పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతితో గ్రుమ్మరుట

  •  
  •  
  •  

3-817-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విని యాకువలయాక్షి పతిసేవాయాస మలినాంబరయు, వేణీభూత శిరోజయు, ధూళిధూసరితాతికృశీభూతాంగయు, శబలస్తనయు నై బిందుసరోవరంబుఁ బ్రవేశించి తజ్జలంబులఁ గ్రుంకులిడు సమయంబునఁ దద్వాఃపూర మధ్యంబున రుచిర సూక్ష్మాంశుకధారిణులుఁ, గిశోర వయఃపరిపాక శోభితలు, నుత్ఫలగంధులు నగు కన్యాసహస్రంబులు దేవహూతిం గనుంగొని యిట్లనిరి.

టీకా:

విని = విని; ఆ = ఆ; కువలయాక్షి = స్త్రీ {కువలయాక్షి - కువలయము (కలువ)ల వంటి కన్నులు ఉన్నామె (స్త్రీ)}; పతి = భర్త యొక్క; సేవా = సేవించుట యందలి; ఆయాస = శ్రమ వలన; మలిన = మాసిన; అంబరయు = వస్త్రములు కలదియును; వేణీ = జటలు; భూత = కట్టిన; శిరోజయున్ = కేశములు కలదియును; ధూళి = ధూళిచేత; ధూసరిత = మాసిన; అతి = మిక్కిలి; కృశీభూత = కృశించిపోయిన; అంగయున్ = దేహము కలదియును; శబల = వివర్ణమైన; స్తనయున్ = కుచములు కలదియును; ఐ = అయ్యి; బిందుసరోవరంబునన్ = బిందుసరోవరములో; ప్రవేశించి = ప్రవేశించి; తత్ = దాని; జలంబులన్ = నీటిలో; క్రుంకులిడు = స్నానము చేయు; సమయంబునన్ = సమయములో; తత్ = ఆ; వాః = నీటి; పూరః = ప్రవాహము; మధ్యంబునన్ = మధ్యలో; రుచిర = కాంతులీను; సూక్ష్మ = చిన్నచిన్న; అంశుక = వస్త్రములు; ధారిణులు = ధరించినవారు; కిశోర = కిశోర {కిశోరవయస్సు - బాల్యమునకును యౌవనమునకును మధ్య వయసు}; వయస్ = వయస్సుతో; పరిపాక = యుక్తమైన; శోభితలును = శోభ కలవారును; ఉత్పల = కలువపూల; గంధులున్ = వాసనలు కలవారును; అగు = అయిన; కన్యకా = కన్యకల; సహస్రంబులున్ = సమూహములు; దేవహూతిన్ = దేవహూతిని; కనుంగొని = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

కలువకన్నుల ఆ దేవహూతి కర్దముని మాటలు విన్నది. ఆమె పతిసేవలో అలసిపోయి యున్నది. చీర మాసిపోయింది. శిరోజాలు జడలు కట్టాయి. శరీరం ధూళిధూసరితమై కృశించింది. వక్షస్థలం వివర్ణమయింది. ఆమె భర్త ఆజ్ఞానుసారం సరస్వతీ నదీజలాలతోను, జలచరాలతోను నిండిన బిందుసరోవరంలో దిగి స్నానం చేసే సమయంలో ఆ జలప్రవాహంలోనుంచి నాజూకైన సన్నని పట్టువస్త్రాలు ధరించినవారూ, నవయౌవనంలో ఉన్నవారూ, కలువపూల పరిమళం కలవారూ అయిన వేలకొద్ది కన్యలు ఆమెకు కనిపించి ఇలా అన్నారు.

3-818-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తరుణీ! సంచిత ధర్మా
ణల మగు మేము నీకు దమలభక్తిం
రిచర్యసేయనేర్తుము
రుణాకలితేక్షణములఁ నుగొను మమ్మున్."

టీకా:

తరుణీ = వనిత {తరుణి - తరణ వయసున ఉన్నామె, స్త్రీ}; సంచిత = ప్రోగుపడిన, { వ్యు. సంచితి - ప్రోగు (సమ్ + చి + క్తిన్), కృ.ప., గుంపు}; ధర్మ = ధర్మములను; ఆచరణలము = ఆచరించువారము; అగు = అయిన; మేము = మేము; నీకున్ = నీకు; సదమల = స్వచ్ఛమైన; భక్తిన్ = భక్తితో; పరిచర్య = సేవ; చేయన్ = చేయుటను; నేర్తుము = నేర్చినవారము; కరుణా = దయతో; కలిత = కూడిన; ఈక్షణములన్ = చూపులతో; కనుగొనుము = చూడుము; మమ్మున్ = మమ్ములను.

భావము:

“ఓ యువతీ! ధర్మకార్యాలు ఆచరించే మేము నిర్మలమైన భక్తితో నీకు సేవలు చేయగలం. నీవు మమ్మల్ని దయతో చూడు.

3-819-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని పల్కి; డాసి యయ్యతివకు నభ్యంజ-
నోద్వర్తనములు పెంపొనరఁ జేసి
లయజకర్పూర హిత వాసిత హేమ-
లశోదకంబుల లక మార్చి
వళవస్త్రంబులఁ డి యొత్తి సర్వాంగ-
ధూపంబు లొసఁగి కస్తూరి యలది
మంజు శింజన్మణి మంజీర కింకిణీ-
లరావకలిత మేలలు రత్న

3-819.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత తాటంకముద్రికా కంకణాది
ముచితానర్ఘ్య హేమభూణము లొసఁగి
వ్య మాల్యానులేపనాంరము లిచ్చి
డ్రసోపేత వివిధాన్న మితిఁ దనిసి.

టీకా:

అని = అని; పల్కి = పలికి; డాసి = సమీపించి; ఆ = ఆ; అతివ = స్త్రీ; కున్ = కి; అభ్యంజన = తలంటు; ఉద్వర్తనములు = నలుగుపెట్టుటలు; పెంపొనరన్ = అతిశయించునట్లు; చేసి = చేసి; మలయజ = చందనమును; కర్పూర = కర్పూరముల; మహిత = గొప్ప; వాసిత = వాసనకల; హేమ = బంగారు; కలశ = పాత్రలందలి; ఉదకంబులన్ = నీటితో; జలకము = స్నానము; ఆర్చి = చేయించి; ధవళ = తెల్లని; వస్త్రంబులన్ = బట్టలతో; తడి = తడిని; ఒత్తి = తుడిచి; సర్వ = అన్ని; అంగ = అవయవములకును; ధూపంబులున్ = ధూపములను; ఒసగి = పట్టి; కస్తూరిన్ = కస్తూరిని; అలది = రాసి; మంజు = మనోహరముగ; శింజని = శబ్గములుచేయు; మణి = మణులద్దిన; మంజీర = అందెలు; కింకిణీ = గజ్జల; కలరావ = గలగలశబ్దములు; కలిత = కలిగిన; మేఖలలు = వడ్డాణములు; రత్న = రత్నములు; ఖచిత = తాపిన; తాటంక = చెవిపోగులు;
ముద్రికా = ఉంగరములు; కంకణ = గాజులు; ఆది = మొదలగు; సముచిత = తగిన; అనర్ఘ = వెలలేని; హేమ = బంగారు; భూషణములు = ఆభరణములు; ఒసగి = ఇచ్చి; భవ్య = శుభకరములైన; మాల్య = మాలలు; అనులేపన = మైపూతలు; అంబరములున్ = వస్త్రములును; ఇచ్చి = ఇచ్చి; షడ్ = ఆరు (6) {షడ్రసములు - షడ్రుచులు, 1తీపి 2 కారము 3పులుపు 4 ఉప్పదనము 5వగరు 6 చేదు}; రస = రుచులతో; ఉపేత = కూడిన; వివిధ = అనేకరకములైన; అన్న = ఆహార; సమితిన్ = సమూహములతో; తనిపి = తృప్తిపరచి.

భావము:

ఇలా అని వారంతా దేవహూతిని సమీపించి, ఆమెకు తలంటి, నలుగు పెట్టి, చందన కర్పూరాలు వెదజల్లే బంగారు బిందెల జలాలతో స్నానం చేయించి, తెల్లని వస్త్రాలతో తడి ఒత్తి, శరీరమంతా అగరు ధూపాలు వేసి, కస్తూరి పూతలు పూసి, మధురంగా ధ్వనించే మణిమంజీరాలు పాదాలకు తొడిగి, చిరుగంటల సవ్వడితో ఒప్పే ఒడ్డాణం నడుముకు అలంకరించి, రత్నాలు చెక్కిన కర్ణాభరణాలు, ఉంగరాలు, కంకణాలు మొదలైన విలువైన బంగారు ఆభరణాలను ఇచ్చి, పూలదండలు సింగారించి, షడ్రసోపేతమైన భోజనాదులతో సంతృప్తి పరచారు.

3-820-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుం, గనకపాత్ర రచితంబు లయిన కర్పూరనీరాజనంబు లిచ్చి; రుచిరాసనంబునఁ గూర్చుండఁ బెట్టి దర్పణంబు సేతి కిచ్చినం దత్ప్రతిఫలిత నిజ దేహంబు గనుంగొని; కర్దముని మనంబునం దలంచిన నతండునుం గన్యకాసహస్రంబును దత్క్షణంబునఁ దన సన్నిధి నుండుటం జూచి; నిజభర్తృయోగమాయా ప్రభావంబునకు నద్భుతంబు నొందె; నంతఁ గర్దముండునుం గృతస్నాన యైన దేవహూతిం గనుంగొని వివాహంబునకు ముందట నే చందంబునం దనరుచుండె నా చందంబునం జెన్నొందుచుండుటకు నానందభరితుం డై భార్యా సహితంబుగఁ దత్కన్యకాసహస్రంబు గొలువ నిజ విమానారూఢుం డై తారాగణ పరివృత రోహిణీ యుక్తుం డగు సుధాకరుండునుం బోలె నొప్పుచుఁ దదనంతరంబ.

టీకా:

మఱియున్ = ఇంకను; కనక = బంగారు; పాత్ర = పాత్రలలో; రచితంబులు = తయారుచేసినవి; అయిన = అయినట్టి; కర్పూర = కర్పూర; నీరాజనంబులు = హారతులు; ఇచ్చి = ఇచ్చి; రుచిర = కాంతివంతమైన; ఆసనంబునన్ = ఆసనము నందు; కూర్చుండబెట్టి = కూర్చోబెట్టి; దర్పణంబున్ = అద్దమును; చేతి = చేతి; కిన్ = కి; ఇచ్చినన్ = ఇవ్వగ; తత్ = దానిలో; ప్రతిఫలిత = ప్రతిబింబిస్తున్న; నిజ = తన; దేహంబునున్ = శరీరమును; కనుంగొని = చూసి; కర్దముని = కర్దముని; మనంబునన్ = మనసులో; తలంచినన్ = తలచుకొనగానే; అతండునున్ = అతడును; కన్యకా = కన్యకల; సహస్రంబునున్ = సమూహములును; తత్క్షణంబునన్ = తత్క్షణమే; తన = తన యొక్క; సన్నిధిన్ = సమీపమున; ఉండుటన్ = ఉండుటను; చూచి = చూసి; నిజ = తన; భర్తృ = భర్త యొక్క; యోగమాయా = యోగమాయ యొక్క; ప్రభావంబున్ = గొప్పదనమున; కున్ = కు; అద్భుతంబున్ = ఆశ్చర్యమును; పొందె = పొందెను; అంతన్ = అంతట; కర్దముండునున్ = కర్దముడు కూడ; కృత = చేసిన; స్నాన = స్నానము కలది; ఐన = అయినట్టి; దేవహూతిన్ = దేవహూతిని; కనుంగొని = చూసి; వివాహంబున్ = పెండ్లి; కున్ = కి; ముందటన్ = ముందు; ఏ = ఏ; చందంబునన్ = విధముగ; తనరుచున్ = అతిశయించి; ఉండె = ఉండెనో; ఆ = ఆ; చందంబునన్ = విధముగ; చెన్ను = అందమును; పొందుచున్ = కలిగి; ఉండుట = ఉండుట; కున్ = కు; ఆనంద = ఆనందముతో; భరితుండు = నిండినవాడు; ఐ = అయ్యి; భార్యా = భార్యతో; సహితంబుగన్ = కలిసి; తత్ = ఆ; కన్యకా = కన్యకల; సహస్రంబు = సమూహము; కొలువన్ = సేవిస్తుండగ; నిజ = తన; విమాన = విమానమును; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; తారా = తారకల; గణ = గణములుచే; పరివృత = చుట్టబడిన; రోహిణీ = రోహిణితో; యుక్తుండు = కూడినవాడు; అగు = అయినట్టి; సుధాకరుఁడునున్ = చంద్రుని; పోలెన్ = వలె; ఒప్పుచున్ = చక్కగఉండి; తదనంతరంబ = తరవాత;

భావము:

ఇంకా బంగారు పళ్ళెరాలలో కర్పూరం వెలిగించి హారతులిచ్చి, రమణీయమైన రత్నపీఠంమీద కూర్చోబెట్టి అద్దం చేతికిచ్చారు. దేవహూతి అద్దంలో ప్రతిఫలించిన తన రూపాన్ని చూచుకొని తన పతి అయిన కర్దముని మనస్సులో భావించింది. మరుక్షణంలో కర్దముడు, వేలకొలది కన్యకలు ఆమె చెంత ఉన్నారు. అది చూచి భర్తయొక్క యోగమాయా ప్రభావానికి ఆమె ఆశ్చర్యపడ్డది. అప్పుడు కర్దముడు స్నానం చేసి ఆసీనురాలైన దేవహూతిని చూచి, వివాహానికి పూర్వం ఆమె ఎలా ఉండేదో అలాగే చెక్కు చెదరని చక్కదనంతో ఉన్నందుకు మహానందం పొందాడు. కన్యలందరూ తమ్ము సేవిస్తూ ఉండగా సతీసమేతుడై విమానం ఎక్కి, చుక్కలతో చుట్టబడిన రోహిణీ సహితుడైన చంద్రునిలా ప్రకాశించాడు.

3-821-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చి శుభమూర్తి యమ్ముని యశేష దిగీశ విహార యోగ్యమున్
సురుచిరమందగంధవహశోభితమున్ నికటప్రధాతు ని
ర్ఝసరిదంబు శీతలతుషారమునై తనరారు మేరుకం
మునకేగి దేవవనితాయుతుఁడైన కుబేరుచాడ్పునన్

టీకా:

చిర = మిక్కిలి; శుభ = శుభముల; మూర్తి = రూపము కలవాడు; ఆ = ఆ; ముని = ముని; అశేష = సమస్తమైన; దిక్ = దిక్కులకు; ఈశ = పతులకు; విహార = విహరించుటకు; యోగ్యమున్ = తగనదియును; సురుచిర = మనోఙ్ఞమైన; (సురు = చలిస్తూ; చిర = ఎక్కువ సమయము ఉండు;) మంద = పిల్ల;) గంధవహ = వాయువులచే; శోభితమున్ = శోభిల్లుతున్నదియును; నికట = సమీప మందలి; ప్రధాతు = చక్కటి ధాతువులతో కూడిన; నిర్ఝర = సెలయేటి; సరిత్ = ప్రవాహపు; అంబు = నీటి; శీతల = చల్లని; తుషారమున్ = తుంపరలు కలదియును; ఐ = అయ్యి; తనరారు = అతిశయించు; మేరు = మేరు; కంధరమున్ = పర్వతమున; కున్ = కు; ఏగి = వెళ్ళి; దేవ = దేవతా; వనితా = స్త్రీలతో; యుతుడు = కూడినవాడు; ఐన = అయినట్టి; కుబేరు = కుబేరుని; చాడ్పునన్ = విధముగ.

భావము:

నిత్యమంగళ స్వరూపుడైన ఆ కర్దముడు విమానారూఢుడై సమస్త దిక్పాలురు విహరించడానికి యోగ్యమైనదీ, మెల్లగా చల్లగా వీచే మలయమారుతాలతో కూడినదీ, సమీపంలో ప్రవహించే సెలయేళ్ళ నీటి తుంపురుల చల్లదనం కలదీ అయిన మేరుపర్వతం శిఖరాల మీద, నిత్యమంగళ స్వరూపుడైన ఆ కర్దముడు, సురసుందరీ సమేతుడైన కుబేరునిలా విహరించాడు.

3-822-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును.

టీకా:

మఱియును = ఇంకను.

భావము:

ఇంకా…

3-823-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రోద్యానవనప్రదేశములు నవ్యారామభూముల్ దళ
త్కుముదాంభోజ విభాసిమానస సరఃకూలంబులున్ మంజుకుం
ములుం జైత్రరథంబు విస్ఫురిత విస్రంభంబునం జూచె నె
య్యమునం గర్దమయోగి కామగవిమానారూఢుఁ డై చెచ్చెరన్.

టీకా:

అమర = దివ్యమైన; ఉద్యానవన = ఉద్యానవన; ప్రదేశములున్ = స్థలములు; నవ్య = కొత్త; ఆరామ = విశ్రాంతి; భూముల్ = స్థలములు; దళత్ = వికసిస్తున్న; కుముద = కలువలు; అంభోజ = పద్మములు తోను; విభాసిమాన = ప్రకాశిస్తున్న; మానససరస్ = మానస సరోవరము యొక్క; కూలంబులున్ = తీరములును; మంజు = మనోహరమైన; కుంజములున్ = పొదరిండ్లును; చైత్రరథంబున్ = కుబేరుని తోటయును; స్ఫువిస్ఫురిత = ప్రకాశవంతమైన; విస్రంభంబునన్ = సరదాతో; చూచెన్ = చూసెను; నెయ్యమునన్ = ఇంపుగ, చక్కగ; కర్దమ = కర్దముడు అను; యోగి = యోగి; కామగ = కామగమనముకల; విమాన = విమానము; ఆరూఢుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; చెచ్చెరన్ = శ్రీఘ్రముగ.

భావము:

కర్దమ మహర్షి కోరినచోటికి సంకల్పమాత్రంతోనే తీసుకెళ్ళే ఆ విమానం ఎక్కి, దేవహూతితోపాటు గొప్ప వేడుకతో విహరించాడు. చక్కటి దివ్యఉద్యానవనాలు, సరిక్రొత్త విహారప్రదేశములు, పద్మాలతోనూ, కలువలుతోనూ కలకలాడుతున్న మానస సరోవర తీరాలు, మనోహరమైన పొదరిండ్లు, చైత్రరథం అనే కుబేరుని తోట మున్నుగు అన్నిటినీ తన ఇంతితో ప్రేమపూర్వకంగా విహరించాడు.

3-824-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబున, సమస్త భూభాగంబును వాయువేగంబునం గలయం గ్రుమ్మరి నిఖిల వైమానికలోకంబు నతిశయించి లోకంబులం జరించె; మోక్షదాయకుండుఁ దీర్థపాదుండు నగు పుండరీకాక్షుని సన్నుతించి సేవించు పుణ్యాత్ములకుం బొందరాని పదార్థములు గలవే; యిట్లు కర్దముండు దేవహూతికి నిఖిల ధరాచక్రం బంతయుఁ జూపి; మరల నిజ నివాసంబునకుం జనుదెంచి; కామకేళీవినోదాత్మిక యైయున్న భార్య నుపలక్షించి రతిప్రసంగంబు గైకొని బహు వత్సరంబు లొక్క ముహూర్తంబుగా జరుపుచు నన్యోన్య సరసావలోకనంబుల సముచి తాలింగన సంభాషణంబులం గాల నిరూపణంబు సేయనేరక శత వత్సరంబులు గడపి; తదనంతంరంబ.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగ; సమస్త = సమస్తమైన; భూ = భూమండలము యొక్క; భాగంబునున్ = భాగములను; వాయు = వాయువుతో సమానమైన; వేగంబునన్ = వేగముతో; కలయన్ = కలియ; క్రుమ్మరి = తిరిగి; నిఖిల = సమస్తమైన; వైమానిక = విమానయానము చేయువారి; లోకంబున్ = సమస్తమును; అతిశయించి = మించి; లోకంబులన్ = లోకములందు; చరించెన్ = తిరిగెను; మోక్షదాయకుండున్ = గోవిందుడు {మోక్షదాయకుండు - మోక్షము (ముక్తిని) దాయకుండు (ఇచ్చువాడు), విష్ణువు}; తీర్థపాదుండునున్ = గోవిందుడు {తీర్థపాదుడు - తీర్థము పాదమున కలవాడు, విష్ణువు}; అగు = అయినట్టి; పుండరీకాక్షుని = గోవిందుని {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మములు ) వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; సన్నుతించి = చక్కగ స్తోత్రములు చేసి; సేవించు = సేవించే; పుణ్యాత్ముల్ = పుణ్యాత్ముల; కున్ = కి; పొందరాని = పొందలేని; పదార్థములు = వస్తువులు; కలవే = కలవా ఏమి; ఇట్లు = ఈ విధముగ; కర్దముండు = కర్దముడు; దేవహూతిన్ = దేవహూతి; కిన్ = కి; నిఖిల = సమస్తమైన; ధరాచక్రము = భూమండలము; అంతయున్ = అంతా; చూపి = చూపించి; మరల = మరల; నిజ = తన; నివాసంబున్ = నివాసమున; కున్ = కు; చనుదెంచి = వచ్చి; కామ = మన్మథ; కేళిన్ = కేళి; వినోద = వినోదించు; ఆత్మక = మనసు కలామె; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; భార్యన్ = భార్యను; ఉపలక్షించి = ఉద్దేశించి; రతి = సంభోగమునకై; ప్రసంగంబున్ = చేరుట; కైకొని = స్వీకరించి; బహు = అనేక; వత్సరంబుల్ = సంవత్సరములు; ఒక్క = ఒక; ముహూర్తంబు = ముహూర్తము; కాన్ = అన్నట్లు; జరుపుచూ = నడపుచూ; అన్యోన్య = ఒకరినొకరు; సరస = సరసమైన; అవలోకనంబులన్ = చూపులతోను; సముచిత = తగిన; ఆలింగన = కౌగలింతలు; సంభాషణంబులన్ = కబుర్లాడుకొనుట యందు; కాల = కాలమును; నిరూపణంబున్ = లెక్కించుట; చేయన్ = చేయ; నేరక = లేక; శత = వంద; వత్సరంబులున్ = సంవత్సరములు; గడపి = గడిపి; తదనంతరంబ = తరువాత.

భావము:

ఈ విధంగా కర్దముడు వివిధ ప్రదేశాలను విమానంమీద వాయువేగంతో విహరించి సమస్త దేవతలను అతిశయించినవాడై నేల నాలుగు చెరగులూ సంచరించాడు. మోక్షప్రదాత, పరమపూజ్యుడు అయిన విష్ణుదేవుని భావించి, సేవించే పుణ్యాత్ములు పొందజాలని వస్తువులుంటాయా? ఇలా కర్దముడు దేవహూతికి సమస్త భూమండలాన్ని చూపించి, మళ్ళీ తన నివాసానికి తీసుకొని వచ్చి, శృంగారకేళీ విలాసాలకు అభిముఖురాలైన భార్య హృదయాన్ని గుర్తించి, రతిక్రీడా పరాయణుడైనాడు. ఆ దంపతులు అనేక విధాలైన అభీష్ట సుఖభోగాలను అనుభవిస్తూ పెక్కు సంవత్సరాలు ఒక్క క్షణంగా గడిపాడు. అన్యోన్యం తియ్యనైన చూపులతో విడిపోని కౌగిలింతలతో సరసమైన సంభాషణలతో కలిసి మెలిసి కాలగమనం గమనించకుండా నూరేండ్లు గడిపాడు.