పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కన్యకానవక వివాహంబు

  •  
  •  
  •  

3-849-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత; నా కర్దముండు గమలసంభవ చోదితుం డగుచు యథోచితంబుగా నాత్మీయ దుహితుల వివాహంబు సేయం దలంచి మరీచికిం గళ యను కన్యకను; నత్రికి ననసూయను; నంగిరసునకు శ్రద్ధను; బులస్త్యునకు హవిర్భువును; బులహునకు గతిని; గ్రతువునకుఁ గ్రియను; భృగునకు ఖ్యాతిని; వసిష్ఠునకు నరుంధతిని; నధర్వునకు శాంతినింగా నిజ కులాచార సరణిం బరిణయంబు గావించిన వారును గృత దాన పరిగ్రహులును గర్దమ కృత సంభావనా సంభావితు లగుచు నతని చేత ననుజ్ఞాతులై జాయాసహితు లగుచు నిజాశ్రమ భూములకుం జని; రంతం గర్దముండు దేవోత్తముం డగు విష్ణుండు దన మందిరంబున నవతరించి వసించి యుంటం దన చిత్తంబున నెఱింగి; వివిక్త స్థలంబునకుం జని యచ్చటఁ గపిలునికి వందన బాచరించి యిట్లనియె.
కన్యకానవకం

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; కర్దముండున్ = కర్దముడు; కమలసంభవ = బ్రహ్మదేవునిచే; చోదితుడు = ప్రేరేపింపబడినవాడు; అగుచున్ = అవుతూ; యథోచితంబుగాన్ = తగిన విధముగా; ఆత్మీయ = తన యొక్క; దుహితులన్ = కూతుర్లకు; వివాహంబున్ = వివాహమును; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొని; మరీచి = మరీచి; కిన్ = కి; కళ = కళ; అను = అను; కన్యకను = కన్యను; అత్రి = అత్రి; కిన్ = కి; అనసూయను = అనసూయను; అంగిరసున్ = అంగిరసుని; కున్ = కి; శ్రద్ధను = శ్రద్ధను; పులస్త్యున్ = పులస్త్యుని; కున్ = కి; హవిర్భువును = హవిర్భువును; పులహున్ = పులహున; కున్ = కి; గతిని = గతిని; క్రతువున్ = క్రతువున; కున్ = కి; క్రియను = క్రియని; భృగువున్ = భృగువున; కున్ = కు; ఖ్యాతిని = ఖ్యాతిని; వసిష్ఠున్ = వసిష్ఠుని; కున్ = కి; అరుంధతి = అరుంధతిని; అధర్వున్ = అధర్వుని; కున్ = కి; శాంతినిన్ = శాంతిని; కాన్ = అగునట్లు; నిజ = తన; కుల = వంశ; ఆచార = ఆచారముల; సరణిన్ = విధముగ; పరిణయంబున్ = వివాహమును; కావించినన్ = చేసిన; వారునున్ = వారు కూడ; కృత = చేసిన; దాన = దానమును; పరిగ్రాహులునున్ = తీసుకొన్నవారును; కర్దమ = కర్దమునిచే; కృత = చేయబడిన; సంభావన = గౌరవములచే; సంభావితులున్ = ఆదరింపబడినవారు; అగుచున్ = అవుతూ; అతని = అతని; చేతన్ = వద్ద; అనుజ్ఞాతులు = వీడ్కోలు పొందినవారు; ఐ = అయ్యి; జాయా = భార్యతో; సహితులు = కూడినవారు; అగుచున్ = అవుతూ; నిజ = తమ; ఆశ్రమ = ఆశ్రమములు ఉన్న; భూముల్ = ప్రదేశముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అంతన్ = అంతట; కర్దముండున్ = కర్దముడు; దేవోత్తముండు = భగవంతుడు {దేవోత్తముడు - దేవుళ్ళలో ఉత్తముడు, విష్ణువు}; అగు = అయిన; విష్ణుండు = విష్ణుమూర్తి; తన = తన యొక్క; మందిరంబునన్ = గృహమున; అవతరించి = అవతారము ధరించి; వసించి = నివసించి; ఉంటన్ = ఉండుటను; చిత్తంబునన్ = మనసులో; ఎఱింగి = తెలిసి; వివిక్త = ఒంటరి; స్థలంబున్ = ప్రదేశమున; కున్ = కు; చని = వెళ్ళి; అచ్చటన్ = అక్కడ; కపిలున్ = కపిలుని; కిన్ = కి; వందనము = నమస్కారము; ఆచరించి = చేసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

తరువాత ఆ కర్దముడు బ్రహ్మదేవుని ఆదేశానుసారం తన కుమార్తెలకు యథావిధిగా పెండ్లిండ్లు చేయాలని నిశ్చయించినవాడై కళను మరీచికి, అనసూయను అత్రికి, శ్రద్ధను అంగిరసునకు, హవిర్భువును పులస్త్యునకు, గతిని పులహువునకు, క్రియను క్రతువుకు, ఖ్యాతిని భృగువుకు, అరుంధతిని వసిష్ఠునకు, శాంతిని అధ్వర్యునకు ఇచ్చి తన కులాచారం ప్రకారం వివాహం చేయగా ఆ మునులు కర్దముని కన్యలను పెండ్లాడి అతని సత్కారాలు అందుకొని ఆయన అనుజ్ఞతో సతీసమేతంగా తమ తమ ఆశ్రమాలకు వెళ్ళారు. ఆ తరువాత కర్దముడు దేవదేవుడైన విష్ణువు తన ఇంట్లో పుట్టి పెరుగుతున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఏకాంత ప్రదేశంలో కపిలునికి నమస్కరించి ఇలా అన్నాడు.