పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిలుని జన్మంబు

  •  
  •  
  •  

3-839-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్టి మహోత్సవంబున దేవహూతికిం దత్త్వబోధంబుఁ గావించు కొఱకుఁ దదీయ గర్భంబున నుదయించిన పరబ్రహ్మస్వరూపుం డైన నారాయణుని దర్శించుకొఱకు మరీచి ప్రముఖ మునిగణ సమేతుం డై చతుర్ముఖుఁడు సనుదెంచి యమ్మహాత్ముని దర్శించి కర్దమ దేవహూతులం గనుంగొని యిట్లనియె.

టీకా:

ఇట్టి = ఇటువంటి; మహా = గొప్ప; ఉత్సవంబునన్ = ఉత్సవములో; దేవహూతి = దేవహూతి; కిన్ = కి; తత్వ = తత్వమును; బోధంబున్ = బోధించుట; కావించు = చేయుట; కొఱకున్ = కోసమై; తదీయ = ఆమె; గర్భంబునన్ = కడుపున; ఉదయించిన = పుట్టిన; పరబ్రహ్మస్వరూపుడు = గోవిందుడు {పరబ్రహ్మస్వరూపుడు - పరబ్రహ్మ యొక్క స్వరూపము అయినవాడు, విష్ణువు}; ఐన = అయినట్టి; నారాయణునిన్ = హరిని {నారాయణుడు - నారములు (నీరు) అందు వసించువాడు, విష్ణువు}; దర్శించు = దర్శించుకొనుట; కొఱకున్ = కోసమై; మరీచి = మరీచి; ప్రముఖ = మొదలగు ప్రముఖమైన; ముని = మునుల; గణ = సమూహముతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; చతుర్ముఖుడు = బ్రహ్మదేవుడు {చతుర్ముఖుడు - చతుః (నాలుగు, 4) ముఖములు కలవాడు, బ్రహ్మదేవుడు}; చనుదెంచి = వచ్చి; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవానిని {మహాత్ముడు - గొప్పవాడు. విష్ణువు}; దర్శించి = దర్శించుకొని; కర్దమ = కర్దముడు; దేవహూతులన్ = దేవహూతులను; కనుంగొని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఇటువంటి మహోత్సవ సమయంలో దేవహూతికి తత్త్వజ్ఞానాన్ని బోధించడానికి ఆమె గర్భంలో పుట్టిన పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుని దర్శించడానికి మరీచి మొదలైన మునులతో కూడి బ్రహ్మదేవుడు వచ్చి, ఆ మహాత్ముని దర్శనం చేసికొని కర్దమ దేవహూతులను చూచి ఇలా అన్నాడు.