విశ్వతోముఖు నన్యగతిన్ భజియించెనేని వా
నిని ఘనమృత్యురూప భవనీరధి నేఁ దరియింపఁ జేయుదున్.

టీకా:

వినుము = వినుము; అది = అంతే; కాక = కాకుండగ; ఈ = ఈ; భువిన్ = భూమి మీద; దివిన్ = దేవలోకము లందు; పలు = అనేక; మాఱు = సార్లు; చరించు = తిరుగు; ఆత్మ = ఆత్మ; తాన్ = తాను; ధన = సంపదలును; పశు = పశుసంపదలును; పుత్ర = సంతానమును; మిత్ర = మిత్రులయును; వనితా = భార్య మొదలైన; తతిన్ = సమూహముల; పైన్ = మీద; తగులంబున్ = సంగమును, వ్యామోహమును; మాని = వదలివేసి; నన్ = నన్ను; అనఘునిన్ = పుణ్యుని; విశ్వతః = లోక మంతటికిని; ముఖున్ = ముఖ్యుని; అనన్య = ఇతర మెరుగని; గతిన్ = విధముగ; భజియించెన్ = కొలిచినను; ఏని = అట్లయితే; వానిని = వానిని; ఘన = మహా; మృత్యు = మృత్యువు యొక్క; రూప = స్వరూపమైన; భవ = సంసార; నీరధిన్ = సముద్రమును; నేన్ = నేను; తరియింపన్ = దాటునట్లు; చేయుదున్ = చేయుదును.

భావము:

“ఇంకా విను. ఈ భువికీ దివికీ నడుమ పలుసారులు తిరుగుతూ ఉండే ఆత్మ ధనం, పశువులు, పుత్రులు, మిత్రులు, స్త్రీలు మొదలైన తగులాలపై వ్యామోహం విడిచిపెట్టి పాపాలను సంహరించేవాడనూ, ప్రపంచమంతటా వ్యాపించినవాడనూ అయిన నన్ను ఏకాగ్రచిత్రంతో ఆరాధించినట్లైతే ఆ మానవుని మృత్యుమయమైన సంసారసముద్రం నుండి తరింపజేస్తాను.