పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-792-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదిగావున; నమ్మహాత్ముని యాజ్ఞోల్లంఘనంబు సేయరా" దని కర్దముండు పలికిన విని స్వాయంభువుండు నిజ భార్య యైన శతరూప తలంపును, బుత్రియైన దేవహూతి చిత్తంబును నెఱింగిన వాఁడై, ముని సమయంబున కియ్యకొని ప్రహృష్ట హృదయుం డగుచు సమంచిత గుణాఢ్యుం డయిన కర్దమునకు దేవహూతిని విధ్యుక్త ప్రకారంబున వివాహంబు సేయించె; తదనంతరంబ; శతరూపయును బారిబర్హసంజ్ఞికంబు లైన వివాహోచిత దివ్యాంబరాభరణంబులు దేవహూతి కర్దముల కొసంగె; నివ్విధంబున నిజ కులాచార సరణిం బరిణయంబు గావించి విగతచింతాభరుం డై స్వాయంభువుండు దుహితృ వియోగ వ్యాకులిత స్వాంతు డై; కూఁతుం గౌఁగలించుకొని, చుబుకంబుఁలు బుడుకుచుఁ, జెక్కిలి ముద్దుగొని, శిరంబు మూర్కొని ప్రేమాతిరేకంబున బాష్పధారాసిక్తమస్తకం జేసి "తల్లీ! పోయివచ్చెద" నని చెప్పి, కర్దమునిచేత నామంత్రితుం డై నిజ భార్యా సమేతంబుగ రథం బెక్కి స పరివారుం డై.

టీకా:

అదిగావునన్ = అందుచేత; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని; ఆజ్ఞన్ = ఆదేశమును; ఉల్లంఘనంబున్ = దాటుటను; చేయన్ = చేయ; రాదు = కూడదు; అని = అని; కర్దముండు = కర్దముడు; పలికినన్ = పలుకగా; విని = విని; స్వాయంభువుండు = స్వాయంభువుడు; నిజ = తన; భార్య = భార్య; ఐన = అయినట్టి; శతరూప = శతరూప యొక్క; తలంపునున్ = ఆలోచనను; పుత్రి = కుమార్తె; ఐన = అయినట్టి; దేవహూతి = దేవహూతి యొక్క; చిత్తంబునున్ = మనసును; ఎఱింగిన = తెలుసుకొన్న; వాడు = వాడు; ఐ = అయ్యి; ముని = ముని యొక్క; సమయంబున్ = నియమమున; కున్ = కి; ఇయ్యకొని = ఒప్పుకొని; ప్రహృష్ట = సంతోషము చెందిన; హృదయుండు = హృదయము కలవాడు; అగుచున్ = అవుతూ; సమంచిత = ప్రకాశిస్తున్న; గుణ = గుణములందు; ఆఢ్యుడు = గొప్పవాడు; అయిన = అయినట్టి; కర్దమున్ = కర్దమున; కున్ = కు; దేవహూతిన్ = దేవహూతిని; విధి = విధినిషేధములందు; ఉక్త = చెప్పబడిన; ప్రకారంబున్ = విధముగ; వివాహంబున్ = పెండ్లి; చేయించెన్ = చేయించెను; తదనంతరంబ = తరువాత; శతరూపయునున్ = శతరూపకూడ; పారిబర్హ = పారిబర్హములు అని {పారిబర్హము - పారిబర్హము, పెండ్లి కానుకలు(సర్వారాయాంధ్ర నిఘంటువు)}; సంజ్ఞికంబులు = పిలవబడునవి; ఐన = అయినట్టి; వివాహ = పెండ్లిసమయమునకు; ఉచిత = తగిన; దివ్య = దివ్యమైన; అంబర = వస్త్రములు; ఆభరణంబులు = ఆభరణములు; దేవహూతి = దేవహూతి; కర్దముల్ = కర్దముల; కున్ = కు; ఒసంగెన్ = ఇచ్చెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; నిజ = తన; కుల = వంశము యొక్క; ఆచార = ఆచారముల; సరణిన్ = ప్రకారముగ; పరిణయంబున్ = వివాహమును; కావించి = చేసి; విగత = పోయిన; చింత = దిగులుతో; భరుడు = భారము కలవాడు; ఐ = అయ్యి; స్వాయంభువుండు = స్వాయంభువుడు; దుహితృ = పుత్రిక యొక్క; వియోగ = ఎడబాటునకు; వ్యాకులిత = కలతబడిన; స్వాంతుడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; కూతున్ = కూతురిని; కౌగలించుకొని = కౌగలించుకొని; చుబుకంబున్ = గడ్డమును; పుడుకుచున్ = తడవుచూ; చెక్కిలిన్ = చెంపమీద; ముద్దుకొని = ముద్దుపెట్టుకొని; శిరంబున్ = శిరస్సును; మూర్కొని = వాసనచూసి; ప్రేమ = ప్రేమ; అతిరేకంబునన్ = అతిశయముచే; బాష్ప = కన్నీటి; ధారా = ధారలచేత; సిక్త = తడసిన; మస్తకన్ = శిరము కలదానిని; చేసి = చేసి; తల్లీ = అమ్మా; పోయివచ్చెదను = వెళ్ళొస్తాను; అని = అని; చెప్పి = చెప్పి; కర్దముని = కర్దముని; చేతన్ = చేత; ఆమంత్రితుండు = వీడ్కోలు చెప్పబడినవాడు; ఐ = అయ్యి; నిజ = తన యొక్క; భార్యా = భార్యతో; సమేతంబుగన్ = సహా; రథంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; సపరివారుండు = పరివారముతో కూడినవాడు; ఐ = అయ్యి.

భావము:

కావున ఆ దేవుని ఆజ్ఞను జవదాటకూడదు” అని కర్దముడు పలుకగా విని స్వాయంభువ మనువు తన భార్య అయిన శతరూప అభిప్రాయాన్ని, కూతురైన దేవహూతి అభిప్రాయాన్ని తెలిసికొని ఆ కర్దముని నియమానికి ఒప్పుకొని, సంతోషిస్తూ ఉత్తమ గుణ సంపన్నుడైన ఆ కర్దమునికి దేవహూతిని ఇచ్చి యథావిధిగా వివాహం చేయించాడు. ఆ తరువాత శతరూప తమ కూతురు అల్లుడు యైన దేవహూతి కర్దములకు పారిబర్హం అనే పేర్లు గల వివాహానికి తగిన దివ్య వస్త్రాలను, ఆభరణాలను ఇచ్చెను. ఆ విధంగా తన కులాచారాన్ని అనుసరించి పెండ్లి చేసి చింతను పోగొట్టుకొన్నవాడై స్వాయంభువ మనువు కుమార్తెను ఎడబాసి పోతున్నాననే విచారంతో ఆమెను కౌగిలించుకొని, చుబుకం పుణికి, చెక్కిలి ముద్దాడి, శిరస్సు మూర్కొని, అతిశయించిన ప్రేమతో ఉబికిన బాష్పధారలతో ఆమె శిరస్సును తడిపి “తల్లీ! పోయి వస్తాను” అని చెప్పి కర్దముని వీడ్కొని భార్యతో రథమెక్కి సపరివారంగా బయలుదేరాడు.