పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-134-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునివరు లేగుదేర యదుముఖ్యులు గొందఱు గూడి ముట్టఁబ
ల్కినఁ గనలొంది వారు దమకించి శపించినఁ గొన్నిమాసముల్
నునెడ దైవయోగమున జాతరఁబో సమకట్టి వేడుకల్
ములఁ దొంగిలింప గరిమన్ నిజయానము లెక్కి యాదవుల్.

టీకా:

ముని = మునులలో; వరులు = శ్రేష్ఠులు; ఏగుదేర = రాగా; యదు = యాదవులలో; ముఖ్యులు = ముఖ్యమైనవారు; కొందఱు = కొందరు; కూడి = కలిసి; ముట్టబల్కినన్ = ఎత్తిపొడుపు మాటలు పలికిన; కనలొంది = బాధపడి; వారు = వారు; తమకించి = సంభ్రమములోపడి; శపించిన = శపించిన; కొన్ని = కొన్ని; మాసముల్ = నెలలు; చనునెడ = జరుగగా; దైవ = దేవునియొక్క; యోగమునన్ = యోగము వలన; జాతరన్ = జాతరకోసం; పోన్ = వెళ్ళుటకు; సమకట్టి = సంకల్పించుకొని; వేడుకల్ = వేడుకలు; మనములన్ = మనసులందు; తొంగిలింప = వికసింపగా; గరిమన్ = గొప్పగా; నిజ = తమ; యానములు = వాహనములు; ఎక్కి = ఎక్కి; యాదవుల్ = యాదవులు.

భావము:

ఇలా ఉండగా కొంతమంది మునీశ్వరులు ద్వారకా నగరానికి వచ్చారు. అప్పుడు కొందరు యాదవ కుమారులు వారిని చుట్టుముట్టి ఎత్తిపొడుపు మాటలతో వారి మనస్సు నొప్పించారు. అందుకు వారు ఆగ్రహించి ఘోరంగా శపించారు. కొన్ని మాసాలు గడిచిన పిమ్మట, దైవయోగం వల్ల యాదవు లంతా ఒక పెద్ద ఉత్సవం చేయాలని తలపెట్టారు. మిక్కిలి కుతూహలంతో కూడిన అంతరంగాలతో పొంగిపోతూ, తమతమ వాహనా లెక్కి జాతరకోసం ప్రయాణమయ్యారు.