పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-139-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దమలోన మదిరాపాన మద విఘూర్ణిత తామ్రలోచను లయి మత్సరంబుల నొండొరులం బొడిచి సమస్త యాదవులును వేణూజాతానలంబునఁ దద్వంశ పరంపరలు దహనంబు నొందు చందంబునం బొలిసి రది యంతయుం గనుంగొని శ్రీకృష్ణుం డప్పుడు.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; తమలోన = తమలోతాము; మదిరా = మద్యము; పాన = తాగుటవలన; మద = మత్తెక్కి; విఘూర్ణిత = బాగాతిరుగుచున్న; తామ్ర = ఎఱ్ఱని; లోచనులు = కన్నులు ఉన్నవారు; అయి = అయి; మత్సరంబులన్ = స్పర్థలతో; ఒండొరులను = ఒకరినొకరు; పొడిచి = పోట్లాడుకొని, పొడుచుకొని; సమస్త = సమస్తమైన; యాదవులును = యాదవులందరును; వేణూ = వెదురు చెట్టున; జాతా = పుట్టిన; అనలంబునన్ = నిప్పులో; తత్ = ఆ; వంశ = వెదురు; పరంపరలు = పొదలు; దహనంబున్ = తగలబడి; ఒందు = పోవు; చందంబునన్ = విధముగ; పొలిసిరి = నశించిరి; అది = అది; అంతయున్ = అంతా; కనుంగొని = చూసి; శ్రీకృష్ణుడు = కృష్ణుడు; అప్పుడు = అప్పుడు.

భావము:

మధుపానం వలన మత్తెక్కిన వారి కళ్లు బాగా ఎరుపెక్కాయి. కళ్ళు తిరగసాగాయి. మత్సరాలు పెచ్చు పెరిగి, ఒకరి నొకరు పొడుచుకొని చచ్చారు. ఎలా అయితే వెదుళ్ళ రాపిళ్లు వల్ల ఆవిర్భవించిన అగ్నిజ్వాలల్లో వెదురు పొదలన్నీ దగ్ధమైపోతాయో, అలానే యాదవులు అందరూ నాశనమయ్యారు. ఈ యాదవకుల విధ్వంసం అంతా శ్రీకృష్ణుడు తిలకించాడు.